Share News

పెనుగొండ దశ తిరిగేనా..?

ABN , Publish Date - Apr 22 , 2025 | 01:00 AM

పెనుగొండ.. గ్రామీణ ప్రాంతాలకు వాణిజ్య రాజధాని అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పూర్వ వైభవం కోల్పోవడమే కాదు.. కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

 పెనుగొండ దశ తిరిగేనా..?

సమస్యలు విన్నవించిన గ్రామస్తులు

ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు

పెనుగొండ.. గ్రామీణ ప్రాంతాలకు వాణిజ్య రాజధాని అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పూర్వ వైభవం కోల్పోవడమే కాదు.. కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పెనుగొండ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. పవన్‌ చిన్నతనం మొగల్తూరులో గడిపారు. ఆయన తల్లిదండ్రుల స్వస్థలాలైన పెనుగొండ, మొగల్తూరు అభివృద్ధిపై పవన్‌ దృష్టి సారించారు. స్వయంగా తన పేషీ అధికారులకు ఆదేశాలిచ్చి అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ మేరకు గ్రామంలో అధికారులు సభ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

పెనుగొండ, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి):పెనుగొండ పేరు చెబితే గుర్తిచ్చేది పశువుల సంత. జిల్లాలోనే ప్రసిద్ధి పొందిన సంతలో ఇతర జిల్లాల వారు కూడా అమ్మకాలు, కొనుగోలు చేసేవారు. హోల్‌ మార్కెట్‌లో పరిసర ప్రాంత వ్యాపారులు సరుకులు తీసుకెళ్లి వ్యాపారం సాగించేవారు. దాదాపు 20 గ్రామాల వారికి పెనుగొండ వారపు సంత ప్రధానం. అంతే కాదు ఇక్కడ ఇనుప పెట్టెల తయారీ మినీ పరిశ్రమగా వర్ధిల్లింది. ప్రస్తుతం ఇదంతా గత వైభవంగా మిగిలింది. పాలకులు నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. కనీస సౌక ర్యాలు కూడా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమ యంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు స్వయంగా అభివృద్ధిపై దృష్టి సారించడంతో పూర్వ వైభవం కళ్ల ముం దు ప్రత్యక్షమవుతుందని ప్రజలు భావిస్తున్నారు. గతనెల 27న ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులు గ్రామాభివృద్ధి సభ నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

డ్రెయినేజీ అస్తవ్యస్తం

పెనుగొండలో సుమారు 40 వేల మంది జనాభా ఉన్నారు. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో ము రుగు నిలిచిపోయి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. డ్రెయినేజీ నీరు పంట కాలువ, నక్కల డ్రెయిన్‌లో చేరు తోంది. అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

పెనుగొండ – మార్టేరు కాలువ గట్టు రహదారి

పెనుగొండ – మార్టేరు కాలువగట్టు రహదారి అధ్వానం గా మారింది. పంట తరలించడానికి వీలు లేకుండా పోయిందని రైతులు అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. కళాశాల విద్యార్థులకు మార్టేరు వైపు వెళ్లడానికి ఇది దగ్గరగా ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు జరిగితే ట్రాఫిక్‌ అంతరాయం కలుగుతుందని, కాలుగట్టు రహదారి అభివృద్ధి చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని పలువురు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

మరిన్ని సమస్యలు..

గ్రామంలో ప్రభుత్వాసుపత్రిలో పూర్తి స్థాయి సేవలందక తణుకు, లేదా పాలకొల్లు వెళ్లాల్సివస్తోంది. కార్డియాలజిస్టు, ఆర్ధోపెడిక్‌ వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని, ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు. పెనుగొండలో శ్మశాన వాటిక అభివృద్ధికి మూడు ఎకరాలు కేటాయించా లని ప్రజలు అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో రహదారులకిరువైపులా మొక్కలు నాటి గ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దాలని కోరారు. వాసవి అమ్మవారు పుట్టిని ల్లుగా ప్రసిద్ధి చెందిన పెను గొండ గ్రామం పేరును వాసవి పెనుగొండగా మార్చాలని అధికారులకు విన్నవించారు.

సమస్యల పరిష్కారం దిశంగా అధికారులు రూపొందిం చిన ప్రతిపాదనల మేరకు డిప్యూటీ సీఎం పవన్‌ నిధుల మంజూరు చేస్తారని గ్రామస్తులు భావిస్తున్నారు. పెనుగొండకు మహర్దశ రానుందని ఆశతో ఉన్నారు.

బక్కచిక్కిన నక్కల డ్రెయిన్‌

పెనుగొండలో డంపింగ్‌ యార్డు లేదు. నక్కల డ్రెయి న్‌ గట్టుపై చెత్త డంప్‌ చేస్తున్నారు. చెత్త మేటతో కాలువ కుచించుకుపోయింది. నీటి పారుదల లేక వర్షాలు, వరదల సమయంలో చేలు ముంపు బారిన పడుతున్నా యని రైతులు వాపోతున్నారు. డంపింగ్‌ యార్డుకు స్థలం కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.

పెనుగొండ మీదుగా వెళ్లే యల్లప్ప కాలువలో ఇళ్లలో మురుగు వదులడంతో చేలకు ముప్పు వాటిల్లుతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. భూగర్భ డ్రెయినేజీ వ్యవ స్థ ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారమవుతుంది.

వారపు సంత ఇరుకు

20 గ్రామాల జనం రద్దీతో ప్రతి బుధవారం ఉత్సవాన్ని తలపించే వారపు సంత ఇరుకైంది. ప్రతి ఇంటికి అవసరమైన నిత్యావసరాలు, కూరగాయలతో పాటు పశువుల బేరసారాలు సాగేవి. విశాలమైన ప్రాంతంలో జరిగే సంత కనుమరుగైంది. ఇరుకు ప్రాంతం లో కూరగాయల దుకాణాల నిర్వహణ కూడా కష్టంగా మారింది. చుట్టుపక్కల ఎక్కడ దొరకని సరుకులు పెనుగొండ సంతలో అందుబాటులో ఉండేవి. మార్కెట్‌కు అన్ని సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

జడ్‌ వంతెన శిథిలం

ఎస్‌వీకేపీ కళాశాల నియోజకవర్గంలో అతి పెద్ద విద్యా సంస్థ. ప్రధాన కాలువకు అవతల ఉండడంతో విద్యార్థులు వంతెన పైనుంచి రాకపోకలు సాగించాలి. కొత్తగా ఏర్పడిన కాలనీ వాసులకు కూడా జడ్‌ వంతెన కీలకం. వంతెన శిథిలం కావడంతో బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు. వంతెన తిరిగి నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

గ్రామాభివృద్ధి సభలో అధికారులకు ప్రజలు విన్నవించిన సమస్యల్లో కొన్ని..

డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్థం.

ఎస్‌వీకేపీ కళాశాల జెడ్‌ వంతెన నిర్మాణం.

సమస్యల్లో వారపు సంత.

యల్లప్ప కాలువ అధ్వానం

పూడిపోయిన నక్కల డ్రెయిన్‌.

ప్రభుత్వాసుపత్రి అంతంత మాత్రం.

శ్మశానానికి స్థలం కేటాయించాలి.

పెనుగొండ– మార్టేరు కాలువగట్టు రహదారి అభివృద్ధి చేయాలి.

పెనుగొండను గ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దాలి.

ఫ్లైవోవర్‌ మరమ్మతులు చేపట్టాలి.

వాసవి పెనుగొండగా పేరు మార్చాలి.

Updated Date - Apr 22 , 2025 | 01:00 AM