పల్లెలకు వెలుగు
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:36 AM
నిధులు లేక అల్లాడుతున్న గ్రామ పంచాయతీలకు ఊరట లభించనున్నది.. ఆర్థిక సంఘ నిధులు విడుదల చేసింది.. పారిశుధ్యం, మంచినీటి నిర్వహణ చేపట్టలేక సతమతమవుతున్నం పంచా యతీలు ఈ నిధులతో కష్టాల నుంచి బయట పడనున్నాయి..
పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు
రెండో విడత రూ. 23.39 కోట్లు
పుంజుకోనున్న అభివృద్ధి పనులు
నియోజవర్గాలకు ఉపాధి నిధులు
ప్రతిపాదనలు పంపాలంటూ ఆదేశాలు
కసరత్తు చేస్తున్న ప్రభుత్వ అధికారులు
నిధులు లేక అల్లాడుతున్న గ్రామ పంచాయతీలకు ఊరట లభించనున్నది.. ఆర్థిక సంఘ నిధులు విడుదల చేసింది.. పారిశుధ్యం, మంచినీటి నిర్వహణ చేపట్టలేక సతమతమవుతున్నం పంచా యతీలు ఈ నిధులతో కష్టాల నుంచి బయట పడనున్నాయి.. అంతేకాకుండా జాతీయ ఉపాధి హామీ పథకంలో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాల కోసం నిధులు మంజూరు కానున్నాయి.. నియోజకవర్గానికి రూ. 3 కోట్లు ప్రతిపాదనలు పంపేందుకు కసరత్తు చేస్తున్నారు.. దీంతో పల్లెలకు కొత్త వెలుగు రానున్నది..
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. పంచాయతీ ఖాతాల్లో సొమ్ములు జమయ్యాయి. ప్రభుత్వం జిల్లాలోని అన్ని పంచాయతీలకు రూ.23.39 కోట్లు విడుదల చేసింది నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న పల్లెలకు ఊరట లభించింది. మంచినీరు, పారిశుధ్య నిర్వహణతో పాటు, మౌలిక వసతుల కల్పనకు నిధులు వినియో గించుకునే వెసులుబాటు లభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లో పెద్ద మొత్తంలో నిధులు మంజూ రయ్యాయి. ఆర్థిక సంఘంతో పాటు, జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో నిధులు కేటాయించడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు పరుగులు తీశాయి. ఇటీవల ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహకారం అందలేదు. ముఖ్యంగా 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం పంచాయతీలు ఎదురు చూశాయి. కనీసం మంచినీరు సక్రమంగా సరఫరా చేయడానికి ఇబ్బందులు పడ్డారు. పారిశుధ్య నిర్వహణ కష్టతరమై పోయింది. మంచినీటి సరఫరాలో కీలకమైన ఫిల్టర్ బెడ్‌లను మరమ్మతులు చేయడానికి కటకట లాడారు. పాలకవర్గాలు దిక్కు తోచని స్థితిలో కూరుకుపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో నిధులు పంచాయతీలకు ఊపిరి పోయనున్నాయి.
పంచాయతీ ఖాతాల్లో జమ
కూటమి ప్రభుత్వం పంచాయతీ నిధులపై ఆంక్షలను తొలగించింది. నిధులు వెచ్చించిన వెంటనే బిల్లులు జమయ్యేలా చర్యలు తీసుకుంది. మేజర్ పంచాయతీలకు ఆస్తి పన్ను రూపంలో కొంత మేర నిధులు అందుబాటులో ఉన్నాయి. వాటిని సీసీ రహదారులు, డ్రెయిన్ల కోసం వెచ్చించారు. ఇక ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేస్తుందని ఎదురుచూశారు. నెలలు గడచిపోతు న్నాయి. నిధులు రావడం లేదు. ఉన్న నిధులు కాస్త తరిగిపోయాయి. గల్లాపెట్టి ఖాళీ అయ్యింది. సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల నుంచి రావాల్సిన పన్ను కూడా పంచాయతీలకు జమ కాలేదు. ఒక్కసారి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. పంచాయతీ కార్యదర్శులంతా పారిఽశుధ్య నిర్వహణ కోసం నానా అవస్థలు పడ్డారు. నిధులు వస్తాయన్న ఉద్దేశంతో పలు పంచాయతీలు ముందుగానే మౌలిక వసతు లను అభివృద్ధి చేశాయి. తీరా బకాయిలు చెల్లించలేక పోయారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీ ఖాతాల్లో జమ చేసింది. టైడ్, అన్‌టైడ్ నిధులను విడుదల చేసింది. పారిశుధ్యం, మంచినీటి అవసరాలకు మాత్రమే టైడ్ గ్రాంట్ వినియోగించాలి. అదే అన్‌టైడ్ గ్రాంట్ అయితే మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించు కునే అవకాశం ఉంది.
నియోజకవర్గానికి రూ. 3 కోట్లు
భీమవరం–ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో గ్రామాల్లో సీసీ రహదారులు, డ్రెయిన్లు నిర్మించేందుకు నిధులు మంజూరు కానున్నాయి. జిల్లాలోని ప్రతి నియోజక వర్గానికి రూ.3 కోట్లు మంజూరు చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ మేరకు ప్రతిపాదనలు పంపాలంటూ ఎమ్మెల్యేలకు వర్తమానం పంపారు. జిల్లా అధికారులు సమాచారం ఇచ్చారు. ప్రతి పాదనలు వెళ్లిన తర్వాత నిధులు మంజూరు చేయ నున్నారు. టెండర్‌లు పిలిచి పనులు ప్రారంభిం చనున్నారు. జిల్లాలోని ఏడు నియోజక వర్గాలకు రూ.21 కోట్లు మంజూరు చేసేలా ప్రణాళిక చేశారు. గత ఏడాది ప్రభుత్వం జిల్లాలో రూ. 47 కోట్లతో పనులు చేపట్టింది. పల్లెల్లో సీసీ రహదారులు, బీటీ రోడ్లు నిర్మించారు. శ్మశాన వాటికలు అభివృద్ధి చేశారు.కమ్యూనిటీ హాళ్లు నిర్మించారు. ఆ బిల్లులు మంజూరు కావాల్సి ఉంది. ప్రభుత్వం ఒక్కొక్కటిగా చెల్లిస్తూ వస్తోంది. తాజాగా జిల్లాలో రూ. 21 కోట్లతో సీసీ రహదారులు, డ్రెయిన్‌లు వంటి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు.
కానరాని ఉత్సాహం..
జాతీయ గ్రామీణ ఉపాధి నిధులపై గతంలో ఉన్నంత ఉత్సాహం ఇప్పుడు పంచాయతీల్లో కానరావడం లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి నిధులంటే హడలిపోతున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో బిల్లులు మంజూరు చేయకుండా వేధించింది. అంతకుముందున్న బకాయిలు చెల్లించలేదు. వైసీపీ హయాంలో చేపట్టిన పనులకు బిల్లులు పెండింగ్‌లో పెట్టింది. వాటన్నింటినీ కూటమి ప్రభుత్వం చెల్లించింది. ఇంకా చెల్లిస్తూనే ఉంది. అయితే జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో రూ.47 కోట్టతో పూర్తి చేసిన పనులకు బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. అదే ఇప్పుడు పంచాయతీలను ఆలోచింపచేస్తోంది. గతంలో ప్రతిపాదనలు పంపాలంటే ఆగ మేఘాలపై సిద్ధం చేసేవారు. ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బకాయిలు చెల్లించకపోతే కొత్త ప్రతిపాదనలు పంపినా ఫలితం లేదంటూ పంచాయతీ పాలకవర్గాల్లో చర్చ మొదలైంది. కాంట్రాక్టర్‌లపై ఒత్తిడి చేసి పనులు చేయించిన శాసనసభ్యులు బిల్లులు మంజూరు కాకపోవడంతో ప్రజల నుంచి వచ్చే వినతులపై హామీలు ఇవ్వలేకపోతున్నారు.