Share News

ముంచుకొస్తున్నమొంథా

ABN , Publish Date - Oct 26 , 2025 | 12:48 AM

:మొంథా తుఫాన్‌ దూసుకొస్తోంది. ఇప్పటికే మూడు రోజులుగా కురిసిన వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. శనివారం వాతావరణం కాస్త అనుకూలించిందని ఊరట చెందేలోగా బంగాళాఖాతంలో మొంథా తుఫాన్‌ తీవ్ర రూపంలో పొంచి వుంది.

ముంచుకొస్తున్నమొంథా

ముంచుకొస్తున్నమొంథా

కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం.. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు

నిన్నటి వర్షాలకు తేరుకోక ముందే మరో తుఫాన్‌

రైతుల్లో గుబులు.. ఇంకా ముంపులోనే పొలాలు

చేలకు తెగుళ్లు.. జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు

అధికారులు అలర్ట్‌గా ఉండాలని ఆదేశాలు..

ఉద్యోగులకు సెలవులు రద్దు.. కలెక్టర్‌ సమీక్ష

సముద్రంలో వేటకు వెళ్లవద్దని ఆదేశాలు

బీచ్‌లో సందర్శకులకు అనుమతులు రద్దు

భీమవరం టౌన్‌/రూరల్‌/నరసాపురం/మొగల్తూరు/పెనుగొండ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి):మొంథా తుఫాన్‌ దూసుకొస్తోంది. ఇప్పటికే మూడు రోజులుగా కురిసిన వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. శనివారం వాతావరణం కాస్త అనుకూలించిందని ఊరట చెందేలోగా బంగాళాఖాతంలో మొంథా తుఫాన్‌ తీవ్ర రూపంలో పొంచి వుంది. ఈ ఏడాది ఏర్పడిన తుఫాన్లలో ఇదే అత్యంత ప్రమాదకరమైందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో తీరం దాటే అవకాశం ఉండటంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై దీని ప్రభావం అధికంగా ఉండనుంది. ఈ నెల 28న తుఫాన్‌ తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మూడు రోజలపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో అధికార యంత్రాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. జిల్లా కలెక్టర్‌ నాగరాణి ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు. వైద్యులు అందుబాటులో ఉండాలని, తహశీల్దార్లు, మునిసిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

అఽధికారులతో కలెక్టర్‌ సమీక్ష

మొంథా తుఫాన్‌ను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టరేట్‌, నరసాపురం, తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్‌లతోపాటు, మొగల్తూరు, నరసాపురం మండల కార్యాలయాల్లోను కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటుచేశారు. జిల్లాలో శిఽథిలావస్థలో వున్న భవనాలు, తీరప్రాంతంలో తుఫాన్‌ ప్రభావం వున్న ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వేటకు వెళ్లిన మత్స్యకా రులను తిరిగి రప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. తుఫాన్‌ ప్రభావం తగ్గే వరకు వేటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీచేశారు. భీమవరం, నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగా పునరావాస కేంద్రాలకు తరలించే సన్నాహాలు చేశారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలల్లో వారం రోజులపాటు సరిపడా నిత్యావసర వస్తువులను సిద్ధం చేస్తున్నారు. ఏటిగట్లు బలహీనంగా ఉన్నచోట్ల ఇసుక బస్తాలు, సర్వే బాదులను సిద్ధం చేశారు. గాలుల కారణం చెట్లు పడిపోతే రవాణాకు ఇబ్బంది లేకుండా వెంటనే వాటిని తొలగించేలా ఏర్పాటు చేశారు. అగ్నిమాపక సిబ్బంది బోట్లు, లైఫ్‌ జాకెట్లు, మోటారు ఇంజన్లు, ట్రీ కటింగ్‌ మిషన్‌లను రెడీ చేశారు. తుఫాన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తీసుకోవలసి చర్యలపై కలెక్టర్‌ నాగరాణి జిల్లా అఽధికారులతో సమీక్షించారు. పారిశుధ్య నిర్వహణ, కలుషిత నీరు అరికట్టేందుకు తీసుకోవాలని చర్యలపై ఆదేశాలు ఇచ్చారు.

బీచ్‌కు అనుమతి లేదు

కార్తీకమాసాన్ని పురస్కరించుకుని కేపీ పాలెం, పేరుపాలెం సాగర తీరాలకు పుణ్య స్నానాలు ఆచరించేందుకు సందర్శకులను ఈ నెల 30వ తేదీ వరకూ అనుమతి లేదని తహసీల్ధార్‌ కె.రాజ్‌కిశోర్‌ తెలిపారు. 28, 29 తేదీల్లో తుఫాన్‌ తీరం దాటే అవకాశం ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శని వారం ఆయన విలేకరుల సమావేశంలో చెప్పారు.

రైతుల్లో గుబులు

మొంథా తుఫాన్‌తో రైతుల్లో ఆందోళన నెలకొంది. వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో మాసూళ్లు ముమ్మరమయ్యాయి. ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలు చేశారు. వచ్చే నెల మొదటి వారం నుంచి జిల్లాలో మాసూళ్లు సాగుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాలో వెన్ను పాలు పోసుకుంటున్నాయి. కొన్ని మండలాల్లో రంగు మారుతున్న సమయంలో మూడు రోజులుగా వర్షాలతో చేలు నేల వాలాయి. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో కొన్నిచోట్ల పంట పొలాల్లో నీరు బయటకుపోలేదు. ఈ తరుణంలో మరో మూడు, నాలుగు రోజులు వర్షాలు కురిస్తే చేతికొచ్చిన పంట మొత్తం నాశనం అయిపోతుందన్న భయం రైతుల్లో నెలకొంది.

వర్షాలతో చేలకు తెగుళ్లు

వర్షాల కారణంగా ముంపునకు గురైన వరి చేలకు తెగుళ్లు సంక్రమిస్తాయని, రైతులు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాఖ జేడీ జడ్‌.వెంకటేశ్వర్లు సూచించారు. శనివారం భీమవరం మండలం బేతపూడి, తుందుర్రు ప్రాంతాల్లోని వరి చేలను పరిశీలించారు. వర్షపు నీరు వరి చేనును ఎంత వరకు ముంపునకు గురిచేశాయన్నది అధికారులను అడిగి తెలుసుకున్నారు. మురుగు కాలువల వివరాలను రైతులను అడిగారు. వారం రోజుల్లో తుఫాను ప్రభావం ఉన్నందున రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముంపునకు గురైన వరి చేలకు ముడత, పొడతెగులు, ఊచపోటు, కంకి తెగుళ్లు పడతాయని, రైతులు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. జేడీఏ కొప్పర్తి శ్రీనివాస్‌, ఏవో ప్రకాష్‌, సిబ్బంది, రైతులు ఉన్నారు.

పొలాలను మంచేసిన నక్కల కాలువ

రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నక్కల కాలువ పొంగి ప్రవహిస్తోంది. పెనుగొండ, మునమర్రు, కొఠాలపర్రు గ్రామాల్లోని పంట పొలాలకు సమాంతరంగా ఈ కాల్వ నీరు చేరడంతో రెండూ ఏకమయ్యాయి. కాలువకు ఎగువ వైపు కాకరపర్రులో లాకులు ఎత్తి వేయడం వల్ల నీరు అధికంగా కిందికి చేరుతోందని అది కింది వైపునకు వెళ్లకుండా పల్లంగా వున్న పొలాల్లోకి నీరు చేరుతుందని చెబుతున్నారు. మరో 24 గంటలు నీటితో ఉంటే పంట చేతికి రానట్టేనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

రోడ్డుపైకి పొంగిన కొల్లేరు

కొల్లేరు మళ్లీ ఉప్పొంగుతోంది. ఇటీవల ముంపుతో అతలాకుతలమైన తీర ప్రాంతాలు తేరుకోక ముందే మళ్లీ వరద ముంపు పొంచి వస్తోంది. ఇప్పటికే పెద్దఎడ్లగాడి–పెనుమా కలంక రహదారిపై మూడడుగుల మేర నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాలతో ఒకేసారి ఎగువ నుంచి నీరు వచ్చి చేరడంతో కొల్లేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. పెద్దఎడ్లగాడి వంతెనకు గుర్రపు డెక్క మేట వేయడంతో వరద నీరు దిగువకు వెళ్లడం లేదు. ఎగువ నుంచి వస్తున్న వరద నీరు లంక గ్రామాలకు చేరడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెనుమాకలంక నుంచి నాటు పడవలపై పెద్దఎడ్లగాడి వరకు వచ్చి ఏలూరు, కైకలూరు ప్రాంతాలకు వెళుతున్నారు.

Updated Date - Oct 26 , 2025 | 12:48 AM