రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు వైసీపీ కుట్ర
ABN , Publish Date - Jul 27 , 2025 | 01:03 AM
రాష్ర్టాన్ని ఐదేళ్లపాటు అగాథం లోకి నెట్టేసిన వైసీపీ నేడు రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు యత్ని స్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
గణపవరంలో ప్రజలను పలకరిస్తూ ఉత్సాహంగా పర్యటన
గణపవరం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): రాష్ర్టాన్ని ఐదేళ్లపాటు అగాథం లోకి నెట్టేసిన వైసీపీ నేడు రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు యత్ని స్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం గణపవరంలో అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అధ్యక్ష తన సుపరిపాలనలో తొలి అడుగు సభ నిర్వహించారు. మంత్రి ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇమ్మని కోరిన వ్యక్తి అధి కారం అందుకుని రాష్ర్టాన్ని భ్రష్టుపట్టించాడని విమర్శించారు. ప్రధాని మోదీ సాయంతో సీఎం చంద్రబాబు అనుభవంతో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందన్నారు. ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ రాష్ర్టానికి వచ్చిన పెట్టుబడులే ముఖ్యమంత్రి చంద్రబాబు కృషికి నిదర్శనమన్నారు.
ఉత్సాహంగా పర్యటన..
ఏం అవ్వా.. ఏం తమ్ముడూ బాగున్నావా? టీడీపీ ఏడాది పాలన ఎలా ఉంది? పథకాలు అందుతున్నాయా? ఏమైనా దిద్దుబాట్లు అవసరమా అంటూ కుశల ప్రశ్నలతో మంత్రి అచ్చెన్నాయుడు సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం గణప వరంలో ఆసక్తిగా సాగింది. వెలంపేట పర్యటనలో పలువురు ఇళ్లు, తాగునీరు తదితర సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరి స్తామని హామీ ఇచ్చారు. తొలుత మంత్రికి అభిమానులు, కార్యకర్తలు, మహిళలు హారతులు పట్టి గజమాలతో స్వాగతం పలికారు. గణపవరం సొసైటీ నూతన అధ్యక్షుడు కూసంపూడి సురేంద్రకుమార్ రాజు, పాలకవర్గాన్ని మంత్రి, గన్ని సత్కరించారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణంరాజు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ, ఎమ్మెల్సీ రాజశేఖర్, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘ చైర్మన్ వలవల బాబ్జీ, ఉంగుటూరు నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జ్ మాలతీరాణి తదితరులు పాల్గొన్నారు.
గణపవరం మండలాన్ని ఏలూరు జిల్లాలో విలీనం చేయండి
పశ్చిమలో కొనసాగుతున్న గణపవరం మండలాన్ని ఏలూరు జిల్లాలో విలీనం చేసేందుకు సహకరించాలని మంత్రికి గణపవరం జనసేన నేతలు విజ్ఞప్తి చేశారు. శనివారం మార్గమధ్యంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, కార్యకర్తలు మంత్రికి స్వాగతం పలికి సత్కరించారు.