Share News

ముసురు

ABN , Publish Date - Dec 03 , 2025 | 12:21 AM

దిత్వా తుఫాన్‌ ప్రభావం లేకున్నా మంగళవారం ముసురు, వర్షంతో రైతులకు నష్టం వాటిల్లింది. మంగళవారం ఎడతెరిపి లేని వర్షంతో చేలల్లో నీరు చేరడంతో నాలుగు రోజుల పాటు మాసూళ్లు చేసే అవకాశం లేకుండాపోయింది.

ముసురు
పెనుగొండ మండలంలో రోడ్డు పక్కన బరకాలు ధాన్యం రాశులు

తుఫాన్‌ ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షం

పంట చేలల్లో చేరిన వర్షపు నీరు..

నాలుగు రోజులు మాసూళ్లకు కష్టం

భీమవరం రూరల్‌, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): దిత్వా తుఫాన్‌ ప్రభావం లేకున్నా మంగళవారం ముసురు, వర్షంతో రైతులకు నష్టం వాటిల్లింది. మంగళవారం ఎడతెరిపి లేని వర్షంతో చేలల్లో నీరు చేరడంతో నాలుగు రోజుల పాటు మాసూళ్లు చేసే అవకాశం లేకుండాపోయింది. జిల్లాపై తుఫాన్‌ ప్రభావం లేదని రైతులు భావిస్తున్న తరుణంలో వర్షం దెబ్బతీసిందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఉన్న 1 లక్షా 27 వేల ఎకరాల్లో ధాన్యం చితుకు అవుతుందని రైతులు కంగారు పడుతున్నారు. ఇప్పటికే మాసూలు చేసిన ధాన్యంపై తేమశాతం ఆందోళన కలిగిస్తుంటే వర్షానికి నేలకొరిగిన చేలల్లో ధాన్యం దక్కించుకోడానికి తిప్పలు తప్పవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికందే దశలో ఎకరాకు రూ.1500 అదనపు పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ధాన్యం రాశుల్లో నీరు చేరుతుందనే భయం రైతుల్లో నెలకొంది.

తీరంలో ఈదురు గాలులు

నరసాపురం/భీమవరం టౌన్‌: తీరంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో పాటు ఎడ తెరిపి లేకుండా వర్షం కురిసింది. సముద్రంలో కెరటాలు ఎగసిపడుతున్నాయి. పీఎం లంక, చిన్నలంక, పేరుపాలెం వద్ద సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. వాతావరణ శాఖ హెచ్చరికతో సముద్ర వేటకు వెళ్లిన బోట్లు లాకులు, సఖినేటిపల్లి రేవుల వద్దకు చేరాయి.

వర్షాలకుతోడు మంగళవారం ఉదయం నుంచి చలిగాలులు వీస్తున్నాయి. వర్షం చలితో చాలామంది ఇళ్లకే పరిమితం అయ్యారు. పట్టణాల్లో నిత్యం రద్దీగా ఉండే రోడ్లు జన సంచారంలేకం వెలవెలబోయాయి.

Updated Date - Dec 03 , 2025 | 12:27 AM