నవ్వండి నవ్వించండి
ABN , Publish Date - May 04 , 2025 | 12:01 AM
నవ్వడం ఓ యోగం.. నవ్వించడం ఓ భోగం.. నవ్వలేకపోవడం ఓ రోగం.. నవ్వడం కూడా ఓ కళే అన్నారు దర్శకులు జంద్యాల. ఒకప్పుడు నవ్వు నాలుగు విధాలా చేటు అంటే నేడు నవ్వలేకపోవడం కూడా ఆరోగ్యానికి చేటని వైద్యులు సూచిస్తున్నారు.
నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం
నవ్వడం ఓ యోగం.. నవ్వించడం ఓ భోగం.. నవ్వలేకపోవడం ఓ రోగం.. నవ్వడం కూడా ఓ కళే అన్నారు దర్శకులు జంద్యాల. ఒకప్పుడు నవ్వు నాలుగు విధాలా చేటు అంటే నేడు నవ్వలేకపోవడం కూడా ఆరోగ్యానికి చేటని వైద్యులు సూచిస్తున్నారు. నవ్వడం వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, ఆనందం, శాంతి, సౌఖ్యం వస్తుందంటున్నారు. నిజమే కదా మరి.. నేటి ఆధునిక జీవన శైలిలో ప్రతి మనిషి కాలంతో పాటు పరిగెడుతున్నాడు. రేయిబవళ్లు కష్టపడుతూ తీవ్ర మానసిక ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అటువంటి ఒత్తిడి జీవనం అధిగమించడానికి నవ్వే దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది. నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
నిడమర్రు/ పాలకొల్లు/తాడేపల్లిగూడెం రూరల్/ పోలవరం
మనకున్న కొద్దిపాటి జీవితంలో ఎవరు, ఎప్పుడు, ఎలా చనిపోతారో తెలియడం లేదు. గ్యారెంటీ లేని ఈ జీవనంలో ప్రతి ఒక్కరూ తమకున్న కొద్దిపాటి సమయంలో మానసిక ప్రశాంతతతో సంతోషంగా ఉండాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. మనస్ఫూర్తిగా నవ్వుతుంటే హైపర్‌టెన్షన్ (బీపీ) వంటి రోగాలు ధరిచేరవు. మనకొచ్చే చాలా రకాల మానసిక రుగ్మతలు, బీపీ, ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జిటీ, ఇన్సోమియా, మైగ్రేన్, తలనొప్పి వంటి సమస్యలు నవ్వడం వల్ల దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఊహ తెలియని పిల్లలు రోజుకి 300 నుంచి 400 సార్లు నవ్వుతారంటే ఆశ్ఛర్యం కలగక మానదు. మహిళలు 50 నుంచి 60సార్లు నవ్వుతారు. పురుషులు కనిష్టంగా ఎనిమిది సార్లు, గరిష్టంగా 20సార్లు మాత్రమే నవ్వుతారు. పౌరులందరూ రోజుకీ కనీసం 30 సార్లు నవ్వితేనే పూర్తి ఆరోగ్యంగా ఉంటారని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి.
లాఫింగ్ క్లబ్‌తో నవ్వులు
బహిరంగ ప్రదేశాలలో ప్రజలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని నవ్వడమే లక్ష్యంగా ఈ దినోత్సవం జరుపుకుంటారు. నవ్వుల యోగా ఉద్యమం ద్వారా 105 దేశాలలో సుమారు ఆరు వేల లాఫింగ్ క్లబ్‌లు ఏర్పాటు చేసి నవ్వుల యోగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఉదయం కానీ, సాయంత్రం కానీ హాస్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కామెడీ బిట్స్, హస్య నాటికలు, కామెడీ డైలాగ్స్ వంటివి ప్రదర్శన చేస్తారు.
ఆయుష్షును పెంచే ఔషధం నవ్వే
నవ్వు ఆయుష్షును పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. హాయిగా నవ్వుకోవడం ద్వారా మనిషిలో మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యం కుదుట పడుతుందని తద్వారా ఆయుష్షు వృద్ధి చెందుతుం టున్నారు. ప్రశాంతంగా నవ్వుకోవడం ద్వారా హార్మోన్లు విడుదలై వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుంది. రక్త ప్రసరణ వృద్ది చెందుతుంది. నేడు అనేక కార్పొరేట్ కంపెనీలు తమ మేనేజర్లు వృత్తి నిర్వహణలో చిరునవ్వుకు ప్రాధాన్యత ఇవ్వమని సూచిస్తున్నాయి. నవ్వుతూ పనిచేయించుకోవాలని తద్వారా మంచి ఫలితాలు వస్తాయని వ్యక్తిత్వ వికాస నిపుణులు మేనేజర్లకు తెలియజేస్తున్నారు. ప్రతి రోజూ కనీసం 15 నిమిషాల పాటు నవ్వాలని తద్వారా 40 కేలరీల శక్తి విడుదలవుతుందని, ఇది 40 నిమిషాల గాధనిద్రతో సమానమని నిపుణులు తెలియజేస్తున్నారు. విచిత్ర మేమిటంటే మన ప్రమేయం లేకుండా మనకు నవ్వు తెప్పించే వాయువు ఒకటుంది. అదే నైట్రస్‌ఆక్సైడ్ దీనినే లాఫింగ్ గ్యాస్ అని కూడా సరదాగా పిలుస్తారు.
గోదారోళ్ల వెటకారం..
గోదారోళ్ల వెటకారంతోనే నవ్వులు పువ్వులు పూయిస్తారు. గోదావరి యాసలో వెటాకారమైన మాటలతో సున్నితమైన హాస్యాన్ని పండిస్తారు. ఓరేయ్ నువ్వు చాలా గొప్పోడువి రా.., మహాగొప్పపని చేశావులే.. మంచోడువిరా... పెద్ద అమాయకుడువిరా.. అంటూ వ్యాఖ్యలతో కామెడీ పండిస్తుంటారు.
కామెడీ కింగ్స్ మనవాళ్లే..
గోదారి భాష, యాసలోనే కామెడీ ఉందనే మన రచయితలు, డైరెక్టర్లు తమ సినిమాలలో గోదావరి భాషను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రఖ్యాత హాస్య దర్శకులు జంద్యాల, ఈవీవీ సత్యనారాయణ, రేలంగి నరసింహారావు మన ప్రాంతం వారే. సినిమా ఇండస్ట్రీలో కామెడీ కింగ్స్‌గా పిలువబడే హాస్యనటులంతా గోదావరి జిల్లా వారే. నాటితరంలో హాస్యనటులు అల్లూ రామలింగయ్య, రేలంగి, రాజబాబు తెలుగు సినిమాల్లో కామెడీ పండించి నవ్వుల పువ్వులు పూయించారు. నేటితరంలో బ్రహ్మానందం, సునీల్, ఎంఎస్ నారాయణ, ఆలీ, గెటప్ శ్రీను మొదలగు వారంతా హాస్యానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు.
నవ్వుతో పాజిటివ్ ఎనర్జీ
నవ్వు మనలో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. నవ్వించే వ్యక్తిని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. మనకు ఇష్టమైన వ్యక్తులను కలిసినప్పుడు సాధారణంగానే మన పెదాలపై చిరునవ్వు సంబవిస్తుంది. ఒకప్పుడు కామెడీ సినిమాలు ప్రత్యేకంగా వచ్చేవి. నేడు వచ్చే ప్రతి సినిమాలోనూ కామెడీ ట్రాక్ నడుస్తూ సినిమా ప్రేక్షుకులకు నవ్వులను అందిస్తున్నారు. నవ్వు వల్ల శరీరం దూప్‌మిన్, చెరటమిన్, ఎధోర్పిమిన్ అనే హార్మోనులు విడుదల అవుతాయి. చివరకు హెచ్‌స్మయిల్ (దొంగ నవ్వు) వల్లసైతం శరీరంలో 10 నుంచి 12 మజిల్స్ యాక్టివవుతాయి. హాపీ హార్మోన్స్ విడుదలవుతాయి. అదే మనస్ఫూర్తిగా నవ్వితే శరీరంలో 43 మజిల్స్ యాక్టివ వుతాయి. నిత్యం హాయిగా నవ్వడం ద్వారా గుండెపోటు ప్రమాదాలు తగ్గుతాయి. అంతే కాకుండా ఎక్కువుగా నవ్వే వారు మిగిలిన వారికంటే సుమారు ఎనిమి దేళ్లు ఎక్కువ కాలం జీవిస్తారని పలు సర్వేల్లో వెల్లడైంది.
నవ్వుల దినోత్సవం చరిత్ర ఇలా..
ప్రతిఒక్కరికీ నవ్వు ప్రాముఖ్యతను తెలపడం కోసం ప్రపంచవ్యాప్తంగా మేనెల తొలి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. నవ్వు ద్వారా సోదరత్వం, స్నేహం, చైతన్యం పెంచడమే దీని ఉద్దేశ్యం. ప్రపంచ నవ్వుల దినోత్సవం మొదటిసారిగా 1998 జనవరి 10న దేశంలోని ముంబైలో జరిగింది. నవ్వు యోగా ఉద్యమాన్ని ప్రారంభించిన డాక్టర్ మదన్ కటారియా ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి సుమారు 15వేల మంది హాజరయ్యారు. విదేశాలలో తొలిసారి 2000 జనవరి 9న డెన్మార్క్ రాజధాని కోపెన్‌హెగన్‌లో నిర్వహించిన ఈ నవ్వుల దినోత్సవ కార్యక్రమానికి రికార్డుస్థాయిలో 25వేల మంది హాజరు కాగా గిన్నిస్ బుక్‌లో రికార్డయింది. జనవరిలో చలి ఎక్కువగా ఉంటుందనే హాస్య ప్రియుల కోరిక మేరకు లాఫ్టర్స్ క్లబ్ ఇంటర్న్‌రేషనల్ దీనిని మే మొదటి ఆదివారం జరుపుకోవడం ప్రారంభించింది.
నవ్వుతో మానసిక సమస్యల పరిష్కారం
నవ్వు మన శరీరంపై సానుకూల ప్రభావం చూపెడు తుంది. హృదయనాళాల పనితీరును పెంచుతుంది. నవ్వు అనేక మానసిక సమస్యలను పరిష్కరిస్తుంది. ప్రతి ఒక్కరూ రోజూ కొంతసమయం ఆహ్లాద కరంగా గడపడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నవ్వు మనిషికి దేవుడిచ్చిన అద్భుత వరం. దాన్ని మనసారా ఆస్వాదిద్దాం.
– ఎంఎస్‌ఎల్‌ఎస్‌ఎస్ నారాయణ, హెచ్‌ఎం నెం.1 ప్రాథమిక పాఠశాల దర్శిపర్రు.
ధనంకంటే నవ్వే గొప్పది
ధన కనక వస్తు వాహనాలు ఎన్ని ఉన్నా కలగని తృప్తి నవ్వు వల్లే సాధ్యం. కాలిగోటి నుంచి శిరోజాల వరకూ మనుసులను ఆనందింప చేసేది ఆరోగ్యంగా ఉంచేది నవ్వు మాత్రమే. నిండు మనస్సుతో నవ్వండి నవ్వించండి.
– సారిక రామచంద్రరావు, హాస్య నటుడు