Share News

నరసాపురం–చెన్నై వందేభారత్‌ ప్రారంభం

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:30 AM

నరసాపురం– చెన్నై సెంట్రల్‌ మధ్య సోమవారం నుంచి నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.

నరసాపురం–చెన్నై వందేభారత్‌ ప్రారంభం
నరసాపురంలో వందేభారత్‌ రైలుకు పచ్చజెండా ఊపుతున్న కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ

నరసాపురం–చెన్నై వందేభారత్‌ ప్రారంభం

పచ్చ జెండా ఊపి నేతల గ్రీన్‌ సిగ్నల్‌.. రైలులో ప్రయాణం

నరసాపురం, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): నరసాపురం– చెన్నై సెంట్రల్‌ మధ్య సోమవారం నుంచి నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. నరసాపురం, పాలకొల్లు, వీరవాసరం, భీమవరం, ఉండి, ఆకివీ డు, కైకలూరు స్టేషన్‌ల మీదుగా రైలు వెళుతుంటే ఆనందం తో జనం కేరింతలు కొట్టారు. నరసాపురంలో స్టేషన్‌ వరకు వందలాది మంది విద్యార్థులు, కూటమి నాయకులు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం 2.50 గంటలకు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ జెండా ఊపి వందే భారత్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఆయనతోపాటు రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణ రాజు, పీఏసీ చైర్మన్‌ పులపర్తి రామాంజనేయులు, విప్‌లు బొమ్మిడి నాయకర్‌, బొలిశెట్టి శ్రీనివాస్‌, వెనిగట్ల రాము, కలెక్టర్‌ నాగరాణి, ఎస్పీ నయీం అస్మి, మాజీ ఎంపీ కనుమూరి బాపి రాజు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు షరీఫ్‌, మంతెన రామరాజు, కొల్లు పెద్ది రాజు, పీతల సుజాత, కోళ్ల నాగేశ్వరరావు, రైల్వే డీఆర్‌ఎం మోహిత్‌ సోనాకియా, సీనియర్‌ డీసీఎం శివప్రసాద్‌, సత్యప్ర కాశ్‌ తదితరులు రైలులో భీమవరం వరకు ప్రయాణించారు. మధ్యాహ్నం మూడు గంటల 19 నిమషాలకు రైలు భీమవరం టౌన్‌ స్టేషన్‌కు చేరుకుంది. పట్టణవాసులు, టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు స్వాగతం పలికి ఆనందోత్సాహాలు వెల్లడించారు. నేతల్లో అత్యధికులు ఇక్కడ దిగిపోగా, కేంద్ర మంత్రి వర్మ గుడివాడ వరకు ప్రయాణించారు.

హైదరాబాద్‌ కనెక్టవిటీకి అనుకూలం

నరసాపురం రైల్వే స్టేషన్‌లో జరిగిన సభలో కేంద్ర మంత్రి వర్మ మాట్లాడుతూ ‘నరసాపురం–చెన్నై సెంట్రల్‌ మధ్య నడిచే ఈ వందే భారత్‌ వల్ల ఉభయ గోదావరి జిల్లావా సులకు చెన్నై కష్టాలు తీరాయి. తిరుపతి, నెల్లూరు వెళ్లేందు కు ఇది ఎంతో అనుకూలంగా వుంటుంది. సాయంత్రం హైద్రాబాద్‌ వెళ్లాలనుకునే వారికి కనెక్టివిటీగా వుంటుంది. విజయవాడ నుంచి సాయంత్రం హైద్రాబాద్‌కు వెళ్లే ఇంట ర్‌ సిటీ, వందే భారత్‌ రైళ్లను అందుకోవచ్చు. హైదరాబాద్‌, బెంగళూరులకు వందే భారత్‌లు నడిచే విధంగా కృషి చేస్తాం. జిల్లాలో రైల్వేగేట్ల సమస్యలను అధిగమించేందుకు 48చోట్ల వంతెనలు, అండర్‌గ్రౌండ్‌ టన్నెల్స్‌ను నిర్మిస్తున్నాం. నరసాపురం నుంచి విశాఖ వెళ్లే ప్రయాణీకుల ఇబ్బందుల దృష్ట్యా గతంలో వున్న రైలును పునరుద్దరించాలని రైల్వే బోర్డును కోరుతున్నాం. నరసాపురం నుంచి అరుణాచలం వరకు నడుస్తున్న రైలును రెగ్యులర్‌ చేసేందుకు రైల్వే బోర్డు అంగీకరించింది’ అని తెలిపారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ చాగం టి మురళి, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీదేవి, కొటికలపూడి చిన్నబాబు, కలవకొలను తాతాజీ, రైల్వేబోర్డు సభ్యులు జక్కంపూడి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 12:30 AM