మాకొద్దులే!
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:00 AM
ఉత్తమ సేవలందించిన టీచర్లకు గురుపూజోత్సవం రోజున ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందించేం దుకు జిల్లాలో గురువులు కరవయ్యారు.
జిల్లా స్థాయి బెస్ట్ టీచర్ అవార్డులకు ప్రతిపాదనలు 30లోపే..
పోటీ లేకుండానే దరఖాస్తు చేసిన వారందరికీ ఉత్తమ పురస్కారాలు?
ఏలూరు అర్బన్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) : ఉత్తమ సేవలందించిన టీచర్లకు గురుపూజోత్సవం రోజున ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందించేం దుకు జిల్లాలో గురువులు కరవయ్యారు. బెస్ట్ టీచర్ అవార్డుల కోసం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, డీఈవోకు బాగా తెలిసిన వారితో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల కోసం రికమండేషన్లు, సిఫార సులతో విద్యాధికారుల వద్ద ఒత్తిళ్లు తెచ్చే ఒకప్పటి రోజులు, పరిస్థితులు ఈ ఏడాది కనుచూపుమేరలో లేవంటే ఆశ్చర్యం కలిగించకమానదు. గతంలో ఏటా 100 నుంచి 150 మంది వరకు ఉపాధ్యాయులకు అంద జేసిన బెస్ట్ టీచర్ అవార్డులకు ఈ ఏడాది జిల్లా మొత్తం మీద గరిష్ఠంగా 30 మంది లోపే దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులం దరికీ వారి సేవలు, సాధించిన విద్యా, విద్యాయేతర ప్రగతి, తదితర ప్రామాణీకాల వడపోత, పరిశీలన ప్రక్రియలను నామమాత్రంగా ముగించి ఉత్తమ పురస్కారాలను అందజేసే పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రతిపాదనలకు పాట్లు..
ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు అవార్డులందించేందుకు జిల్లా, మండలస్థాయిలో పాటించాల్సిన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ ఇటీవల విడుదల చేసింది. అన్ని కేటగిరీల నుంచి అవార్డులం దుకునే జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యా యుల సంఖ్య 30కి మించరాదని స్పష్టంచేసింది. వీటిని ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, హెచ్‌ఎం కేటగిరీల నుంచి 10 చొప్పున జిల్లాస్థాయి సెలక్షన్ కమిటీ నిర్ణయించిన వారికే ఇవ్వాలని ఆదేశించింది. ఇక డివిజన్/మండల/మున్సిపల్ పరిధిలో ఇచ్చే అవార్డులకు మండలం/ మున్సిపాల్టీ నుంచి 10 మంది ఎస్జీటీలు, ఐదుగురు స్కూల్ అసిస్టెంట్ కేడర్ టీచర్లను ఎంపికచేయాలని మార్గదర్శకాల్లో సూచించింది. దీనికనుగుణంగానే జిల్లావిద్యాశాఖ జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు 7,400 మంది టీచర్లు, హెచ్‌ఎంల నుంచి దరఖాస్తులను ఆహ్వానిం చింది. ఆగస్టు 26వ తేదీ గడువు ముగిసే నాటికి అందిన దరఖాస్తులు 30లోపే ఉన్నాయి. వీటినే మండలాల్లో ఎంఈవోలు, డివిజన్లలో డీవైఈవోలు జిల్లా కార్యాల యానికి పంపించారు. జిల్లాస్థాయిలో డీఈవో అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి, సంబంధిత టీచర్లు విద్యారంగ అభివృద్ధికి చేసిన సేవలు, విద్యార్థులు సాధించిన ప్రగతి, స్కూలుకు హాజరు, విద్యాయేతర కార్యక్రమాల్లో కృషి, తదితర అంశాలను కొలమానంగా తీసుకుని అవార్డులకు అర్హులను ఎంపిక చేస్తుంది. ఈ వడపోత, పరిశీలన, ఎంపికల ప్రక్రియలు సోమ, మంగళవారాల్లో చేపట్ట నున్నారు. వాస్తవానికి వందల సంఖ్యలోనే దరఖాస్తులు వస్తాయని భావించినా గడువు సమీపించేసరికి పట్టుమని ఐదు ప్రతిపాదనలు అందని దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎంఈవోలపై ఒత్తిడి తెచ్చిమరీ టీచర్ల నుంచి దరఖాస్తులు పెట్టించాల్సిన పరిస్థితులు నెలకొన్నట్టు ప్రచారం జరుగుతోంది.
పురస్కారాలపై అనాసక్తి ఎందుకో..?
సాధారణంగా పురస్కారమనగానే దానిని ఒక గుర్తింపు, గౌరవంగా ఎవరైనా భావిస్తారు. ఉద్యోగ, ఉపాధ్యాయలకైతే అవార్డు అంటే ఉత్తమ పనితీరుకు అధికారిక గుర్తింపు. నిజాయితీగా పాఠశాలలు, విద్యారంగ అభివృద్ధికి తమవంతు విశేష కృషి చేసిన ఉపాధ్యా యులను గుర్తించి వారిని విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిరోజున ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే గురుపూజోత్సవం సంద ర్భంగా ఉత్తమ పురస్కారంతో గౌరవిస్తామంటే పెద్దగా ఆసక్తి కనబరచకపోవడం ఈ ఏడాది చర్చ నీయాంశ మైంది. ఈ నేపథ్యంలో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ అవార్డులు దక్కడం ఖాయంగా సంకేతాలు వస్తున్నాయి. ఉత్తమ పురస్కారాలకు ఎంపికైన టీచర్ల జాబితా మంగళ లేదా బుధవారాల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.