గోవిందా.. గోవింద..
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:44 AM
గోవింద నామ స్మరణతో చినవెంకన్న క్షేత్రంలో ఆధ్యాత్మికత సంతరించుకుంది. శ్రీవారికి ప్రీతికరమైన రోజు శనివారంతో పాటు శ్రావణమాసం కావడం వల్ల క్షేత్రానికి విశేషసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
భక్తులతో కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల,ఆగస్టు 16(ఆంధ్ర జ్యోతి): గోవింద నామ స్మరణతో చినవెంకన్న క్షేత్రంలో ఆధ్యాత్మికత సంతరించుకుంది. శ్రీవారికి ప్రీతికరమైన రోజు శనివారంతో పాటు శ్రావణమాసం కావడం వల్ల క్షేత్రానికి విశేషసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయంలోని అన్ని విభాగాలు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి ఉచిత దర్శనానికి దాదాపు రెండు గంటల పైబడి సమయం పట్టింది. సుమారు 20వేల మంది పైబడి భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చినట్టు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు ఉచిత తీర్థ, ప్రసాదాలను ఆలయ ఆవరణలో స్వీకరించి, ఆ తర్వాత అన్నప్రసాదాన్ని వకుళమాత అన్నప్రసాద భవనంలో తీసుకున్నారు.
192 జంటలతో నిత్యార్జిత కల్యాణం
చిన్నతిరుమలేశుని నిత్యార్జిత కల్యాణం రికార్డుస్థాయిలో దాదాపు 192 జంటలతో వైభవంగా జరిగింది. తొలుత ఆలయ ఆవరణలో తొళక్కవాహనంపై స్వామి, అమ్మవార్ల కల్యాణమూర్తులను ఉంచి అలంకరించి నిత్యకల్యాణ మండప వేదిక వద్దకు తెచ్చారు. తొలుత అక్కడ వున్న రెండు బంగారు సింహాసనాలపై స్వామి, అమ్మవార్ల మూర్తులను ఉంచి అలంకరించారు. అనంతరం అర్చకులు కల్యాణతంతును ప్రారంభించారు. వైఖానస ఆగమప్రకారం సుముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపచేశారు. అనంతరం మాంగల్యధారణ, తలంబ్రాలు వేడుక అర్చకుల వేదమంత్రోచ్ఛరణలు, భక్తుల గోవింద నామస్మ రణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా జరిగింది. ఈ కల్యాణ తంతును తిలకించిన భక్తజనులు పరవశించారు.
నిత్యాన్నదాన ట్రస్టుకు మూడు టన్నుల కూరగాయల వితరణ
చినవెంకన్న నిత్యాన్నదాన ట్రస్టునకు ఓ దాత మూడు టన్నుల కూరగాయలను అందించారు. నూజివీడుకు చెందిన నక్కా సత్యనారాయణ పలు రకాల కూరగాయలను తీసుకుని శనివారం క్షేత్రానికి వచ్చారు. స్వామి దర్శనానంతరం వాటిని తీసుకుని అన్నదాన సదనం వద్దకు వెళ్లి సిబ్బందికి అందించి వీటిని అన్నదానంకు వచ్చిన భక్తుల కోసం వినియో గించాలని సూచించారు.