Share News

వినాయక చవితి ఉత్సవాలకు ముస్తాబైన గణేశ్‌

ABN , Publish Date - Aug 23 , 2025 | 12:21 AM

వినాయక చవితి ఉత్సవాలకు గణనాథుడు ముస్తాబయ్యాడు.

వినాయక చవితి ఉత్సవాలకు ముస్తాబైన గణేశ్‌

ఏలూరు కార్పొరేషన్‌, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): వినాయక చవితి ఉత్సవాలకు గణనాథుడు ముస్తాబయ్యాడు. ఉమ్మడి జిల్లాలో పలు పట్టణాల్లో రాజస్థాన్‌ కళాకారులు పీవో పీ, తాటిపీచు, కొబ్బరిపీచుతో వివిధ ఆకృతులు, రం గుల్లో గణనాథుల విగ్రహాలను తయారుచేశారు. అడుగు ఎత్తు నుంచి 20 అడుగుల విగ్రహాలను గణేశ్‌ ఉత్సవ నిర్వాహకులు కొనుగోలు చేస్తున్నారు. విగ్రహాల ఎత్తును బట్టి రూ.5 వేల నుంచి రూ.70 వేల ధర పలుకుతోంది. రాజస్థాన్‌ కళాకారులతో పాటు స్థానిక కళాకారులు కూడా గణేశ్‌ విగ్రహాలు తయారు చేస్తున్నారు. పీవోపీ మాత్రమే కాకుండా మట్టి విగ్రహాలు సిద్ధం చేస్తున్నారు. పాలకొల్లు సమీ పంలోని వర్దనం గ్రామానికి చెందిన ఇంటి ప్రసాద్‌ లయన్స్‌ నగర్‌ ప్రాంతంలో మరో 10 మందితో విగ్రహాలు చేస్తున్నాకు. 3 నెలలుగా కొన్ని విగ్రహాల ను తయారుచేసి ఉత్సవాలకు సిద్ధం చేశామన్నారు. సుమారు రూ.3లక్షల పెట్టుబడితో 200 గణనాథుల విగ్రహాలను తయారు చేశానని తెలిపారు. మట్టి విగ్రహాలు కూడా కోరితే తయారుచేస్తామని తెలిపా రు. తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన రేలంగి సత్యనారాయణ దేవుళ్ల విగ్రహాలతో పాటు జాతీయ నాయకుల విగ్రహాల తయారు చేస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలకు పలు సేవా సంస్థలు ఎకో గణపతి పేరుతో మట్టి విగ్రహాలను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు.

నిబంధనలు పాటించాల్సిందే..

భీమవరం క్రైం,: ఆహ్లాదకర వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్వాహకులు కృషి చేయాలని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి పిలుపునిచ్చారు. మండపాల నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలు, భద్రతా అంశాలపై ఎస్పీ సూచనలు చేశారు.

ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి

వినాయక ఉత్సవ కమిటీలు మండపాల ఏర్పాటు, ఉత్సవాలకు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. గణేశ్‌ ఉత్సవ.నెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో ఫోన్‌ నంబర్‌, ఓటీపీ ద్వారా లాగిన్‌ అయ్యాక, అవసరమైన వివరాలను నింపాలి. దరఖాస్తును పరిశీలించిన తర్వాత పోలీసులు ఒక క్యూఆర్‌ కోడ్‌ను జారీ చేస్తారు. క్యూఆర్‌ కోడ్‌ను మండపం వద్ద తప్పకుండా అతికించాలి.

విద్యుత్‌ జాగ్రత్తలు: విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్‌ వైరింగ్‌ను నిపుణులతో చేయించాలి.

సౌండ్‌ సిస్టమ్‌: లౌడ్‌ స్పీకర్లను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉపయోగించాలి. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, మతపరమైన ప్రదేశాల వద్ద మైకులు వాడకూడదు.

నిఘా: మండపాలలో రాత్రిపూట కమిటీ సభ్యులు కాపలా ఉండాలి. మండపాలలో విలువైన వస్తువులను ఉంచకూడదు. శాంతి భద్రతల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.

రోడ్డు భద్రత: విగ్రహాలను, మండపాలను రోడ్లపై ఏర్పాటు చేయరాదు. బ్యానర్లు, ఫ్లెక్సీలు ప్రజలకు, ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బందులు కలిగించకూడదు.

ఊరేగింపు, నిమజ్జనం నిబంధనలు

నినాదాలు, ప్రదర్శనలు: ఊరేగింపు సమయంలో కులలాలు, మతాలు లేదా పార్టీలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే నినాదాలు, అనుచిత ప్రదర్శనలు, అసభ్యకరమైన నృత్యాలు చేయకూడదు. డీజే, బాణసంచాకు అనుమతి లేదు.

వాహనాల నియమాలు: నిమజ్జనం వాహనాలకు లైసెన్స్‌ ఉన్న డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలి. మద్యం సేవించిన వారు లేదా మైనర్లు వాహనంపై ఉండకూడదు.

నిమజ్జన సమాచారం: నిమజ్జనం మార్గం, సమయం, తేదీ వివరాలను పోలీసులకు తప్పనిసరిగా తెలియజేయాలి. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా కమిటీ సభ్యులు తగినంత మంది వాలంటీర్లను ఏర్పాటు చేయాలి.

భద్రతా ఏర్పాట్లు: నిమజ్జన ప్రదేశాల్లో గజ ఈతగాళ్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి.

అవాంఛనీయ సంఘటన జరిగినా, జరగడానికి అవకాశం ఉన్నా వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు లేదా డయల్‌ 112కు సమాచారం ఇవ్వాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు.

Updated Date - Aug 23 , 2025 | 12:21 AM