కొబ్బరిపై తెల్ల దోమ
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:38 AM
ఏలూరు జిల్లాలో కొబ్బరి పంటపై రుగోస్ స్పైరలింగ్ వైట్‌ఫ్లై (తెల్లదోమ) పురుగు దాడి మొదలైంది.
జిల్లాలో రుగోస్ స్పైరలింగ్ వైట్‌ఫ్లై దాడి
ప్రస్తుతం ఉధృతి తక్కువ
రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం
ఏలూరు సిటీ, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లాలో కొబ్బరి పంటపై రుగోస్ స్పైరలింగ్ వైట్‌ఫ్లై (తెల్లదోమ) పురుగు దాడి మొదలైంది. ప్రస్తుతం దీని ప్రభావం తక్కువ స్థాయిలో ఉన్నా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ తెల్లదోమ పురుగు నివారణకు సస్య రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని జిల్లా ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. జిల్లాలో కొబ్బరి తోటల విస్తీర్ణం 13,650 హెక్టార్లు. ఏటా 2.22 కోట్ల22 కొబ్బరికాయలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుతం వర్షాకాల ప్రభావంతో తెల్లదోమ దాడి తక్కువ స్థాయిలో ఉంది. వర్షాలతో పాటు వాతావరణంలో చల్లదనం వల్ల పురుగు ఉధృతి నియంత్రణలో ఉంది. రాబోయే మూడు నెలల్లో వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే వాప్తి చెం దే అవకాశాలున్నాయని ఉద్యాన శాఖాధికారులు చెబుతున్నా రు. తెల్లదోమ వల్ల ఆకుల దిగువ భాగంలో తెల్లని మైనపు పదార్థం ఏర్పడడం, హనీడ్యూ స్రవించటం, తద్వారా ఆకులపై నల్లటి శిలీంద్రం (సూటీ మోల్డ్) ఏర్పడి కిరణజన్యు సంక్రియ తగ్గే ప్రమాదం ఉంది. దీని ప్రభావంతో దిగుబడి తగ్గే అవకాశా లున్నాయి. కొబ్బరిసాగులో తెల్లదోమ దాడిని గుర్తించిన ఉద్యాన వన శాఖ అధికారులు, రైతు సేవా కేంద్రం సిబ్బంది ఎప్పటిక ప్పుడు రైతులకు ముందస్తు జాగ్రత్తలు, పురుగు నియంత్రణ చర్యలపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రు. పురుగు సోకిన కొబ్బరి తోటల్లో రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా ఉధృతిని సమర్ధవంతంగా తగ్గించవచ్చు.
తెల్లదోమ నివారణ చర్యలు ఇలా..
ఆకు దిగువ భాగంలో నీటితో పవర్ స్పేయింగ్ ద్వారా బలంగా పిచికారీ చేసుకోవాలి.
ఎకరాకు పనుపురంగు జిగురు అట్టలను 15 నుంచి 20 వరకు ఏర్పాటు చేసుకోవటం వల్ల పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు.
వేపనూనె 5000 పీపీఎం 5 మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి ఆకు అడుగు భాగాలు తడిసేలా పిచికారీ చేయాలి.
ఈసారియా ఫేమస్వరోజియా అనే జీవ శిలీంధ్రాన్ని పిచికారీ చేసుకోవటం వల్ల పురుగు నివారించవచ్చు.
తెల్లదోమకు సహజ శత్రువులైన ఎంకార్స్య వంటి పరాన్నజీవులను లేడిబగ్ బీటెల్ వంటి శత్రువులను తోటలో వృద్ధి చెందేలా ప్రోత్సహించాలి.
తేమ వాతారణంలో పురుగు వ్యాప్తి తక్కుగా ఉంటుంది. రానున్న రోజుల్లో ఉధృతి పెరగక ముందే రైతులు నివారణ చర్యలు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు
సమగ్ర యాజమాన్య పద్దతులను రైతులకు చేరేలా క్షేత్రస్థాయిలో రైతు సేవా కేంద్రాల సిబ్బంది, ఉద్యాన శాఖాధికారులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉద్యానవన శాఖ డిడి షాజానాయక్ తెలిపారు. రైతులు ఎప్పటికప్పుడు కొబ్బరి తోటలను గమనిస్తూ సూచనలను పాటిస్తూ పురుగు ఉధృతిని గమనిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
– షాజా నాయక్, డీడీ, ఉద్యాన శాఖ