నీటి పారుదలకు నిధుల వరద
ABN , Publish Date - May 16 , 2025 | 12:35 AM
పశ్చిమ డెల్టా పరిధిలో కాలువలు, డ్రెయిన్‌ల పనులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మంత్రి మండలి ఆమోదముద్ర వేయడంతో వేసవి పనులు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.
పశ్చిమ డెల్టాలో వేసవి పనులకు రూ.29.87 కోట్లు
కాలువలు, డ్రెయిన్ల మరమ్మతులకు 788 పనులు
నీటి సంఘాలదే బాధ్యత.. మంత్రి మండలి ఆమోదముద్ర
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
పశ్చిమ డెల్టా పరిధిలో కాలువలు, డ్రెయిన్‌ల పనులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మంత్రి మండలి ఆమోదముద్ర వేయడంతో వేసవి పనులు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఆర్థిక శాఖ సైతం పచ్చజెండా ఊపింది. నీటిసంఘాల ఆధ్వర్యం లో అధికారులు పనులు నిర్వహించనున్నారు, ప్రధా నంగా గుర్రపు డెక్క, తూడు తొలగింపు, పూడికతీత పనులను చేపట్టనున్నారు. జిల్లాలో అక్కడక్కడ పనులు ప్రారంభించారు. కాలువల్లో 437 పనులు చేపట్టనున్నారు. అందుకోసం రూ.15.87 కోట్లు వెచ్చించనున్నారు. డ్రెయిన్‌లలో 351 పనులకు రూ.14 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. జిల్లా అధి కారులు పంపిన ప్రతిపాదనల్లో తూడు, గుర్రపుడెక్క పనులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. కాలువలు మూసివేసే సమయానికే ప్రభుత్వం పనులు మంజూరుచేయాలి. ఆర్థికశాఖ నిధులు కేటాయింపు నకు అనుమతి ఇవ్వలేదు. దీంతో మంత్రి మండలిలో ఆమోదముద్ర వేశారు. తదుపరి ఆర్థిక శాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. పనులు నిర్వహించేందుకు నీటి సంఘాలు కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా డ్రోన్‌లతో తూడు, గుర్రపుడెక్కపై మందులను పిచి కారీ చేయనున్నారు. తద్వారా పనులు వేగవంతం కానున్నాయి. డ్రెయిన్‌లలో పూడికతీత పనులకు నిధులు కేటాయించారు. గతంలో నీటి సంఘాలు లేవు. కాలువ మొత్తానికి నిధులు మంజూరయ్యేవి. పనులు నిర్వహించేందుకు టెండర్లు పిలిచేవారు. కాంట్రాక్టర్‌ల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉండేది. బిల్లులు మంజూరు కావన్న ఉద్దేశంతో కాం ట్రాక్టర్‌లు వెనుకడుగు వేసేవారు. ప్రస్తుత ప్రభు త్వం నీటి సంఘాలకు మళ్లీ ప్రాధాన్యం ఇచ్చింది. జిల్లావ్యాప్తంగా నీటి సంఘాలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు సంఘాల సమక్షంలోనే పనులు చేపట్టను న్నారు.
జూన్ నాటికి పూర్తి కావాల్సిందే
కాలువలకు జూన్ మొదటివారంలోనే నీటిని విదుదల చేయనున్నారు. అప్పటిలోగా పూడికతీత పనులు పూర్తిచేయాలి. తూడు, గుర్రపు డెక్క తొల గింపు కోసం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే పనులు చేపట్టడంలో జాప్యం జరిగింది. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూశారు. గత ప్రభుత్వం నిధులు మంజూరు కోసం ఎదురుతెన్నులు చూడాల్సి వచ్చేది. పనులు చేపట్టిన తర్వాత బిల్లుల కోసం ఎగబడేవా రు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించేది. కోర్టులను ఆశ్రయించిన వారికే బిల్లులు ఇచ్చే సంస్కృతి వచ్చింది. ఇలా మూడేళ్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారికి మాత్రమే గత ప్రభుత్వం బిల్లులు ఇచ్చింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నీటి సంఘాలే పనులు చేపట్టనున్నాయి. బిల్లులు మంజూరు చేస్తా రన్న భరోసా ఏర్పడింది. పెండింగ్ బిల్లులను ప్రభు త్వం ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ వస్తోంది. దీంతో నీటిసంఘాలు సైతం వేసవి పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి.