Share News

జలఘోష తప్పేనా..?

ABN , Publish Date - May 07 , 2025 | 12:49 AM

కూటమి ప్రభుత్వంలో పంట కాలువలకు ప్రాధాన్యం ఇస్తారని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే జిల్లా నుంచి ప్రతిపాదనలు పంపించారు. అయితే నిధులు లేమి ఉందంటూ ఆర్థిక శాఖ అనేక మెలికలు పెడుతోంది.

 జలఘోష తప్పేనా..?

అనుమతులు మంజూరు చేయని ఆర్థిక శాఖ

సీఎంను కలవాలని మంత్రి నిమ్మల యోచన

నిధులు విడుదల చేయకుంటే ఖరీఫ్‌లో గండమే

అధికారులు, రైతుల ఎదురుచూపులు

కాల్వలు విడుదల చేసేందుకు నెల రోజులే గడువు

ఈలోగా పూడికతీత, మరమ్మతులు చేపట్టాలి

కూటమి ప్రభుత్వంలో పంట కాలువలకు ప్రాధాన్యం ఇస్తారని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే జిల్లా నుంచి ప్రతిపాదనలు పంపించారు. అయితే నిధులు లేమి ఉందంటూ ఆర్థిక శాఖ అనేక మెలికలు పెడుతోంది. ఇప్పుడదే పశ్చిమ డెల్టా రైతులకు శాపంగా మారుతోంది. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కృషితోఈ ఏడాదైనా జలఘోష తప్పేనా అని రైతులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

పంట కాలువల్లో నీటి సరఫరా నిలిచిపోయింది. వేసవిలో కాల్వలు, డ్రెయిన్‌లకు మరమ్మతు పనులు చేపట్టాలి. ప్రభుత్వానికి ఏనాడో ప్రతిపాదనలు పంపారు. పశ్చిమ డెల్టా పరిధిలో వేసవి మరమ్మతులకు రూ.40 కోట్లు అవసరమని అంచనా వేశారు. ప్రణాళికలు రూపొందించారు. నీటి సంఘాలు ఏర్పడడంతో రైతుల్లోనూ ఆశలు చిగురించాయి. కాలువలు ప్రక్షాళన జరుగుతుందని ఆకాంక్షించారు. ఈ ఏడాది రైతుల ఆశలు తల్లకిందులయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా జలవనరుల శాఖ అధికారులు పంపిన ప్రతిపాదనలు ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అక్కడ క్లియరెన్స్‌ అయితేనే నిధులు మంజూరవుతాయి. ఒక దశలో ప్రతిపాదనలను ఆర్థిక శాఖ తిరస్కరించింది. ప్రతిపాదనల విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి ఆమోదం పొందేలా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పనుల నిర్వహణకు కాలాతీతమైంది. ఈ ఏడాది ఎండలు అధికంగా ఉన్నాయి. వాతావరణ శాఖ ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. అదే జరిగితే మంచినీటి చెరువుల్లో నీరు అడుగంటిపోనుంది. జూన్‌ మొదటి వారంలోనే మళ్లీ కాలువలకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. ఇటువంటి లెక్కలు వేసుకుని జలవనరుల శాఖ

అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఆలోగా కాలువలు, డ్రెయిన్‌లలో పూడిక తీయాలి. గుర్రపుడెక్క, తూడు, కర్రనాచు తొలగించాలి. గట్లు బలహీనంగా ఉన్నచోట పటిష్టం చేయాలి. లేదంటే గండ్లు పడి పంట పొలాలు ముంపుబారిన పడే ప్రమాదం ఉంది. గడచిన ఖరీఫ్‌లో గండ్లతో అధిక నష్టం వాటిల్లింది. మరోవైపు డ్రెయిన్‌లు ఎగదన్ని పంట పొలాలు ముంపుబారిన పడ్డాయి. వేసవిలో పనులు చేపడితే ముంపు నుంచి గట్టెక్కవచ్చని అంతా అభిప్రాయపడ్డారు.

నీటి సంఘాల్లోనూ నిరుత్సాహం

వేసవి పనులు చేపట్టడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫల మైంది. ఆ ప్రభావం రైతులపై పడుతోంది. రెండు రోజులపాటు వర్షాలు కురిస్తే పొలాలు నీట మునుగుతున్నాయి. నారుమళ్లు దెబ్బతింటున్నాయి. లేదంటే నాట్లు కుళ్లిపోతున్నాయి. గడచిన ఖరీఫ్‌లో రైతులు ఇలాంటి ఇబ్బందులే పడ్డారు, రెండు పర్యాయాలు పంటకు నష్టం వాటిల్లింది. డ్రెయిన్‌లు, కాలువలు పూడుకుపోవడంతో కొద్దిపాటి వర్షాలకు డ్రెయిన్‌లు ఎగదన్నుతున్నాయి. జలవనరుల శాఖ ఈ విషయాన్ని గుర్తించింది. పనులు చేపట్టాలని ముందుగానే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. పశ్చిమ డెల్టా పరిధిలో కాలువలు, డ్రెయిన్‌ల మరమ్మత్తుల కోసం రూ.40 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీటి సంఘాలను ఏర్పాటు చేయడంతో రైతుల్లోనూ ఉత్సాహం నెలకొంది. నీటి సంఘాల ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పర్యటించారు. కాలువులు, డ్రెయిన్‌లలో సమస్యలను గుర్తించారు. అధికారులకు వివరాలు సమర్పించారు. పనుల అవసరాన్ని గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేసేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ స్థాయిలో ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉండడంతో నీటి సంఘాల్లోనూ నిరుత్సాహం నెలకొంది.

నెల రోజులే గడువు

వేసవిలో పనులు చేపట్టడానికి నెల రోజులు మాత్రమే గడువు ఉంది. జూన్‌ మొదటివారంలో కాలువలకు నీటిని విడుదల చేయనున్నారు. వేసవి పనులకు మే నెల కీలకం. ప్రభుత్వ స్థాయిలో నిధులు మంజూరు చేస్తే పనులు కేటాయిస్తారు. నామినేషన్‌ పద్ధతిలో పనులు కేటాయించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. వాస్తవానికి రూ.10 లక్షలపైన పనులు అయితే టెండర్‌లు పిలవాలి. లేదంటే నీటి సంఘాల ద్వారా నామినేషన్‌ పద్ధతిలో చేస్తారు. ప్రస్తుతం నిధులు మంజూరు చేసినా సరే టెండర్‌లు పిలిచే అవకాశం లేదు. అంత సమయం లేదు. స్వల్పకాలిక టెండర్లు పిలిచినా వారం రోజుల సమయం పడుతుంది. అయినా సరే టెండర్లు ఖరారవుతాయన్న భరోసా లేదు. కాంట్రాక్టర్‌లకు గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో జలవనరుల శాఖ పనులుంటేనే హడలి పోడుతున్నారు. దీంతో నీటి సంఘాల ద్వారానే పనులు చేయించాలని అధికారులు యోచిస్తున్నారు. ఈసారి నామినేషన్‌లోనే పనులు చేపడితే వేగవంతంగా పూర్తవుతాయన్న నమ్మకంతో అధికారులు వేచి చూస్తున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తేనే అది సాధ్యపడుతుంది. లేదంటే ఈ వేసవిలోనూ పనులు అయ్యే అవకాశం లేదు. మళ్లీ ఖరీఫ్‌లో రైతులకు కష్టాలు తప్పవు. నీటి సంఘాలు ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు పభుత్వ నిర్ణయంపైనే వేసవి పనులు ఆధారపడి ఉన్నాయి.

Updated Date - May 07 , 2025 | 12:49 AM