మిగిలింది అర్బన్ బ్యాంకే !
ABN , Publish Date - Nov 17 , 2025 | 12:01 AM
నరసా పురం నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల ప్రక్రియ దాదాపు పూర్తయింది.
చైర్మన్ గిరి ఎవరికో..?
నరసాపురంలో ఉత్కంఠ
నరసాపురం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): నరసాపురం నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల ప్రక్రియ దాదాపు పూర్తయింది. మార్కెట్‌యార్డుతో పాటు సొసైటీలు, ఆలయ ట్రస్టు పాలకవర్గాల నియామకాలను కూటమి నాయకులు పూర్తిచేశారు. ఇంకా అర్బన్ సొసైటీ బ్యాంకు పాలక మండలి ఒక్కటి మాత్రమే మిగిలింది. కీలకమైన ఈ బ్యాంకు చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందోనన్నది కూటమిలో చర్చనీయాంశమైంది. దాదాపు రూ.18 కోట్లు డిపాజిట్లు కలిగిన ఈ సొసైటీ పాలకవర్గ నియామకం కూటమికి సైతం కత్తిమీద సాములా మారింది. గతంలో సంక్షోభంలో కూరుకు పోయిన ఈ బ్యాంకు మళ్లీ లాభాల బాట పట్టింది. ఖాతాదారుల నమ్మకం పెంచుకుంది. నరసాపురం, మొగల్తూరు, పట్టణాలకు చెందిన చాలామంది బ్యాంకు ఖాతాదారులుగా ఉన్నారు.ఈ నేపథ్యంలో పాలకమండలి బ్యాంకుకు కీలకమైంది. ప్రస్తుతం కోఆపరేటివ్ అధికారుల పర్యవేక్షణలో పాలన సాగుతోంది. గత కమిటీ పాలకవర్గం పదవీకాలం పూర్తయింది. కూటమి అధికారంలోకి రాగానే బ్యాంకు చైర్మన్ పదవిపై పలువురు ఆసక్తి చూపారు. అయితే ఇప్పటివరకు పాలకవర్గం భర్తీ కాకపోవడంతో స్థానిక పదవులు రానివారు బ్యాంకు చైర్మన్ పదవి కోసం నేతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కూటమి నాయకులు పాలకవర్గ నియా మకంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సమర్ధవం తమైన వ్యక్తికి పగ్గాలు అప్పగించాలని యోచిస్తున్నారు. టీడీపీ తరపున కొవ్వలి నాయుడు ముఖ్య అను చరుడుగా ఉన్న సంకు భాస్కర్ పేరుతో పాటు జనసేన నుంచి కోటిపల్లి వెంకటేశ్వరావు, వలవల నాని పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి కూడా ఒక వ్యాపారవేత్త పేరు షికారు చేస్తున్నది. కూటమి నాయకులు కూడా ఖాళీగా ఉన్న ఈ పాలకవర్గాన్ని భర్తీ చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు సాగాలని యోచిస్తున్నారు.