మార్మోగిన గోవింద నామస్మరణ
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:13 AM
ద్వారకాతిరుమలేశుని దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కళకళలాడింది. సెలవురోజు కావడంతో ఉదయం నుంచే ఆలయానికి భక్తుల రాక ప్రారంభమైంది. ఆల యంలోని అన్ని విభాగాలు భక్తులతో కిటకిటలాడాయి.
భక్తులతో కిటకిటలాడిన శ్రీవారి రక్షేత్రం
ద్వారకాతిరుమల, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ద్వారకాతిరుమలేశుని దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కళకళలాడింది. సెలవురోజు కావడంతో ఉదయం నుంచే ఆలయానికి భక్తుల రాక ప్రారంభమైంది. ఆల యంలోని అన్ని విభాగాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయంలో గోవింద నామస్మరణ మార్మోగింది. దాదాపు 15వేల మందికి పైబడి భక్తులు ఆలయానికి వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి రెండు గంటల పైబడి సమయం పట్టింది. సాయంత్రం నుంచి రద్దీ కాస్త తగ్గుముఖం పట్టింది. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తుండడంతో భక్తులు తడుస్తూనే ఆలయంలో రాకపోకలు సాగించారు.
22న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
శ్రీవారి ఆలయ అనివేటి మండప ఆవరణలో ఈనెల 22న సామూహిక వరలక్ష్మీవ్రతాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో ఎన్వీ సత్యనారాయణమూర్తి తెలిపారు. శ్రావణమాసంలో ఆఖరి శుక్రవారం కావడంతో మహిళాభక్తులతో ఉచితంగా పూజలు నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆ రోజున ఉదయం 9.30 గంటల నుంచి వ్రతాలు నిర్వహిస్తామన్నారు. మహిళా భక్తులు ముందుగా తమ పేర్లను స్థానిక పాదుకా మండపం వద్దనున్న సమాచారకేంద్రంలో నమోదు చేయించుకోవాలని కోరారు.
నేటి నుంచి లక్ష్మీపురం శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు
పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందిన లక్ష్మీపురం సంతాన వేణుగోపాల జగన్నాథ స్వామి ఆలయంలో శ్రీనివాసుని దివ్య పవి త్రోత్సవాలు సోమవారం సాయంత్రం నుంచి ప్రారంభ మవుతాయని ఆలయ ఈవో సత్యనారాయణ మూర్తి తెలిపారు. వీటిని ఈనెల 21 వరకు నాలుగురోజుల పాటు నిర్వహించనున్నారు. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసి తెలియక జరిగిన తప్పుల ప్రాయఃచిత్తం నిమిత్తం ప్రతీ ఏటా వీటిని నిర్వహించడం సంప్రదాయం. ఉత్సవాల్లో భాగంగా 18న సాయంత్రం అంకురా ర్పణ, 19న పవిత్రాధివాసం, 20న పవిత్రారోపణ, 21న జరిగే శ్రీమహాపూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయని తెలిపారు.