నిధులు కావలెను
ABN , Publish Date - Nov 10 , 2025 | 01:20 AM
జిల్లాను నిధుల కొరత వేధిస్తోంది. పలు అభివృద్ధి పనులు నిలిచి పోయే పరిస్థితి ఏర్పడింది.
జిల్లాను నిధుల కొరత వేధిస్తోంది. పలు అభివృద్ధి పనులు నిలిచి పోయే పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక సంఘం నిధులు లేక గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరాతోపాటు వివిధ పనులు ముందుకు సాగడం లేదు. జలజీవన్ మిషన్ కింద కాంట్రాక్టర్లు చేపట్టిన పనులకు సుమారు 50 కోట్ల వరకు బకాయిలు వున్నాయి. వీటిని విడుదల చేస్తే తప్ప తాము పనులు చేపట్టలేమని వారు స్పష్టం చేశారు. అలాగే మత్స్యకారుల బోట్లకు ఇవ్వాల్సిన డీజిల్ సబ్సిడీ రెండు నెలలుగా అందడం లేదు. వీటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
స్తంభించిన జలజీవన్.. రూ.50 కోట్ల బిల్లులు పెండింగ్
నిధులు సకాలంలో విడుదల కాక జిల్లాలో జల జీవన్ మిషన్ పనులు నిలిచిపోయాయి. ప్రతి ఇంటికి కుళాయి నీరు ఇవ్వాలన్న లక్ష్యంతో రూ.335 కోట్లతో పనులు చేపట్టారు. ఇప్పటి వరకు సగం పనులు పూర్తయ్యాయి. చేసిన వాటికి బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో మిగిలిన పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు వెనకడుగు వేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
పల్లెల్లో ప్రతి ఇంటికి మంచినీరు అందించాలన్న ఉద్దేశంతో జల జీవన్ మిషన్ పథకాన్ని ప్రారంభించారు. నీటి సరఫరాకు ప్రతి నివా సానికి కుళాయి, అంత ర్గత పైప్‌లైన్లు, ఓహెచ్ ఆర్ ట్యాంకు పనులు చేపట్టడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. జిల్లాలో దీనికి రూ.335 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 50 శాతం అంటే.. రూ.167 కోట్ల విలువైన పనులు పూర్తిచేశారు. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు అధికారులు నెలవారీ లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. కాని, ఏడాది నుంచి బిల్లులు బిల్లులు పెండింగ్‌లో ఉండిపోవడంతో పనులు కొనసాగించేందుకు కాంట్రాక్టర్లు విముఖత ప్రదర్శిస్తున్నారు. పనులు మొదలైనప్పటి నుంచి విడతల వారీగా రూ.117 కోట్లు విడుదల చేశారు. ఇంకా రూ.50 కోట్లు బిల్లులు రావాల్సి వుంది. వీటిని జిల్లా గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు సీఎఫ్‌ఎంఎస్‌లో నమోదు చేశారు. బిల్లులకు డోకా లేదు.. పనులు చేయాలని అధికారులు కాంట్రాక్టర్లను కోరుతున్నారు.
కేంద్రం 60 – రాష్ట్రం 40 శాతం నిధులు
జలజీవన్ మిషన్ ప్రాజెక్ట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి. ప్రాజెక్ట్ వ్యయంలో 60 శాతం కేంద్రం, 40 శాతం నిధు లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పనులు గతంలోనే ప్రారంభమైనప్పటి కి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే బిల్లులు సక్రమంగా చెల్లిస్తారన్న నమ్మకంతో పనులు జోరందుకున్నాయి. పల్లెల్లో అవసరమైన పైప్‌లై న్లు వేసి కుళాయి సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రతి సారీ కేంద్రం నుంచి నిధులు త్వరితగతిన మం జూరయ్యేవి. ఈసారి జాప్యం జరిగిందని చెబు తున్నారు. కొన్ని రోజుల్లో ఈ సమస్య పరిష్కా రం అవుతుందని గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టం చేశారు.
వాటర్ గ్రిడ్‌తో మరింత ప్రయోజనం
ప్రస్తుతం పల్లెల్లో మంచినీటి చెరు వులకు కలుషిత నీరు చేరుతోంది. దీనివల్ల గ్రామీణ ప్రాంత ప్రజ లు శుద్ధి ప్లాంట్‌ల నుంచి నీటి ని కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే జల జీవన్ మిషన్‌తో మరింత ప్రయోజనం ఉంటుంది. విజ్జే శ్వరం నుంచి పైప్‌లైన్ ప్రాజెక్ట్ ద్వారా శుద్ధిచేసిన మంచినీటిని పం చాయతీల్లోని సంప్‌లు, ఓవర్ హెడ్ ట్యాంకులకు మళ్లిస్తారు. గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్‌లు పటిష్టంగా ఉంటాయి. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులో విజ్జేశ్వరం వద్ద ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణానికి భూమి కోసం అన్వేషిస్తున్నారు. జలజీవన్ పూర్తయితే జిల్లా ప్రజలకు స్వచ్ఛ మైన గోదావరి జలాలు ఇంటికి చేరనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం నెరవేరనుంది.
ఆర్థిక సంఘం నిధులు ఎప్పుడిస్తారు?
జిల్లాలో గ్రామ పంచాయతీలకు రావాల్సింది రూ.855 కోట్లు
ఉత్తర్వుల జారీతో ఆశలు.. భారమవుతున్న నిర్వహణ
(తాడేపల్లిగూడెం రూరల్–ఆంధ్రజ్యోతి):
ఆర్థిక సంఘం నిధుల కోసం గ్రామాలు నిరీక్షిస్తున్నాయి. ఓ వైపు పారిశుధ్య పను లు, మరోవైపు సిబ్బంది జీతాలు, వీటికితో డు విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేందు కు అవసరమైన నిధులు లేక విలవిల్లాడు తున్నాయి. 15వ ఆర్థిక సంఘం నుంచి జనాభా ధామాషా ప్రకారం మూడో విడత ఒక్కొక్కరికి రూ.473 చొప్పున నిధులు విడుదల చేశారు. నాలుగో విడత గ్రామ పంచాయతీలకు రూ.855 కోట్లు విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసి రోజులు గడుస్తున్నా, నిధులు మాత్రం విడుదల కాలేదు. వీటి కోసమే గ్రామాలు ఎదురుచూస్తు న్నాయి. మంచినీటి సరఫరా, పారిశుధ్య సమస్యలతో మైనర్ పంచాయతీలు సతమతం అవుతున్నాయి.
తుఫాన్ భారం..
మొంథా తుఫాన్ ప్రభావం గ్రామాలపై పడిం ది. పారిశుధ్య నిర్వహణ, మంచి నీటి సరఫరాకు జనరేటర్లను అద్దెకు తెచ్చి వినియోగించేందుకు పంచాయతీ పాలక వర్గాలు, అధికారులు అప్పులు చేసి మరీ అత్యవసర ఏర్పాట్లు చేశారు. ఆ ఖర్చుకు డిజాస్టర్ నిధులు వస్తాయని చెబుతున్నా అవి ఇంకా రాలేదు. కనీసం ఆర్థిక సంఘం నిధులైనా విడుదల చేస్తే సర్దుకోవచ్చని గ్రామ పాలక వర్గాలు భావిస్తున్నాయి. మరో మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్ని కలు ఉంటాయని భావిస్తున్న తరుణంలో ఈ కొద్దిపాటి సమయంలో గ్రామాల్లో మిగిలిన పనులు పూర్తి చేయాలని సర్పంచ్‌లు భావిస్తున్నారు. దీనికి ఆర్థిక సంఘం నిధులు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
ఆర్థిక సంఘ నిధుల కోసం
నిధులు లేక ఇబ్బంది పడుతున్నాం. ఆర్థిక సంఘం నిధులు వస్తే గ్రామంలో మంచినీటి పైపులైన్ల పునరుద్దరణ, కల్వర్టుల నిర్మాణం చేపట్టాలి. ఇవి పూర్తి చేస్తే మా హయాంలోనైనా కొన్ని పనులు పూర్తి చేశామనే సంతృప్తి మిగులుతుంది.
– ముప్పిడి సూర్యకుమారి, సర్పంచ్ మాధవరం