Share News

చలి స్ట్రోక్స్‌

ABN , Publish Date - Dec 14 , 2025 | 12:13 AM

గతంతో పోలిస్తే ఈ ఏడాది చలిగాలు ల తీవ్రత పెరిగింది. పది రోజులుగా మరింత అధికమైంది. ఉమ్మడి పశ్చిమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 13, 14 డిగ్రీలకు చేరుకున్నాయి. ఈ సమయంలో ఊపిరితిత్తులతోపాటు గుండెకు సంబంధిత సమస్యలు బయటపడుతున్నాయి.

చలి స్ట్రోక్స్‌

శీతగాలికి పెరుగుతున్న గుండెపోట్లు.. శ్వాసకోశ వ్యాధులు

ఉమ్మడి పశ్చిమలో పలువురు మృతి.. మరికొందరు ఆస్పత్రిపాలు

బీపీ, షుగరు ఉంటే మరింత అప్రమత్తం కావాలి

ఆహారం, మందుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి

చలిని తట్టుకునే దుస్తులు ధరించాలి

ఏమాత్రం తేడాగా వున్నా వైద్యులను సంప్రదించాలి

తాడేపల్లిగూడెం/జీలుగుమిల్లి/కొయ్యలగూడెం, డిసెంబ రు 13(ఆంధ్రజ్యోతి):

చాట్రాయి మండలం చీపురుగూడెంకు చెందిన టీడీపీ సీనియర్‌ నేత లింగారెడ్డి వెంకటేశ్వరరావు(53) గురువారం తెల్లవారు జామున నిద్రలోనే గుండెపోటుతో మరణించారు.

పోలవరంలో ఆటో మెకానిక్‌ అడబాల రాంబాబు(45) గురువారం భోజనం చేసేందుకు సిద్ధమవుతుండగా కూర్చున్న ఆటోలోనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.

లింగపాలెం మండలం కలరాయనగూడెంలో రాచకొండ నాగరాజు(45) తిరుపతిలో గుండెకు శస్త్ర చికిత్స చేయించుకుని రైలులో ఇంటికి వస్తుండగా ఏలూరులో గుండెపోటుతో మరణించారు.

ఇలా ఒకరు ఇద్దరు కాదు.. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రోజూ ఏదో మూల గుండె పోటు మరణాలు సంభవిస్తున్నాయి. గతంతో పోలిస్తే శీతాకాలం మొదలైన తర్వాత ఇవి మరింత ఎక్కువయ్యాయి.

గతంతో పోలిస్తే ఈ ఏడాది చలిగాలు ల తీవ్రత పెరిగింది. పది రోజులుగా మరింత అధికమైంది. ఉమ్మడి పశ్చిమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 13, 14 డిగ్రీలకు చేరుకున్నాయి. ఈ సమయంలో ఊపిరితిత్తులతోపాటు గుండెకు సంబంధిత సమస్యలు బయటపడుతున్నాయి. 45 ఏళ్లు దాటిన వారిలో మరింత ప్రమాదకరంగా పరిణ మిస్తున్నాయి. ఊబకాయం, శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారు, గుండె ఆపరేషన్లు చేయించుకున్న వారు, ఎక్కువ రోజులపాటు ప్రయాణాల్లోవున్న వారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. వీటికి ప్రధాన కారణం చలి గాలులే అని వైద్యులు ధ్రువీకరిస్తు న్నారు. డిసెంబరు, జనవరి నెలల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలిగాలులు, హృదయ స్పందన రేటు పెరగడానికి కారణం అవుతోంది. కొన్ని సందర్భాల్లో రక్తం చిక్కబడి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. చలిలో ఆరుబయట వ్యాయామం, వాకింగ్‌, జాగింగ్‌ చేయడం వల్ల హృదయనాళ వ్యవస్థపై అదనపు భారం పడుతోంది. అవి కుచించుకుయి రక్తపోటును పెరిగేలా చేస్తున్నాయి. ఇలాంటి వారు ఆకస్మిక గుండెపోటుకు గురై కొందరు మరణిస్తున్నారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈ సమస్య కనిపిస్తోంది.

మన్యానికి గుండెపోటు

ఏలూరు జిల్లా మన్యం గ్రామాల్లో పెరుగుతున్న చలికి చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఇబ్బందులు పడు తున్నారు. జీలుగుమిల్లి మండలం జీలుగుమిల్లి, తాటియాకులగూడెం, రామన్నపాలెం, చంద్రమ్మ కాలనీలలో ఇటీవల నడివయసుకు చెందిన కొందరు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో నిత్యం కాయకష్టం చేసి జీవనం సాగించే వ్యవసాయ కూలీలతో పాటు ఇతరులు ఉన్నారు. ఇప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా వున్న వారు ఒక్కసారిగా ఒంట్లో సత్తువ కోల్పోవడం, ఛాతీనొప్పి, గ్యాస్‌ నొప్పి, శ్వాస (ఊపిరి) పీల్చలేకపోవడం వంటి లక్షణాలతో బాధపడడంతో హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. నలుగురికి పరీక్షలు నిర్వహించి వాల్స్‌ దెబ్బ తిన్నాయని, గుండెకు రక్తప్రసరణ సక్రమంగా జరగటం లేదని వైద్యులు నిర్ధారించారు. మారిన జీవన శైలే ఇందుకు కారణమని స్పష్టం చేశారు. కాయకష్టం చేసుకునే వీరికి ఎలాంటి ఇన్సూరెన్స్‌లు లేకపోవడంతో వైద్యం కోసం లక్షలు అప్పు చేసి శస్త్ర చికిత్సలు చేయించారు. మన్యంలో గుండె సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి

శీతాకాలంలో క్యాలరీలతో కూడిన భోజనంకంటే సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్‌ ప్రోటీన్లను చేర్చడం ద్వారా గుండె ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెట్టాలి. ఆహారాలలో గుండె ఆరోగ్యానికి మేలు చేసే కొలెస్ట్రాల్‌ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. ఉప్పు తీసుకునే విషయంలో మరింత జాగ్రత్త అవసరం. అధిక ఉప్పు రక్తపోటుకు కారణమవుతుంది.

ఒత్తిడిని తగ్గించుకోండిలా..

శీతాకాలంలో చల్లని వాతావరణం అదనపు ఒత్తిడికి కారణమవుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఒత్తిడిని తగ్గించుకోవాలి. దీర్ఘకాలిక ఒత్తిడి గుండె ఆరోగ్యపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చేందుకు ప్రోత్సహిస్తుంది. శరీర ఆరోగ్యానికి దినచర్యలో ధ్యానం, శ్వాస వ్యాయామం, యోగా వంటివి ఒత్తిడిని తగ్గించేందుకు దోహదపడతాయి. గుండెనొప్పి లక్షణాలుఛాతీలో నొప్పి లేదా బరువు వున్నా.., ఎడమ చెయ్యి, దవడ, వెన్నుకు వ్యాపించే నొప్పి కలిగినా.., ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినా.. చెమ టలు, అలసట వంటి లక్షణాలు 10 –15 నిమి షాలు మించి ఉన్నా హార్ట్‌ ఎటాక్‌ లక్షణా లుగా గుర్తించాలి. నిమిషం ఆలస్యం చేయకుండా దగ్గరలోని ఎమర్జన్సీ ఆసుపత్రికి వెళ్లాలి.

ఏం చేయాలి ?

గుండె జబ్బులు ఉన్న వ్యక్తులు రక్తపోటును నిరంతరం పర్యవేక్షించడంతో పాటు వెచ్చని దుస్తులు ధరించాలి. సాధ్యమైనంత వరకు చలిలో బయటకు తిరగకూడదు.

ఒత్తిడిని తగ్గించుకోవడానికి సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడం వంటి అదనపు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

రక్తపోటును క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. ఏమైనా అసాధారణ రక్తపోటు హెచ్చుతగ్గులు గుర్తిస్తే వెంటనే వైద్యుల సూచనలు పాటించాలి.

శీతాకాలం అంటువ్యాధుల ప్రభావం ఎక్కువ. సీజన్‌ ప్రారంభమయ్యే ముందు ఛాతి ఇన్‌ఫెక్షన్ల నివారణకు ఇన్‌ప్లూఎంజా, న్యుమెనియా వ్యాక్సిన్‌లను స్వీకరించాలి.

చలి కాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచటానికి వెచ్చని జాకెట్లు, టోపీలు, బూట్లు, గ్లోవ్స్‌ తప్పనిసరిగా ధరించాలి. వీటివల్ల శరీరానికి వెచ్చదనం ఉండేందుకు దోహదపడుతుంది. అంటు వ్యాధులు ప్రభలకుండా తగ్గిస్తాయి.

ఇలా చేస్తే గుండె జబ్బులు రావు

జీవనం విధానంలో మార్పులు వచ్చాయి. వత్తిడి పెరిగింది. కొలస్ట్రాలు ఎక్కు వగా ఉండే జంక్‌ ఫుడ్స్‌ను ఇష్టపడడంతో ఇలాంటి అన ర్థాలు వస్తున్నాయి. చలి తీవ్రతను తట్టుకు నేందుకు ఈ కాలంలో ఎక్కువగా ధూమపానం చేస్తారు. ఇది హార్ట్‌ బీట్‌ను పెంచడానికి దోహదం చేస్తుంది. ఆహార నియమాలు పాటిస్తూ సరైన వ్యాయామాలు చేస్తే గుండె జబ్బులు దరిచేరవు.

– డాక్టర్‌, కీర్తి, తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి వైద్యురాలు

హార్ట్‌ ఎటాక్స్‌ రాకుండా..

శీతాకాలంలో శరీరంలో రక్తనాళాలు కుదించుకుపోతాయి. రక్తపోటు పెరిగి, ఉదయం వేళల్లో శరీరంపై ఒక్కసారిగా ఒత్తిడి పడుతుంది. ఈ కారణాల వల్ల హార్ట్‌ఎటాక్స్‌ వచ్చే ప్రమాదం ఉంది.ఆ సమయంలో వైద్యులను సంప్రదించాలి. గుండె సంబంధిత సమస్యలు వున్నవారు ఉదయం చలి ఎక్కువగా వున్నప్పుడు నేరుగా బయటకు వెళ్లకుండా కొద్దిసేపు ఇంట్లోనే వ్యాయామం చేసి ఆ తర్వాతే బయటకు వెళ్లాలి. బీపీ, షుగర్‌ ఉన్న వారు రక్తపోటు,రక్తంలో గ్లూకోజ్‌ క్రమం తప్పకుండా చెక్‌ చేసుకోవాలి. సిగరెట్‌, మద్యం వంటివి రక్తనాళాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి కాబట్టి వాటిని దూరంగా వుంచాలి.

– డాక్టర్‌ కొల్లూరు లక్ష్మణ్‌, గుండె వైద్య నిపుణులు, కొయ్యలగూడెం

Updated Date - Dec 14 , 2025 | 12:13 AM