వాటర్ గ్రిడ్‌కు రూ.118 కోట్లు
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:11 AM
తణు కు పట్టణ ప్రజల తాగునీటి సమస్యను పరిష్క రించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వచ్ఛమైన గోదావరి జలాలను అందించేందుకు అవసరమైన వాటర్‌గ్రిడ్‌కు నిధులు రూ.118 కోట్లు మంజూరుచేసింది.
తణుకులో తాగునీటి సమస్యకు చెక్
విజ్జేశ్వరం నుంచి పైప్‌లైన్..ఏడాది పొడవునా నీటి సరఫరా
త్వరలో టెండర్ల ప్రక్రియకు శ్రీకారం.. ఫలించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి కృషి
తణుకు, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): తణు కు పట్టణ ప్రజల తాగునీటి సమస్యను పరిష్క రించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వచ్ఛమైన గోదావరి జలాలను అందించేందుకు అవసరమైన వాటర్‌గ్రిడ్‌కు నిధులు రూ.118 కోట్లు మంజూరుచేసింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టు పనులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. పదేళ్లుగా పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. వైసీపీ ప్రభుత్వంలో ఎంతో అట్టహాసంగా అప్ప టి సీఎం వైఎస్ జగన్ వాటర్‌గ్రిడ్ పనులకు ధవళేశ్వరం వద్ద శంకుస్థాపన చేశారు. అది కార్యరూపం దాల్చలేదు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం పట్టించుకోలేదు. తర్వాత కూటమి అధికారంలోకి రావడంతో తణుకు ఎమ్మెల్యే ఆరి మిల్లి రాధాకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. ఒకటికి, రెండుసార్లు సీఎం చంద్రబాబు, సం బంధిత మంత్రులు, అధికారుల దృష్టికి సమస్య ను తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించగ లిగారు. పట్టణ ప్రజలకు ఏడాది పొడవునా గోదావరి జలాలు అందించేందుకు తగిన ప్రణా ళికతో నిర్మాణాలు చేపట్టనున్నారు. ప్రజారోగ్య విభాగం అధికారుల పర్యవేక్షణలో పనులకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు.
34 వార్డులు.. 23 వేల ఇళ్లు
మునిసిపాల్టీలో చేరిన పైడిపర్రు, వెంకట్రాయపురం, వీరభద్రపురంలతో కలిపి పట్టణంలోని 34 వార్డుల పరిధిలోని 23 వేల గృహాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు మున్సిపల్ కుళాయిలు కేవలం మూడు వేలు మాత్రమే ఉన్నాయి. వీటికి కూరగాయల మార్కెట్, సజ్జాపురం, వెంకట్రాపురం, వీరభద్రపురంలలో ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు ఉన్నాయి. వాటికి అనుసంధానంగా 9 ఎంఎల్‌డి ట్రీట్‌మెంట్ ప్లాంటు పనిచేస్తోంది. అక్కడి నుంచి పట్టణంలోని అన్ని వార్డులకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. కొత్తగా నిర్మించిన ఎన్టీఆర్ హౌసింగ్ లే అవుట్‌ల పరిధిలోకి తాగునీటిని సరఫరా చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అజ్జరం, ఆర్టీవో కాలనీ, పైడిపర్రు, లంకలకోడేరు లే అవుట్‌ల పరిధిలో రూ.9.61 కోట్లతో పైపులైన్లు, రెండు రిజర్వాయర్లను నిర్మించనున్నారు. దీంతో ఆయా కాలనీలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందుబాటులోకి రానుంది.
విజ్జేశ్వరం నుంచి పైపులైన్లు
విజ్జేశ్వరం నుంచి నేరుగా పట్టణంలోకి ఏడాది పొడవునా తాగునీటిని సరఫరా చేస్తారు. రూ.38 కోట్లతో విజ్జేశ్వరం నుంచి అజ్జరం వద్ద ఉన్న పంపు హౌస్‌కు నేరుగా పైపులైన్లు వేస్తారు.
ఇప్పటి వరకు కాలువలు ఉన్నపుడు మాత్రమే నీరు అందుబాటులో ఉండేది. దాళ్వా తర్వాత రెండు నెలల వరకు గోదావరి నీరు ఉండేది కాదు. దీంతో బోరు నీటిని మాత్రమే తాగునీటిని వినియోగించే అవకాశం ఉండేది.
ఈ పైపులైన్ పనులు పూర్తయితే ఇకపై ఆ పరిస్థితి ఉండదు.
కొత్తగా నిర్మించేవి ఇవే
మంజూరైన రూ.118 కోట్లతో పలు నిర్మాణాలు చేపట్టనున్నారు.
ఎన్‌జీవో కాలనీలోని ఫిల్టర్ ప్లాంట్, ట్రీట్‌మెంట్ ప్లాంట్, వెంకట్రాయపురం, బ్యాంకు కాలనీ, ఎన్‌జివో కాలనీలో ఏహెచ్‌ఎస్‌లు నిర్మిస్తారు.
పంపింగ్ నెట్‌వర్క్‌కు సంబంధించి 4.6 కిలోమీటర్ల పరిధిలో కొత్తగా పైపులైన్లు వేస్తారు.
పట్టణంలో 65 కిలోమీటర్ల మేర పైపులైన్లను ఏర్పాటు చేసి తాగునీటిని సరఫరా చేస్తారు. వీటి ద్వారా నాలుగు వేల 900 కొత్త కుళాయి కనెక్షన్‌లు ఇవ్వనున్నారు.
సురక్షిత తాగునీరే లక్ష్యం : ఆరిమిల్లి రాధాకృష్ణ, తణుకు ఎమ్మెల్యే పట్టణ ప్రజలకు ఏడాది పొడవునా తాగునీటికి గోదావరి జలాలను అందించడమే మా లక్ష్యం. అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన సురక్షిత తాగునీటికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం. వైసీపీ పాలనలో ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. ఆ పార్టీ నాయకులకు ప్రజారోగ్యం అస్సలు పట్టదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు హౌసింగ్ లే అవుట్‌ల్లో వున్న ప్రజలందరికి తాగునీరు అందించే విధంగా పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నాం.
త్వరలోనే టెండర్లు : ఆర్.విజయ, డీఈ, ప్రజారోగ్య విభాగం భీమవరం
తణుకులో రూ.118 కోట్ల చేపట్టే తాగునీటి పనులకు త్వరలో టెండర్లు పిలుస్తాం. రెండు నెలల వ్యవధిలో ఈ ప్రక్రియ పూర్తి చేసి తర్వాత పనులు మొదలుపెడతాం. ఈ మేరకు వచ్చే నెల 3న కేబినేట్ సమావేశంలో తీర్మానం చేస్తారు.