శేషాచల వాసా.. శ్రీవేంకటేశా..
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:13 AM
సమ్మోహితమైన రూపం.. సుపరిచితమైన దరహాసంతో అభయ హస్తాన్ని ప్రసాదిస్తూ.. ఉభయనాంచారులతో రథవాహనంపై కొలువై పురవీధుల్లో విహరిస్తున్న కరుణాంతరంగుని వీక్షించిన భక్తులు పరవశించారు.
చిన్నతిరుపతిలో అట్టహాసంగా శ్రీవారి రథోత్సవం
ద్వారకాతిరుమల, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): సమ్మోహితమైన రూపం.. సుపరిచితమైన దరహాసంతో అభయ హస్తాన్ని ప్రసాదిస్తూ.. ఉభయనాంచారులతో రథవాహనంపై కొలువై పురవీధుల్లో విహరిస్తున్న కరుణాంతరంగుని వీక్షించిన భక్తులు పరవశించారు. చిన్నతిరుమలేశుని రఽథరంగ డోలోత్సవం క్షేత్రపురవీధుల్లో మంగళవారం రాత్రి అట్టహాసంగా జరిగింది.
కనకపు కొండవంటి రఽథంపై ధనుజ మర్ధనుడెక్కె రమణులతో.. అంటూ పదకవితా పితామహుడు అన్నమయ్య ఆలపించిన కీర్తనలు ఆవిష్కృతమయ్యాయి. శ్రీవారి ఆశ్వీయుజ మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం జరిగిన రథవాహన సేవ భక్తజనులకు ఆద్యంతం కన్నులపండువైంది.
రఽథోత్సవం జరిగిందిలా : శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం జరిగిన మరుసటి రోజున రథోత్సవాన్ని జరపడం ఇక్కడ సంప్రదాయబ్ధమైంది. స్వామివారి బ్రహ్మో త్సవాల సమయంలో భక్తులు స్వామికి స్వయంగా సేవచేసుకునే భాగ్యం ఈ రథోత్సవం ద్వారానే కలుగుతుంది. రాత్రి ఆలయంలో ఉభయదేవేరులతో స్వామివారిని తొళక్కం వాహనంపై ఉంచి అలంకరించారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాటభజనలు, అర్చకులు, ఆగమ విద్యార్థుల వేదమంత్రోచ్ఛరణల నడుమ వాహనాన్ని అట్టహాసంగా రథం వద్దకు తెచ్చారు. రథంలో ఏర్పాటుచేసిన సింహాసనంపై కల్యాణ మూర్తుల ను ఉంచి అలంకరించి హారతులిచ్చారు. ఆ తరువాత విశేష వాయిద్యాలు, డప్పు వాయి ద్యాలు, కోలాట భజనలు, భక్తుల గోవిలంద నామాల నడుమ క్షేత్రపురవీధుల్లో తిరుగాడింది. ఆలయ చైర్మన్ రాజా ఎస్‌వీ సుధాకరరావు, ట్రస్టీ ఎస్వీ నివృతరావు, ఈవో ఎన్వీ సత్యనారా యణ మూర్తి తొలుత రథానికి బలిహరణ సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు రథవాహనంలో కొలువైన శ్రీవారు, అమ్మవార్లను దర్శించి, రథసేవ చేసి తరించారు.
రాజమన్నార్‌గా శ్రీవారు
ద్వారకాతిరుమల, అక్టోబరు 7 (ఆంధ్ర జ్యోతి): రాజమన్నార్ అలంకరణలో చిన వెంకన్న దర్శనం భక్తులకు నేత్రపర్వ మైంది. ఆశ్వీయుజ మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా రోజుకో అలంకారంలో కటా క్షిస్తున్న స్వామి వారు మంగళవారం చండ్రకోలు, దండం ధరించి సర్వా భరణాలతో రాజమన్నార్‌గా భక్తులను అనుగ్రహించారు. స్వామిని పలువురు భక్తులు దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.