ఆయుధ డిపో వద్దు
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:07 AM
వంకవారిగూడెం పరిధిలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటు చేయవద్దని గిరిజన సంఘాలు గళమెత్తాయి.
గిరిజన సంఘాల ర్యాలీ.. అడ్డుకున్న పోలీసులు
జీలుగుమిల్లి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): వంకవారిగూడెం పరిధిలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటు చేయవద్దని గిరిజన సంఘాలు గళమెత్తాయి. మడకంవారిగూడెం నుంచి జీలుగుమిల్లి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించేందుకు మంగళవారం పలు గిరిజన సంఘాల నాయకులు సమాయత్తమయ్యారు. పోలవరం డీఎస్పీ బి.వెంకటేశ్వరావు, డివిజన్ పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది అక్కడ మొహరించారు. ఒక దశలో పోలీస్, గిరిజన సంఘాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆయుధ డిపో ఏర్పాటుచేస్తే తాము మనుగడ కోల్పోతామని వంకవారిగూడెం, దాట్లవారిగూడెం, చీమలవారిగూడం గ్రామాల గిరిజనులు నినాదాలు చేశా రు. ర్యాలీని అడ్డుకునేందుకు వచ్చిన పోలీస్‌లపై వాగ్వివాదానికి దిగారు. అనంతరం పోలీస్‌లు ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో మడకం వారిగూడెంలోనే గిరిజనులంతా రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో గిరి జన సంఘాల నాయకులు పోలీస్‌ల మద్య తోపులాట జరిగింది. కొద్ది సేపటికి ఇరు వర్గాలు శాంతించాయి. సమస్యను పోలీస్‌లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మరో వైపు గిరిజనులు తమకు ఎదురయ్యే సమస్యలపై పోలీస్‌ల ముందు ఏకరువు పెట్టారు. ప్రస్తుతం జీలుగుమిల్లి సర్కిల్ పరిధిలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్టు అమలులో ఉందని, ప్రజలు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని గిరిజన సంఘాల నేతలకు డీఎస్పీ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. సాయంత్రం వరకు ఎటువంటి వివాదం తలెత్తకుండా పరిస్థితి అదుపులో ఉంది.
నేవీ ఆయుధ డిపోతో అభివృద్ధి : చిర్రి బాలరాజు, ఎమ్మెల్యే
వంకవారిగూడెం పంచాయతీ పరిధిలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటుతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. కొందరు కావాలని గిరిజనుల మనుగడకు విఘాతం కలుగుతుందని అపోహలు కలిగిస్తున్నారన్నారు. ఎంపీ పుట్టా మహేష్ కేంద్రంతో సంప్రదింపులు జరిపారన్నారు. ఈ ప్రాంత వాసులకు ప్యాకేజీ అమలు చేసిన అనంతరం నేవీ ఆయుధ డిపో ఏర్పాటు చేస్తారన్నారు.