చిన వెంకన్న హుండీ ఆదాయం రూ.4.22 కోట్లు
ABN , Publish Date - Nov 05 , 2025 | 12:15 AM
ప్రము ఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీ ఆదాయం భారీగా సమకూరింది.
వడ్డీ కాసుల వాడికి 41 రోజులకు భారీ ఆదాయం
ద్వారకాతిరుమల, నవంబర్ 4(ఆంధ్రజ్యోతి): ప్రము ఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీ ఆదాయం భారీగా సమకూరింది. 41 రోజుల కాలానికి హుండీ ఆదాయం మంగళవారం లెక్కించామని, నగదు రూ రూ.4.22 కోట్లు లభించినట్లు ఈవో ఎన్వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. ప్రమోద కల్యాణ మండప ఆవరణలో అత్యంత భద్రతాఏర్పాట్ల నడుమ ఆదాయం లెక్కించారు. 4,22,31,799 రూపా యల నగదుతో పాటు 569 గ్రాముల బంగారం, 7.708 కేజీల వెండి లభించినట్లు ఈవో వివరించారు. రద్దయిన పాతనోట్లు రూ.500 (30), 1000 (20), 2000(3)తో పాటుగా విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది.
హుండీలో టాయ్ కరెన్సీ!
సాక్షాత్తూ వడ్డీ కాసుల వెంకన్నకు సైతం టాయ్ కరెన్సీ తాకిడి తప్పలేదు... హుండీలలో టాయ్ కరెన్సీ నోట్లు రావడం కలకలం రేపింది. స్వామివారి హుండీలో టాయ్ కరెన్సీ కనుగొన్న అధికారులు, సిబ్బంది ఉలిక్కి పడ్డారు. మంగళవారం ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు సమయంలో రూ.500 కట్ట (100 నోట్లు)ఒకటి అనుమానంగా ఉండడంతో అధికారులు పరిశీలించి అవి టాయ్ కరెన్సీగా గుర్తించారు. ఈ నోట్లను హుండీలో ఎవరు వేశారనేది విచారణ జరపాల్సి ఉంది. హుండీల్లో ఇలా నకిలీ లేదా బొమ్మ కరెన్సీ వేయడం చట్టరీత్యా నేరం. వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్ట వచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు హుండీలో లభించిన ఇటువంటి కరెన్సీని దర్యాప్తు నిమిత్తం సాధారణంగా పోలీసులకు అప్పగిస్తారు.