Share News

రెండేళ్లలో వాటర్‌ గ్రిడ్‌

ABN , Publish Date - Jul 19 , 2025 | 11:56 PM

జిల్లా అంత టా కలుషితం లేని తాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసే వాటర్‌ గ్రిడ్‌కు సర్వంసిద్ధమైంది.

రెండేళ్లలో వాటర్‌ గ్రిడ్‌

మేఘా సంస్థకు నిర్మాణ బాధ్యతలు

విజ్జేశ్వరం నుంచి జిల్లాలో 1,930

కిలోమీటర్ల మేర మెయిన్‌ పైపులైన్లు

గ్రామాల్లో ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు, సంప్‌లు, పైప్‌లైన్లు.. 40 వేల కుళాయి కనెక్షన్లు

ఎన్నో ఏళ్లుగా వాయిదాలు పడుతూ వస్తున్న స్వచ్ఛమైన తాగునీటి కల త్వరలోనే నెరవేరనుంది. జిల్లా అంత టా కలుషితం లేని తాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసే వాటర్‌ గ్రిడ్‌కు సర్వంసిద్ధమైంది. గ్రిడ్‌ నిర్మాణ పనులకు మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీతో ఒప్పందం కుదురింది. రూ.1400 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాణ సమయం రెండేళ్లు. ఈ కాలంలో పనులు వేగంగా పుంజుకుని పూర్తయితే.. జిల్లావాసులకు తాగునీటి సమస్య తీరనుంది.

(భీమవరం రూరల్‌–ఆంధ్రజ్యోతి)

విజ్జేశ్వరం వద్ద వాటర్‌గ్రిడ్‌ చేయనున్నారు. దీనికి సంబంధించిన స్థలాన్ని సేకరించనున్నారు. అక్కడి నుంచి రెండు ప్రధాన పైపు లైన్లు జిల్లా అంతటా వేయనున్నారు. మొదటి పైపులైన్‌ పెనుగొండ, పోడూరు, పాలకొల్లు, నరసాపురం మీదుగా మొగల్తూరు వెళుతుంది. రెండోది తణుకు, అత్తిలి, పాలకోడేరు మీదుగా భీమవరం వస్తుంది. ఈ రెండు ప్రధాన పైప్‌లైన్‌ల దూరం 1,930 కిలోమీటర్లు.

తాగునీటి స్టోరేజ్‌కు అన్ని ఏర్పాట్లు

వాటర్‌గ్రిడ్‌ ద్వారా వచ్చిన నీటిని గ్రామాల్లో స్టోరేజ్‌ చేయడానికి అవసరమైన నిర్మాణాలు చేపట్టనున్నారు. మంచినీటి పథకాలకు సంబంధించి 323 చెరువులు ఉన్నాయి. 988 ఓహెచ్‌ ఎస్‌ఆర్‌లు, 45 బీఆర్‌ ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు, 55 సంప్‌లు ఏర్పాటు చేయనున్నారు. గ్రామాల్లో 730 కి.మీ. పైప్‌లైన్లు అమరుస్తారు. వీటితోపాటు 40 వేల కొత్త కుళాయి కనెక్షన్లు ఇస్తారు. గ్రామాల్లో ప్రతి మనిషికి 55 లీటర్ల నీటిని అందించనున్నారు.

జనాభాకు తగ్గ ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు లేవు

గ్రామాల్లో రెండు దశాబ్దాల ముందే మంచినీటి పథకాలు ఏర్పడ్డాయి. అప్పటి జనాభా ప్రాతి పదికన మంచినీటి పథకాలను నిర్మించారు. ఓవర్‌ హెడ్‌ స్టోరేజీ రిజర్వాయర్‌(ఓహెచ్‌ఎస్‌ ఆర్‌) అప్పటి జనాభాను బట్టి నీటి నిల్వ ట్యాంకులు కట్టారు. ఇప్పుడు రెండింతలు జనాభా పెరిగారు. అందు వల్ల ఎక్కువ గ్రామాల్లో నీటి నిల్వ ఉండే ఓహెచ్‌ఆర్‌ నిర్మిస్తారు.

తాగునీటి వల్లే అనారోగ్యాలు

తాగునీటి కాలువల్లోకి మురుగునీరు చేరుతోంది. ప్రజలు వ్యర్థ పదార్థాలను కాల్వల్లోకే వదిలేస్తున్నారు. కాలువ చివరకు వచ్చేసరికి నీళ్లన్నీ విషతుల్యంగా మారుతున్నాయి. అది మంచినీటి చెరువులోకి పెట్టినా కలుషిత నీరే తాగాల్సిన పరిస్థితి. అందువల్ల వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటు వల్ల గ్రామాలకు స్వచ్ఛమైన నీరు అందుతుంది.

– రామారావు, భీమవరం

Updated Date - Jul 19 , 2025 | 11:56 PM