Share News

ఆయుధ డిపోను వ్యతిరేకిస్తూ గిరిజనుల ఆందోళన

ABN , Publish Date - Oct 08 , 2025 | 01:13 AM

పశ్చిమ ఏజెన్సీలో ఆయుధ డిపో నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం డిపో వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గిరిజనులు వివిధ రకాల పంటలను చేతపట్టుకుని కేఆర్‌ పురం ఐటీడీఏ ఎదుట ఆందోళన చేశారు.

ఆయుధ డిపోను వ్యతిరేకిస్తూ గిరిజనుల ఆందోళన

కమిషన్‌ సభ్యుడు నాయక్‌ జోక్యంతో ఆందోళన విరమణ

గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధిపై హుస్సేన్‌ నాయక్‌ సమీక్ష

బుట్టాయగూడెం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): పశ్చిమ ఏజెన్సీలో ఆయుధ డిపో నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం డిపో వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గిరిజనులు వివిధ రకాల పంటలను చేతపట్టుకుని కేఆర్‌ పురం ఐటీడీఏ ఎదుట ఆందోళన చేశారు. డిపో ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని రెండు పంటలు పండే భూముల్లో మాత్రమే వ్యతిరే కిస్తున్నామని, డిపోను ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేయాలని సాగులో ఉన్న వంకవారిగూడెం భూముల్లో వద్దని ఆందోళనకారులు తెలిపారు. ఏజెన్సీ పర్యటనలో ఉన్న జాతీయ ఎస్టీ కమిషన్‌ మెంబరు హుస్సేన్‌ నాయక్‌ ఆందోళనకారులతో మాట్లాడారు. డిపో ఏర్పాటుకు పీసా గ్రామసభ అనుమతి లేదని, గిరిజనులు వ్యతి రేకిస్తున్నా అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇంతలో పీవో కె.రాములు నాయక్‌ కలగజేసుకుని డిపో వేరే రాష్ర్టానికి వెళ్ళిపోతుంటే ఎమ్మెల్యే, ఎంపీ ప్రధానితో మాట్లాడి రాష్ర్టానికి తెచ్చారని, అన్ని అనుమతులు ఉన్నా యని చెప్పడంతో గిరిజనులు పీవో మాటల్లో వాస్తవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్‌ సభ్యుడు గిరిజనులకు సర్ధిచెప్పారు. డిపోను ఇక్కడ ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నందున విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళతానని చెప్పడంతో గిరిజనులు శాంతించారు. పోరాట కమిటీ నాయకులు తెల్లం రామకృష్ణ, మడకం వెంకటేశ్వరావు, తెల్లం దుర్గారావు ఆదివాసీలు పాల్గొన్నారు.

మౌలిక వసతులు కల్పించండి..

గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మరింతగా మెరుగుపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోతు హుస్సేన్‌ నాయక్‌ ఆదేశించారు. మంగళవారం కేఆర్‌ పురం ఐటీడీఏ సమావేశ మందిరంలో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై జిల్లా కలెక్టర్‌, ఐటీడీఏ చైర్మన్‌ వెట్రిసెల్వితో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొండ ప్రాంతాల్లోని గిరిజనుల కదలికలపై ఆంక్షలు పెట్టవద్దని, గిరిజనులకు మంజూరు చేసిన 26 ఇళ్ళను నెల రోజుల్లో పూర్తి చేయాలన్నారు. మోదేలు గ్రామానికి అన్ని వసతులు కల్పించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతో చర్చించి పెదవాగు ప్రాజెక్టు మరమ్మతులకు చర్యలు చేపట్టాలన్నారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ ఎస్టీ కమిషన్‌ పనిచేస్తుందని వారి హక్కులకు భంగం కలిగితే కమిషన్‌ చర్యలు తీసుకుంటుందన్నారు. మరో 6 నెలల్లో వస్తానని సమస్యలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. పెదవాగు ప్రాజెక్టు మరమ్మతుల పనులకు ప్రభుత్వానికి తెలంగాణ ఇరిగేషన్‌ అధికారులకు ప్రతిపాదనలు పంపామని, పోలవరం నిర్వాసితు లకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ తెలిపారు. కమిషన్‌ డైరెక్టర్‌ కళ్యాణ్‌ రెడ్డి, అధికారులు సతీష్‌రెడ్డి, జలగం ప్రసాదరావు, పివో కె.రాములు నాయక్‌, ఆర్డీవో ముక్కంటి, పోల వరం భూసేకరణ ప్రత్యేకకలెక్టర్‌ సరళా వందనం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2025 | 01:13 AM