Share News

నరసాపురానికి వందేభారత్‌

ABN , Publish Date - May 05 , 2025 | 01:01 AM

ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న వందేభారత్‌ రైలు త్వరలో జిల్లాలో పరుగులు తీయనుంది.

నరసాపురానికి వందేభారత్‌
నరసాపురంలో ట్రాక్‌ పనులు చేస్తున్న కార్మికులు

త్వరలో రైల్వే బోర్డు ఆమోదం

నరసాపురం, మే 4(ఆంధ్రజ్యోతి): ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న వందేభారత్‌ రైలు త్వరలో జిల్లాలో పరుగులు తీయనుంది. దీనికి అనుగుణంగా నరసాపురం స్టేషన్‌లో శరవేగంగా పనులు సాగుతున్నాయి. రైల్వేబోర్డు నుంచి ఆమోదం రాగానే నరసాపురం – చెన్నై మధ్య ఈ రైలు నడవ నుంది. ప్రస్తుతం చెన్నై – విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్‌ విజయవాడ చేరిన తర్వాత తిరిగి చెన్నై వెళ్లడా నికి 4 గంటల పాటు ప్లాట్‌ఫాంపై ఉంచేస్తున్నారు. దీనితో రైళ్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది తలెత్తుతుంది. ఇటీవల విజయ వాడ రైల్వే స్టేషన్‌లో రైళ్ల సంఖ్య పెరిగింది. ప్లాట్‌ఫారం ఖాళీ లేక కొన్ని రైళ్లను సిగ్నల్‌ ఇచ్చే వరకు లూప్‌లైన్‌లో ఉంచుతు న్నారు. దీని వల్ల షెడ్యూల్‌ సమయాలు మారిపోతున్నాయి. వీటిని గుర్తించిన రైల్వే అధికారులు వందేభారత్‌ను భీమవరం వరకు పొడిగించాలని భావించారు. భీమవరం స్టేషన్‌లో నిర్వహణ సిబ్బంది లేరు. భోగిల్లో నీళ్లు నింపే పైన్‌లైన్లు కూడా లేక భీమవరం పొడిగించడానికి సాధ్యం కాలేదు.

కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ చొరవతో..

భీమవరం వరకు పొడిగించే ప్రయత్నం విరమించుకున్న రైల్వే శాఖ సమీపంలోని మచిలీపట్నం వరకైనా పొడిగిం చాలని యోచించింది. ఎన్డీఏ ప్రభుత్వంలో నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రివర్గంలో స్ధానం దక్కడంతో వందేభారత్‌ను నరసాపురం వరకు పొడిగించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఏలూరు మీదుగా వందే భారత్‌ నడుస్తోంది. పశ్చిమలో కూడా ఈ రైలును నడపాలని, ఈ ప్రాంతంలో డిమాండ్‌ను రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించ డంతో లైన్‌ క్లియర్‌ అయింది. వందేభారత్‌ రాకకు అనుగు ణంగా నరసాపురం రైల్వేస్టేషన్‌లో పనులకు పచ్చజెండా ఊపారు. ప్రస్తుతం ఒక్క ఫ్లాట్‌ఫాంలోనే రైళ్లకు నీరును నింపే సదుపాయం ఉంది. తాజాగా ఒకటో నెంబర్‌ ప్లాట్‌ఫాంలో నిలిచే రైళ్లకు నీటిని నింపే విధంగా పైప్‌లైన్‌ పనులు చేపడుతున్నారు. దాదాపు 70శాతం పనులు పూర్తయ్యాయి. ఈనెలాఖరు నాటికి పనుల్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ట్రాక్‌ పటిష్ఠ పనులు కూడా చేపడుతున్నారు.

రైల్వేబోర్డు ఆమోదం రాగానే..

ప్రస్తుతం విజయవాడ నుంచి నడిచే రైలు రాత్రి 9.30 గంటలకు చెన్నై చేరుతుంది. విజయవాడలో సాయంత్రం 3.30 గంటలకు బయలుదేరుతుంది. ఈ షెడ్యూల్‌ సమాయాలకు అనుగుణంగానే నరసాపురం – విజయవాడ మధ్య నడవ నుంది. విజయవాడకు ఉదయం 11.30 గంటలకు చేరుతుంది. అక్కడి నుంచి గంటన్నర వ్యవధిలో నరసాపురం చేరుకుని తిరిగి 2గంటలకు బయలుదేరేవిధంగా షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే సదరన్‌ రైల్వే ఈ షెడ్యూల్‌ సమయాలకు పచ్చజెండా ఊపింది. రైల్వే బోర్డు కూడా ఆమోదిస్తే వచ్చే నెల నుంచే జిల్లా వాసులకు వందేభారత్‌ కూత వినిపించే అవకాశం రానుంది.

Updated Date - May 05 , 2025 | 01:01 AM