సొసైటీలకు ధాన్యం కమీషన్ సొమ్ము ఎప్పుడిస్తారు ?
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:59 AM
ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల కార్పొరేషన్ సన్నాహాలు పూర్తి చేసింది. ఈ నెల 27న తొలుత తాడేపల్లిగూడెం మండలంలో కొను గోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు.
రైతు సేవా కేంద్రాల్లో సిబ్బంది నియామకం.. సంఘాలపై వేతనాల భారం
గతంలో రూ.100 కోట్లు డీసీసీబీకి మళ్లింపు
వడ్డీతోనే సరిపెట్టుకుంటున్న సహకార సంఘాలు
వైసీపీ హయాంలో రూ.24 కోట్లు బొక్కేసిన నేతలు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల కార్పొరేషన్ సన్నాహాలు పూర్తి చేసింది. ఈ నెల 27న తొలుత తాడేపల్లిగూడెం మండలంలో కొను గోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. జిల్లాలోని సొసైటీలతోపాటు 252 రైతు సేవా కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ కేంద్రాల నిర్వహణ సహకార సంఘాలకు భారంగా మారుతోంది. ఎదురు పెట్టుబడి పెట్టాలి. పౌరసరఫ రాల కార్పొరేషన్ నుంచి కమీషన్లు సకాలంలో రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో మంజూరుచేసిన రూ.100 కోట్ల కమీషన్‌ను జిల్లా సహకార బ్యాంకుల్లో జమ చేశారు. వాటిపై వచ్చే వడ్డీని మాత్రమే సొసైటీ లకు ఏటా ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంజూరుచేసిన రూ.24 కోట్ల కమీషన్‌ను రైతులకు చెల్లించమని అప్పట్లో ఆదేశించినా నేతలు బొక్కేశారు. రైతులకు ఇవ్వకుండా అప్పటి త్రిసభ్య కమిటీలు, వైసీపీ నేతలు జేబులు నింపుకున్నారు. ఆ తర్వాత పెద్దగా కమీషన్ విడుదల చేయలేదు. ఇప్పటి వరకు జిల్లాలో 122 సొసైటీలకు పౌరసరఫరాల కార్పొరేషన్ నుంచి రూ.70 కోట్లు రావాలి. కమీషన్ కోసం సొసైటీలు ఎదురు చూస్తున్నాయి.
ధాన్యం కొనుగోలు బాధ్యతను సొసైటీలకు అప్పగించడంతో రైతు సేవా కేంద్రాల్లో సిబ్బందిని నియమించి, వారికి నెలవారీ వేతనాలు చెల్లించాలి. పెద్ద సొసైటీలకు ఐదు నుంచి ఆరు రైతు సేవా కేంద్రాలు ఉంన్నాయి. ఒక్కో కేంద్రంలో ముగ్గురు సిబ్బంది ఉండాలి. ప్రతి సీజన్‌లోనూ వీరికి లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. తర్వాత అధికారులు ప్రత్యేకంగా రూ.10 కోట్ల బకాయిలు విడుదల చేయడంతో సొసైటీలు కొద్దో గొప్పో ఊపిరి పీల్చు కున్నాయి. ఆ నిధులతో రైతులకు అవసరమైన ఉపకరణాలు సరఫరా చేయాలని అధికారులు దిశా నిర్దేశం చేయడంతో ఆ మేరకు చర్యలు తీసు కున్నారు. వైసీపీ ప్రభుత్వం ఒక్క పైసా మంజూరు చేయలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కమీషన్ కోసం సొసైటీలు ఎదురుచూస్తు న్నాయి. కమీషన్ విడుదలైతే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కే అవకాశం ఉంది.
నిధులు ఏమవుతున్నట్టు
పౌరసరఫరాల కార్పొరేషన్‌కు ఎప్పటికప్పుడు కేంద్రం కమీషన్ విడుదల చేస్తుంది. వాటిని సొసైటీలకు చెల్లించాలి. గత కూటమి ప్రభుత్వంలో సజావుగానే ఇచ్చేవారు. సొసైటీలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ధాన్యం కమీషన్ సొమ్ములు ఉపయోగపడేవి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న చిన్న సొసైటీలకు ఈ సొమ్ములు ఎంతో ప్రయోజనం చేకూర్చాయి. ఇటీవల సొసైటీల్లో కంప్యూటరీకరణ పూర్తయ్యింది. ఇందుకు కేంద్రం నిధులు ఇచ్చినా రాష్ట్రంలో వాటిని సొసైటీలకు చెల్లించలేదు. సొసైటీల సిబ్బందితో కంప్యూటరీకరణ పూర్తి చేసుకున్నాయి. ప్రతి సొసైటీకి రూ.1.40 లక్షలు రావాల్సి ఉంది. అప్పటి అధికారి వాటిని మంజూరు చేయలేదు. ఆ నిధులు ఏమయ్యాయో లెక్కాపత్రం లేదు. సొసైటీలపై ఇలా అన్ని కోణాల్లోనూ భారం పడుతోంది. పౌరసరఫరాల కార్పొరేషన్ నిధులు విడుదల చేస్తే కొంతమేర ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కనున్నాయి.