Share News

ఈ వంతెనకు ఏమైంది ?

ABN , Publish Date - Jul 29 , 2025 | 12:46 AM

ఉమ్మడి గోదావరి జిల్లాలను కలిపే చించినాడ బ్రిడ్జికి ఏమైంది ? అధికారులు చెబుతున్నట్లు గడ్డర్లు, బేరింగ్‌లు ధ్వంసం కావడానికి కారణాలు ఏమిటి ?

ఈ వంతెనకు ఏమైంది ?

వంతెన గడ్డర్లు, బేరింగ్‌లు ఎందుకు పాడయ్యాయి ?

నిర్వహణ లోపం, వాహనాల రద్దీనే కారణమా ?

మరమ్మతు పనులకు రూ.5 కోట్లతో ప్రతిపాదనలు

మూడు నెలల పాటు భారీ వాహనాల రాకపోకలు బంద్‌

పనులు ప్రారంభం కాగానే పూర్తిగా నిలుపుదల

ఉమ్మడి గోదావరి జిల్లాలను కలిపే చించినాడ బ్రిడ్జికి ఏమైంది ? అధికారులు చెబుతున్నట్లు గడ్డర్లు, బేరింగ్‌లు ధ్వంసం కావడానికి కారణాలు ఏమిటి ? పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి ? ఈ వంతెన తిరిగి ఎప్పటి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది ? ఇవే ఇప్పుడు అందరిని వేధిస్తున్న ప్రశ్నలు. దీనిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..

(నరసాపురం–ఆంధ్రజ్యోతి)

పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ, కోనసీమ జిల్లా దిండి మధ్య వశిష్ఠ గోదా వరిపై రూ.150 కోట్లతో వంతెన నిర్మాణానికి 1995లో శంకుస్థాపన చేశారు. రెండున్నర కిలోమీటర్ల మేర ఈ ప్రీ స్ర్టెస్‌ కాంక్రీట్‌ వంతెన(పీఎస్‌సీ బిడ్జి)ని 2001 నాటికి పూర్తిచేశారు. దీనిని భీమవరం ఆర్‌అండ్‌బీ స్పెషల్‌ డివిజన్‌ నిర్మించింది. ఈ బ్రిడ్జి ఏర్పాటుతో గోదావరిని దాటేందుకు ప్రత్యక్ష కనెక్టవిటీ రోడ్డు ఏర్పడింది. రెండు జిల్లాల మధ్య రవాణా అభివృద్ధి జరిగింది. మార్కెట్‌ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ యాక్సెస్‌ మెరుగుపడింది. విద్యార్థులు, ఉద్యోగులకు రోజూ రాకపోకలకు సదుపాయం ఏర్పడింది.

216 హైవేతో ట్రాఫిక్‌ రద్దీ

ఆర్‌అండ్‌బీ నుంచి నేషనల్‌ హైవేకు ఈ వంతెన బదిలీ కావడం, కత్తిపూడి–ఒంగోలు సాగరమాల 216 జాతీయ రహదారి అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్‌ రద్దీ పెరిగింది. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ ప్రభుత్వం 216 జాతీయ రహదారి నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. బ్రిటిష్‌ హయాంలో ప్రతిపాద నలో ఉన్న కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు సుమారు 250 కిలోమీటర్ల మేర తీర ప్రాంత వెంబడి జాతీయ రహదారిని విస్తరించింది. రూ.3 వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు 2023లో పూర్తి చేశారు. జిల్లాలో చించి నాడ నుంచి లోసరి వరకు 51 కిలోమీటర్ల మేర ఈ రహదారి విస్తరించారు. గతంలో ఒంగోలు నుంచి విశా ఖ వెళ్లడానికి విజయవాడ మీదుగా ఒక్కటే మార్గంగా ఉండేది. ఈ రహదారి పూర్తి కావడంతో కోల్‌కతా, ఒడిశా, విశాఖ నుంచి వచ్చే వాహనాలన్ని కత్తిపూడి మీదుగా ఈ మార్గంలో ఒంగోలు వెళుతున్నాయి. ట్రాఫి క్‌ రద్దీ లేకపోవడం, చెక్‌ పోస్టులు తక్కువగా ఉండ డం, కొత్త రహదారిపై వాహనాదారులు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. దీనితో ఈ మార్గంలో రేయింబవళ్లు ట్రాఫిక్‌ రద్దీ అంచనా కంటే భారీగా పెరిగింది. వాహ నాల రద్దీ పెరగడంతో ఆ ప్రభావం వంతెనపై పడింది. ఈ బ్రిడ్జి మరమ్మతులకు ఇది ఒక కారణంగా నిపుణు లు చెబుతున్నారు.

నిర్వహణా లోపం

ఏదైనా ఒక నిర్మాణం చేపడితే ఎప్పటికప్పుడు నిర్వ హణ చూడాలి. కాని ఈ బ్రిడ్జి విషయంలో అటువం టిది ఏమీ లేదు. 2001 నిర్మాణం పూర్తి చేసి ఇప్పటికి పాతికేళ్లు అవుతోంది. అయినప్పటికి ఒకటి, రెండు సందర్భాల్లో ఏదో అరకొరగా పైపై పూతలు పూశారు తప్ప.. అంతకు మించి ఏమీ చేయలేదు. గడ్డర్లు ఎలా వున్నాయి? బేరింగ్స్‌ పరిస్థితి ఏమిటి అని ఎప్పుడూ చూసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం వంతెనపై పగుళ్లు ఏర్పడడం, గోతులు పడడం, పైకి లేచిన ఇనుప చువ్వలు ప్రమాదకరంగా మారాయి. మరోవైపు బ్రిడ్జి గడ్డర్లతోపాటు 26 బేరింగ్‌లు పూర్తిగా దెబ్బ తిన్నాయి. రెగ్యులర్‌ నిర్వహణ లేకపోతే బ్రిడ్జి మనుగడ ఎలా సాగుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడదే కొంప ముంచుతోందని, ఇప్పటికైనా అధికారులు స్పందించడంపై వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో పనులు చేపట్టి, ఎప్పటికప్పుడు నిర్వహణ కూడా చేపట్టాలని సూచిస్తున్నారు.

ఉప్పు నీటి సాంద్రత

గోదావరిపై నిర్మించిన ఈ వంతెనకు సమీపంలోనే సముద్రం వుంది. ఈ సముద్రం నుంచి నీరు ఎప్పటి కప్పుడు ఎగదన్నుతూ వుంటుంది. ఉప్పు సాంద్రత వల్ల కూడా ఈ వంతెన నిర్మాణానికి వాడిన ఐరన్‌ తుప్పు పట్టే అవకాశం ఉంటుందనే ప్రచారం గతంలో సాగింది. అయితే దీనిని అప్పటి అధికారులు, పోలీసు లు ఫేక్‌గా కొట్టి పారేశారు. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వాహనాల రాకపోకలు నిలిపివేత

జాతీయ రహదారి అధికారులు ఇటీవల వంతెనను పరిశీలించారు. గడ్డర్లు, బేరింగ్‌లు పాడైనట్టు గుర్తించారు. వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి మరమ్మతులు చేయాలని ప్రతిపాదించారు. లేకుంటే మరింత ప్రమాదంలో పడుతుందని సూచించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పనులకు అనుమతులు మంజూరుచేసింది. హైవే అథారిటీ ఆధ్వర్యంలో పనులు చేపట్టడంతో బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మరమ్మతు పనులకు మూడు నెలల సమయం పట్టనుందని అధికారులు చెబుతున్నారు.

వెలవెలబోయిన వంతెన

చించినాడ బ్రిడ్జికి మరమ్మతు పనులతో భారీ వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ప్రధాన రహదారి వెలవెలబోయింది. కోల్‌కతా, ఒడిశా నుంచి భారీ వాహనాలు కత్తిపూడి–ఒంగోలు 216 జాతీయ రహదారిపై చించినాడ బ్రిడ్జిపై నుంచి నరసాపురం మీదుగా రాకపోకలు సాగిస్తాయి. చించినాడ నుంచి భీమవరం మండలం లోసరి వరకు రేయింబవళ్లు వాహనాల రద్దీ కనిపించేది. వందలాది వాహనాల రాకపోకలతో చిరు వ్యాపారులకు ఉపాధి లభించేది. మూడు రోజుల నుంచి భారీ వాహనాలకు మినహా బైక్‌లు, ఆటోలు, కార్లు వంటి చిన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. పశ్చిమ నుంచి కోనసీమ జిల్లాల మధ్య భారీ వాహనాలను రావులపాలెం మీదుగా మళ్లించారు. కోనసీమ జిల్లా నుంచి భీమవరం, నరసాపురం కాలేజీలకు వచ్చే విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో మాదిరి భారీ వాహనాలు విజయవాడ మీదుగా తరలి వెళుతున్నాయి. కొన్ని నరసాపురం, రావులపాలెం మీదుగా వెళుతున్నాయి. వాహనాలకు ఒక్కసారిగా బ్రేక్‌ పడడంతో రోడ్లన్ని వెలవెలబోతున్నాయి.

మరమ్మతు పనులకు మూడు నెలలు..!

మచిలీపట్నంలోని 216 జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్‌ పర్యవేక్షణలో సుమారు రూ.5 కోట్ల అంచనాతో మరమ్మతు పనులు చేపట్టారు. మూడు నెలలపాటు జరిగే పనులు ప్రారంభదశలో భారీ వాహనాల రాకపోకలు నిలిపివేశారు. పూర్తిస్థాయి పనులు చేపట్టగానే మొత్తం రాకపోకలు నిలిపివేయనున్నారు. చించినాడ బ్రిడ్జి నిర్మాణానికి ముందుకు కోనసీమ ప్రాంతాలకు వెళ్లడానికి నరసాపురం, యలమంచిలి, దొడ్డిపట్ల, కోడేరు ప్రాంతాల్లో గోదావరిపై పడవలు దాటాల్సి వచ్చేది. వంతెన మరమ్మతు నేపథ్యంలో అదే పరిస్థితి పునరావృతమైంది.

Updated Date - Jul 29 , 2025 | 12:46 AM