భారత్‌లో బుల్లెట్ ట్రైన్
ABN , Publish Date - Jun 19 , 2025 | 12:25 AM
భారత్‌లో 2026 నాటికి బుల్లెట్ ట్రైన్ వస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు.
మోదీ సారధ్యంలో దేశం ముందుకు..
కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ
తాడేపల్లిగూడెం, జూన్ 18(ఆంధ్రజ్యోతి): భారత్‌లో 2026 నాటికి బుల్లెట్ ట్రైన్ వస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ వద్ద బుధవారం వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొ న్నారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోదీ సారధ్యంలో దేశం అన్నిరంగాలో ముందుకు దూసుకువెళుతుందన్నారు. కొత్త విమానాశ్రయాలు కేటా యించిన జాబితాలో ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఒకటి వస్తే రెండవది తాడేపల్లిగూడెంకు కేటాయించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వ లేక ఆరోపణలు చేస్తున్నాయన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ సత్తా ఏమిటో చూపిస్తున్నామన్నారు. తాడేపల్లి గూడెం వంటి నియోజకవర్గానికి కేవలం సంవత్సర కాలంలో రూ.5 కోట్లు కేటాయించామన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ విమానాశ్రయం కేటాయించడానికి సహకరించన కేంద్ర మంత్రి వర్మను కొనియాడారు. ఏదడిగినా లేదనకుండా నిధులు విడుదల చేయడం వర్మకు మాత్రమే సాధ్య మన్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జి మాట్లాడుతూ పోలవరం, అమరావతి రాజధానికి కేంద్రం అందిస్తున్న సహకారం వెలకట్ట లేనిదన్నారు. ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు చేసిన అభివృద్దిని అడ్డుకోలేవన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, కూటమి నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, దత్తు ప్రసాద్, దువ్వా శ్రీను, సమయమంతుల కాశీ తదితరులు పాల్గొన్నారు.