246 ఎకరాలు.. 92 అనధికారిక లేఅవుట్స్
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:31 AM
పట్టణంలో దశాబ్ద కాలం నుంచి అనధికారిక లేఅవుట్స్ పుట్టగొడుగుల్లా వెలిశాయి.
జంగారెడ్డిగూడెంలో ప్లాట్ల కొనుగోలుదారుల గగ్గోలు
పట్టణంలో పత్తాలేని రియల్టర్లు
స్థలాల కొనుగోలుతో ఇరుక్కున్న సామాన్యులు
క్రమబద్ధీకరణకు జనవరి 23 వరకు గడువు
మునిసిపాలిటీకి 225 దరఖాస్తులు
జంగారెడ్డిగూడెంలో ఇటీవల ఒక మహిళ అనధికారిక లే అవుట్‌లో రెండు ఇంటి స్థలాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. కొంతకాలం తర్వాత ఇల్లు నిర్మించుకోడానికి అనుమతి కోరుతూ మునిసిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. అధికారులు అనుమతి నిరాకరించారు. ఆమె పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.
జంగారెడ్డిగూడెం, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): పట్టణంలో దశాబ్ద కాలం నుంచి అనధికారిక లేఅవుట్స్ పుట్టగొడుగుల్లా వెలిశాయి. మునిసిపాలిటీ, డీటీసీపీ అనుమతి లేకుండా 246 ఎకరాల్లో 92 అనధికార లేఅవుట్‌లను అధికారులు గుర్తించారు. ఏజెన్సీ ముఖద్వారమైన జంగారెడ్డిగూడెం పట్టణంలో విద్య, వైద్యం, రవాణా సదుపాయాలు మెండుగా ఉండడంతో పాటు వ్యాపార అవకాశాలు పుష్కలం. చుట్టు పక్కల ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల ప్రజలతోపాటు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు, ప్రభుత్వ ఉద్యోగులు, పొగాకు రైతులు జంగారెడ్డిగూడెంలో నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. పట్టణంలో ఇంటి కోసం స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. తెలియక కొందరు, కొంచెం తక్కువకు వస్తుందని కొందరు అనధికార లేఅవుట్‌లలో స్థలాలు కొని ఇరుకున పడుతున్నారు.
నిబంధనలు బేఖాతరు
రియల్టర్లు లేఅవుట్ వేయడంలో నిబంధనలు ఉల్లంఘిం చారు. అనుమతి లేదు. 40 అడుగుల రోడ్లు లేవు.. 10 శాతం రిజర్వు భూమి లేదు. స్ధలాలను ప్లాట్‌లుగా విభజించి నేరుగా విక్రయించడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడడమే కాకుం డా కొనుగోలుదారులు చిక్కుల్లో పడుతున్నారు. ఆ స్థలాలలో ఇంటి నిర్మాణానికి అనుమతి రాదు. అమ్ముకుందామంటే ఎవ రూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో అనధికార లేఅవుట్‌లు వేయకుండా ఆదిలోనే అడ్డుకోవడంలో అధికారులు విఫలమవడంతో ఎక్కడికక్కడ ప్లాట్‌లు వెలిశాయి. 92 అనధికారిక లే అవుట్‌లలో అధికారులు కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు.
క్రమబద్ధీకరణకు అవకాశం
అనధికార లేఅవుట్‌లో ప్లాట్ కొనుగో లు చేసి జూన్ 31 లోపు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు క్రమబద్ధీకరించు కునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిం చింది. క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేయ డానికి రానున్న జనవరి 23 వరకు గడువు ఉంది. పట్టణంలో 92 అనధికార లేఅవుట్‌లను గుర్తించి నోటీసులు జారీ చేశాం. అక్టోబరు వరకు 225 దరఖాస్తులు వచ్చాయి. ఎల్‌ఆర్‌ఎస్‌లో దరఖాస్తు చేయని వారికి క్రమబద్ధీకరణ అవకాశం ఉండదు.
– కేవీ.రమణ, మునిసిపల్ కమిషనర్