బుట్టాయగూడెం ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాస తీర్మానం
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:18 AM
బుట్టాయగూడెం మండల పరిషత్ అధ్యక్షురాలు కారం శాంతిపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఆర్డీవో ఎంవీ రమణ నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 15 మంది ఎంపీటీసీలకు 11 మంది హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినట్టు ఆయన తెలిపారు.
బుట్టాయగూడెం, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): బుట్టాయగూడెం మండల పరిషత్ అధ్యక్షురాలు కారం శాంతిపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మండల పరిషత్ సమావేశ మందిరంలో ఆర్డీవో ఎంవీ రమణ నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 15 మంది ఎంపీటీసీలకు 11 మంది హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినట్టు ఆయన తెలిపారు. ఎంపీపీ నిర్వర్తించాల్సిన విధుల్లో ఆమె భర్త కలుగజేసుకుని అన్ని తానై వ్యహరించ డాన్ని నిరసిస్తూ సెప్టెంబరు 25న వైసీపీ ఎంపీటీసీలు తొమ్మిది మంది అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసి ఆర్డీవోకు పంపిం చారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈనెల 10న అవిశ్వాస తీర్మానం పంపిన ఎంపీటీసీలకు ఆర్డీవో 26న అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్టు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన తీర్మాన సమావే శానికి దొరమామిడి–2 ఎంపీటీసీ కారం శాంతి, కోటనాగవరం ఎంపీటీసీ కుక్కల వరలక్ష్మీ, లక్ష్ముడుగూడెం ఎంపీటీసీ చరపు సుజాత, బుట్టాయ గూడెం–1 ఎంపీటీసీ కరాటం ఫణీంద్రకుమార్ హాజరు కాలేదు. మిగిలిన 11 మంది వైసీపీ, న్యూడెమోక్రసీ, టీడీపీ ఎంపీటీసీలు సమావేశానికి హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో శాంతిపై ప్రవేశపెట్టి న తీర్మానం నెగ్గింది. ఈ మేరకు నివేదికను కలెక్టర్ పంపిస్తామని, తదు పరి ఎంపీపీ ఎవరనే దానిపై అధికారుల ఆదేశాల మేరకు నడుచుకుం టామని ఆర్డీవో తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై జరిగిన సమావేశంలో పాల్గొనని కుక్కల వరలక్ష్మీ తర్వాత తీర్మానానికి అను కూలంగా ఓటు వేసిన వారితో కలవడం కొసమెరుపు.