మనల్ని ఎవడ్రా ఆపేది..!
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:50 AM
మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అడ్డూ అదుపు లేకుండా యఽథే చ్ఛగా మట్టిని తరలిస్తున్నారు. చింతలపూడి ఎత్తిపోతల కాలువ గట్టును సైతం తవ్వేస్తున్నారు.
యథేచ్ఛగా ఓ వ్యక్తి అక్రమ మట్టి తవ్వకాలు
కృష్ణాపురం వద్ద చింతలపూడి ఎత్తిపోతల కాలువ గట్టు మాయం
పట్టించుకోని అధికారులు
స్థానికులు ఆగ్రహం
టి.నరసాపురం, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అడ్డూ అదుపు లేకుండా యఽథే చ్ఛగా మట్టిని తరలిస్తున్నారు. చింతలపూడి ఎత్తిపోతల కాలువ గట్టును సైతం తవ్వేస్తున్నారు. ‘అంతా నా ఇష్టం.. ఎవరు వచ్చినా డోంట్‌కేర్.. ఎవరు అడ్డుకుంటారో చూస్తా ను’.. అంటూ ప్రశ్నించిన వారిని బెదిరిస్తూ అక్రమ దందా సాగించడం గమనార్హం. ఈ నేపథ్యంలో కొండలు, గుట్టలు మాయమవుతున్నాయి. ఎక్కడి పడితే అక్కడ అక్ర మార్కులు మట్టిని అక్రమంగా తవ్వేసి తరలిస్తూ కాసులు దండుకుంటున్నారు. రోజుల తరబడి మట్టి రవాణా జరు గుతున్నా అటుగా రెవెన్యూ అధికారులు చూడకపోవ డంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండల వ్యాప్తంగా మట్టి మాఫియా మేమే చేయాలనే స్థాయిలో కొంతమంది మాఫియాను నడుపుతున్నారు. ఏమైనా అంటే రాజకీయ ప్రముఖుల పేర్లు చెబుతున్నట్టు సమాచారం. దీంతో అధికారులెవ్వరూ అటుగా వెళ్లేందుకు ధైర్యం చేయడం లేదు. కృష్ణాపురం వద్ద ఉన్న చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ గట్టు మట్టిని ఓ వ్యక్తి దర్జాగా తవ్వి తరలిస్తున్నాడు. ఇదేమిటని స్థానికులు అడిగితే ‘అంతా నా యిష్టం ఎవరొస్తారో చూస్తానంటూ’ బెదిరింపులకు దిగుతున్నట్టు సమాచారం. ఇదేరీతిలో టి.నరసాపురం, కృష్ణాపురం, బండివారిగూడెం, బంధంచర్ల తదితర గ్రామాల్లో ఉన్న కొండలు, గుట్టలు, చెరువుల్లో ఉన్న మట్టిని అక్రమార్కులు తరలిస్తున్నారు. స్థానికులు ఇంటి అవసరాలకు పునాదిలోకి, స్థలం చదునుకు మట్టి తోలుకుంటే వారిపై కేసులు పెట్టే అధికారులు ఎక్కడ పడితే అక్కడ రాత్రి పగలు తేడా లేకుండా ఎక్స్‌కవేటర్లతో మట్టిని తవ్వి తరలిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండలవాసులు మండి పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మట్టి మాఫియాకు అడ్డుకట్ట వేయాలని అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై టి.నరసాపురం వీఆర్వో–2 రాజును వివరణ కోరగా మట్టి తరలింపు విషయం తన దృష్టికి రాలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.