Share News

ర్యాగింగ్‌ భూతానికి వైద్యమేది ?

ABN , Publish Date - Dec 03 , 2025 | 12:57 AM

ఏలూరు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో చాప కింద నీరులా జలు విప్పిన ర్యాగింగ్‌ భూతానికి వైద్యం చేసేదెవరు ? సీనియర్ల వికృత చేష్టలు భరించలేక జూనియర్‌ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడి.. చివరకు రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడేందుకు కారకులు ఎవరు ?

ర్యాగింగ్‌ భూతానికి వైద్యమేది ?
ఏలూరు వైద్య కళాశాల వద్ద విద్యార్థుల ఘర్షణ

తరచూ ఎంబీబీఎస్‌ థర్డ్‌, సెకండియర్‌ విద్యార్థుల మధ్య ఘర్షణలు

హాస్టల్‌ నుంచి 16 మంది సీనియర్ల సస్పెన్షన్‌

ప్రిన్సిపాల్‌ పర్యవేక్షణలో విచారణ కమిటీ

కష్టపడి చదివి మంచి ర్యాంకులతో సీట్లు సాధించి.. ఎందుకిలా దారి తప్పారు..?

విద్యార్థులపై కొరవడిన పర్యవేక్షణ

ఏలూరు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో చాప కింద నీరులా జలు విప్పిన ర్యాగింగ్‌ భూతానికి వైద్యం చేసేదెవరు ? సీనియర్ల వికృత చేష్టలు భరించలేక జూనియర్‌ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడి.. చివరకు రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడేందుకు కారకులు ఎవరు ? గత నెల 12న ఫ్రెషర్స్‌ డే సందర్భంగా థర్డ్‌, సెకండియర్‌ విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తి సోమవారం అర్ధరాత్రి దాడులకు తెగబడే వరకు లాగింది ఎవరు ? దీనిపై ర్యాగింగ్‌ నివారణ కమిటీలు ఏం చేస్తున్నాయి ? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ? ఇప్పుడు అందరి నోటా ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఏలూరు క్రైం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి):

ఏలూరు మెడికల్‌ కళాశాలలో ర్యాగింగ్‌పై వచ్చిన వార్తలతో డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ విచారణకు ఆదేశించింది. ఏలూరు ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సావిత్రి సెకండియర్‌ విద్యార్థుల నుంచి రాతపూర్వకంగా వివరాలు తీసుకున్నారు. అర్ధరాత్రి హాస్టల్‌ రూములకు వచ్చి తమకు నిద్ర లేకుండా తెల్లవార్లు వేధిస్తున్నారని ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తెలిపారు. 16 మంది సీనియర్‌ విద్యార్థులు తమపై ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారని రాత పూర్వకంగా ఇవ్వడంతో వారిని హాస్టల్‌ నుంచి సస్పెన్షన్‌ చేశారు. విచారణ పూర్తయ్యే వరకూ వారు హాస్టల్‌ పరిసరా ల్లోకి అడుగు పెట్టకూడదని ఆదేశాలు జారీ చేశారు. డీఎంఈ ఆదేశాలతో మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ పర్యవేక్షణలో విచారణ కమిటీ ఏర్పాటుచేయగా ఈ విచారణ కమిటీ బుధ వారం నుంచి విచారణ కొనసాగించనున్నారు. సోమవారం రాత్రి పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఎఫ్‌ఐఆర్‌ కట్టామంటే బంగారు భవి ష్యత్తు నాశనమవుతుందని, ఇలాంటి వికృత చేష్టలకు పుల్‌ స్టాప్‌ పెట్టుకోవాలని హెచ్చరించారు.

కళాశాలలో ఏం జరుగుతోంది

ఏలూరులో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు ఎంతో మంది అధికారులు, ప్రజా ప్రతినిధుల ఎన్నో ఏళ్లపాటు కృషి చేశారు. చివరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు తొలుత వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన నిర్వ హించారు. తదుపరి వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండు పర్యాయాలు శంకుస్థాపనలు జరిగాయి. రూ.550 కోట్లతో ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో పనులు చేపట్టారు. 2023 ఏప్రిల్‌ 26న ఏలూరు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో 150 ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం సీట్లకు నేషనల్‌ మెడి కల్‌ కమిషన్‌ అనుమతి ఇచ్చింది. 2023 సెప్టెంబరు 1 నుంచి ఫస్ట్‌ ఇయర్‌ తరగతులు మొదలయ్యాయి. 12 మంది మినహా మిగిలిన వారంతా హాస్టలర్సే. 2024 సెప్టెంబరులో రెండో బ్యాచ్‌, 2025 అక్టోబరులో మూడో బ్యాచ్‌ విద్యార్థులు చేరారు. మొట్ట మొదటిగా చేరిన విద్యార్థులు రెండవ బ్యాచ్‌ వారిని ర్యాగింగ్‌ పేరుతో ఇబ్బందులకు గురి చేయడంతో విషయం అధికారులకు వెళ్లడంతో వారు తీవ్రంగా హెచ్చరించారు. థర్డ్‌, సెకండియర్‌ విద్యార్థుల మధ్య వైరం మరింత ఎక్కువైంది. ఇటీవల సీనియర్ల వేధింపులకు ఒక జూనియర్‌ విద్యా ర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కొందరు ప్రొఫెసర్ల ఒత్తిడితో ఆ విద్యార్థికి రహస్యంగా వైద్యం చేయించి, అతని వాంగ్మూలం కుటుం బ సమస్యగా మార్చారని ఆరోపిస్తున్నారు.

వారి భవిష్యత్‌ కాపాడేందుకు..

విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ఒక పక్క పోలీసు లు, మరోపక్క అధ్యాపకులు శాయశక్తులా కృషి చేస్తూ వారికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో వర్గ విబేధాలు తలె త్తినా ర్యాగింగ్‌ జరిగినా ఉపేక్షించేంది లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే జూనియర్‌ విద్యార్థులు ఆరోపిస్తున్న ర్యాగింగ్‌ అంశం ఎంత వరకూ వాస్తవం? సీనియర్‌ విద్యార్థులు ఆరోపిస్తున్నట్టు జూనియర్లు చేస్తు న్న దాడుల్లో నిజం ఎంత? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. ర్యాగిం గ్‌ను నియంత్రిచడానికి హాస్టల్‌లో ఒక కమిటీ, కాలేజీలో మరో కమిటీ ఉంది. ప్రిన్సిపాల్‌ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో మరో కమిటీ ఉంది. కాని ఇంత కాలం విద్యార్థులు ఏ కమిటీకి చెప్పకుండా అకస్మాత్తుగా దాడుల కు తెగబడడంతోనే అందరూ అవాక్కయ్యారు.

విద్యార్థులకు రక్షణ ఏది?

ఎంతో కష్టపడి చదివి ర్యాంకులను సాధిం చి మెరిట్‌ విద్యార్థులుగా రాణించి ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్‌ ఉచిత సీట్లను పొందారు. మరికొందరు వివిధ కేటగిరిల్లో పేమెంట్‌ సీట్లు పొందారు. వారంతా వేర్వేరు రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారే. తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ఎంబీబీఎస్‌ను అభ్యసించి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి అహర్నిశలు కష్టపడుతు న్నారు. మొదటి సంవత్సరమే చేరిన విద్యా ర్థులు యూనివర్సిటీ స్థాయిలో ఎనాటమి విభాగంలో మొదటి ర్యాంకు, వివిధ ర్యాంకు లను సాధించారు. మెడికల్‌ కళాశాలకు ఆ విద్యార్థులు మొదటి సంవత్సరమే కీర్తి కిరీ టాలను తీసుకువచ్చారు. హాస్టల్‌లో వార్డెన్‌, అసిస్టెంట్‌ వార్డెన్లుగా సీనియర్‌ ప్రొఫెసర్లను నియమించాలి. ఇక్కడ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా నియమించడంతో క్రమ శిక్షణ తప్పింది. కేర్‌ టేకర్లను నియమించ డానికి నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి వున్నా అలాంటిది ఏమి లేకుండా ఒక ప్రొఫెసర్‌ కనుసన్నల్లోనే వీటిని భర్తీచేశారు. దీంతో అక్క డ విద్యార్థుల మంచి చెడ్డలను చూసేందుకు సరైన వారు లేరు. ఎంతో మంది ప్రాణాలు కాపాడడానికి వైద్య విద్యను అభ్యసిస్తున్న వారికి మెరుగైన సదుపాయాలు, సౌకర్యాలు చక్కని వాతావరణం ఏర్పాటు చేస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అధికారులు మెడికల్‌ కళాశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, విద్యార్థుల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి.

ర్యాగింగ్‌కు పాల్పడితే చర్యలు

ర్యాగింగ్‌ అనేది చెడు సంస్కృతి. ఆత్మనూన్యతాభావం ఉన్నవారే దీనికి పాల్పడతారు. ముందు ఈ లోపాన్ని సరిచే సుకోవాలి. ర్యాగింగ్‌ చేసే వారు విద్యలో వెనుకబడతారు. కొందరు తమకు గుర్తింపు కావాలని ఇలాంటి చేష్టలకు పాల్పడుతుంటారు. ర్యాగింగ్‌ నియంత్ర ణకు ఏపీ ర్యాగింగ్‌ యాక్టు అమలులో ఉంది. జూనియర్స్‌ భయపడవద్దు. సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు తమ పిల్లల ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఫ్యాకల్టీ ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తాం. ఏలూరు మెడికల్‌ కళాశాలతోపాటు ఇతర కళాశాలల్లో విద్యా ర్థులకు ర్యాగింగ్‌ నిర్మూలనపై అవగాహన కల్పిస్తాం. విద్యా ర్థుల్లో పోటీతత్వం పెంచేందుకు క్రీడలు నిర్వహిస్తాం. నేనే ఏలూరు మెడికల్‌ కళాశాలను సందర్శించి వారితో మాట్లాడ తాను. వీలైనంత వరకూ మానవతా దృక్ఫఽథంతో కౌన్సెలింగ్‌ ఇస్తాం. ప్రవర్తనలో మార్పు రాకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.

– ఏలూరు జిల్లా ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌

Updated Date - Dec 03 , 2025 | 12:57 AM