Share News

వాతావరణం

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:16 AM

మరో అల్పపీడనం అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ముఖ్యంగా వరి రైతులు ముమ్మరంగా మాసూళ్లు చేస్తున్నారు. చాలా వరకు ధాన్యం కల్లాల్లోనే ఉన్నది.

వాతావరణం

మరో మూడు రోజుల్లో అల్పపీడనం జూ రైతుల్లో అలజడి.. జూ జిల్లాలో 23,700 ఎకరాల్లో మాసూళ్లు పూర్తి

72 వేల టన్నుల ధాన్యం దిగుబడి జూ ఇంకా ధాన్యం రాశులుగా 20 వేల మెట్రిక్‌ టన్నులు

మొంథా తుఫాన్‌తో దిగుబడి ఢమాల్‌... తెగుళ్ల దాడి

మరో అల్పపీడనం అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ముఖ్యంగా వరి రైతులు ముమ్మరంగా మాసూళ్లు చేస్తున్నారు. చాలా వరకు ధాన్యం కల్లాల్లోనే ఉన్నది. ఇటీవల మొంథా తుఫాన్‌ దెబ్బకు వరి రైతులు నష్టపోయారు. దిగుబడి తగ్గిపోవడంతో పాటు చేలు తెగుళ్ల బారిన పడ్డాయి. ఇప్పుడు వాతావరణంలో మారిన పరిస్థితులతో కూలీల రేట్లు, వరి కోత యంత్రాల కిరాయి భారీగా పెంచేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు కురిస్తే కోలుకోలేని దెబ్బ తగులుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

భీమవరం రూరల్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): సార్వా మాసూళ్ల సమయంలో వాతావరణం గండంగా మారింది. మొన్న మొంథా తుఫాన్‌తో సాగులో రైతులు నష్టాలు చవిచూశారు. ఇప్పుడు పంట మాసూళ్లు ముమ్మరం కానున్న తరుణంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రైతుల్లో అలజడి మొదలైంది. గడిచిన వారం రోజుల నుంచి పంట మాసూళ్లు సాగుతున్నాయి. ఈ నెల చివరి వారం నుంచి పంట మాసూళ్ల స్పీడు పెరగనుంది. ఇప్పటికి పశ్చిమ గోదావరి జిల్లాలో 23,700 ఎకరాలు మాసూళ్లు అయ్యింది. 72 వేల టన్నుల ధాన్యం దిగుబడిగా వచ్చింది. దీనిలో 30 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు జరిగాయి. 20 వేల టన్నుల ధాన్యం ధాన్యంరాశులుగా ఉంది. దీనిలో తేమశాతం తగ్గించేందుకు రైతులు ఎండబెడుతున్నారు. రోజూ పంట మాసూళ్ళు జరుగుతుంది. ఇలాంటప్పుడు వాతావరణంలో మార్పు ఏర్పడితే మాసూళ్ళకు ఆటంకం ఏర్పడుతుంది. పంట దశకు చేరుకున్న చేలు దెబ్బతింటాయి. అందువల్ల మరో మూడు రోజుల్లో ఏర్పడుతుందన్న అల్పపీడనం వల్ల ప్రభావం ఉండకూడదని రైతులు ఆశిస్తున్నారు.

మొంథా తుఫాన్‌తో దిగుబడిపై ప్రభావం

గతనెల చివరి వారంలో వచ్చిన మొంథా తుఫాన్‌ సార్వా సాగు నష్టమే చేకూర్చింది. జిల్లాలో దాదాపుగా 20 వేల ఎకరాలకు నష్టం చేకూరింది. మిగిలిన సాగులో కొంత సాగుకు తెగుళ్లు వచ్చేలా చేసింది. ఎండకు పొడ తెగుళ్ళు వల్ల పంటచేలు రూపు మారి దిగుబడి పడిపోయింది. వర్షపు నీరు చేలల్లో అధికంగా చేరి మాసూళ్లు ఆలస్యానికి కారణమైంది. కొంత సాగులో ధాన్యం గింజలకు అణకామ ఏర్పడింది. దీనివల్ల దిగుబడి బాగా తగ్గిపోతుంది. ఇప్పుడు మరోసారి వర్షాలు పడితే మిగిలిన సాగుకు భారీ నష్టం తప్పదు.

ధాన్యంలో తగ్గని తేమ

సార్వా పంట మాసూళ్లు చేసేటప్పుడే ఎండ తీవ్రత తగ్గి చలి పెరుగుతుంది. దీంతో ధాన్యం తేమ శాతం తగ్గించడం కోసం రైతులు అష్టకష్టాలు పడాలి. వారంరోజులుగా చలి బాగా ఎక్కువైంది. ధాన్యానికి 17 తేమ శాతం తేవడానికి రైతులు నాలుగు రోజులుపైనే ఎండ బెడుతున్నారు. గతంలో రెండు రోజులు ఎండబెడితే సరిపోయేది. మరలా అల్పపీడనం ఏర్పడి మబ్బులు పడితే ధాన్యం ఎండ బెట్టడం చాలా కష్టం.

పెరిగిన వరి యంత్రాల కిరాయి

గణపవరం: వాతావరణ పరిస్థితులు, కూలీలతో కోతలు కొయ్యడానికి పెట్టుబడి ఎక్కువ కావడంతో అన్నదాతలు అత్యధికంగా యంత్రాలతో వరిని కోయి స్తున్నారు. ముఖ్యంగా పొలాలు పైకి బాగానే ఉన్నప్పటికి దిగుబడులు తగ్గాయని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో పంటకోతకు వచ్చింది. ఇటీవల వరకు యంత్రంతో వరిని కొయ్యడానికి గంట కు రూ.3వేలు తీసుకుంటే ప్రస్తుతం రూ.3500–4000 వరకు ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నలుపు, తాలుగా మారాయి..

తుఫాన్‌ సమయంలో వీచిన పెనుగాలులకు వంద లాది ఎకరాల్లో వరిపంట నేలవాలింది. ఆ పంటను అధికారులు గుర్తించి పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదించారు. అయితే నిలుచుని ఉన్న పొలాలు దెబ్బతిన్నాయి. గాలులకు వరి కంకుల తమ్మెలు పగిలిపోయి తాలుగా మారిపోయాయని రైతులు చెబుతున్నారు. ఎకరానికి 35బస్తాలకు పైగా దిగుబడి వస్తుందని ఆశీస్తే 25– 28 మాత్రమే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 20 , 2025 | 12:16 AM