రైళ్లలో చోరీలకు చెక్ !
ABN , Publish Date - Aug 30 , 2025 | 12:33 AM
గతంలో రైలు ప్రయాణం చేయాలంటే ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా చేసేవారు. ఎంత దూరమైనా కుటుంబంతో ఆనందంగా ప్రయాణించేవారు. ఇటీవల రైలు ప్రయాణాల్లో చోరీల భయం వెంటాడుతుంది.
త్వరలో బోగీలలో సీసీ కెమెరాలకు సన్నాహాలు
ఇటీవల రైళ్లలో పెరుగుతున్న దొంగతనాలు
కాపుకాసి దోచుకుంటున్న వైనం..
అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పోలీసులు
భీమవరం క్రైం, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): గతంలో రైలు ప్రయాణం చేయాలంటే ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా చేసేవారు. ఎంత దూరమైనా కుటుంబంతో ఆనందంగా ప్రయాణించేవారు. ఇటీవల రైలు ప్రయాణాల్లో చోరీల భయం వెంటాడుతుంది. దుండగులు రైళ్లను ఏదో విధంగా సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైళ్లను ఆపి దొంగతనాలకు చేస్తున్నారు. కిటికీల పక్కన ఉండే ప్రయాణికుల మెడలోని వస్తువులు లాగేస్తున్నారు. ప్రయాణికులతోపాటుగా తోటి ప్రయాణికుల మాదిరిగా రైలులో ప్రయాణించే వారిని ఆదమరిచేలా చేసి విలువెన వస్తువులను దోచుకుపోతున్నారు. ఈ రకంగా దొంగతనాలు రోజురోజుకూ పెరిగిపోతూ ఉండడంతో రైలు ప్రయాణం చేయాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీసులు ఎప్పటికప్పుడు గస్తీలు తిరుగుతున్నప్పటికీ దొంగలు అవేమీ పట్టించుకోకుండా వారి పని కానిచ్చేస్తున్నారు. ఇటీవల కాలంలో పెరుగుతున్న దొంగతనాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లకు సన్నద్ధమవుతుంది. ప్రతి బోగీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఇప్పటికే సన్నాహాలు చేశారు. భద్రతను మరింత కట్టుదిట్టంగా పెంచేందుకు పూర్తి స్థాయిలో అధికారులు చర్యలు చేపడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.
వరుస దొంగతనాలతో ప్రయాణికుల ఆందోళన
ఇటీవల ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లను దొంగలు సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి ఆపి దోచుకోవడం చేస్తున్నారు. కొద్దికాలం క్రితం లింగంపల్లి ఎక్స్‌ప్రెస్‌ను ఆపి దొంగతనానికి ప్రయత్నించారు. అధికారులు అప్రమత్తం కావడంతో పరారయ్యారు. ఈనెల 25వ తేదీ రాత్రి నరసాపురం– నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపూడి జంక్షన్ వద్ద సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైలును ఆపి దొంగతనానికి ప్రయత్నించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీసులు అప్రమత్తం కావడంతో దొంగలు పరారయ్యారు. ఈవిధానం వల్ల రైళ్లు నిలిచిపోవడంతో దొంగతనాలు వారికి సులువుగా మారాయి. సిగ్నల్ ట్యాంపరింగ్ అవ్వకుండా ఉండేందుకు రైల్వే శాఖ పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ దొంగలు ట్యాంపరింగ్ విషయంలో చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు.
పెరుగుతోన్న దొంగతనాలు
దొంగతనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఏడాదికి సగటున భీమవరం గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో 20 కేసుల వరకు నమోదవుతున్నాయంటే ఏమేరకు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. భీమవరం రైల్వే పోలీస్ స్టేషన్ వేలివెన్ను, నరసాపురం, కైకలూరు వరకు విస్తరించి ఉంది. ఈ పరిధిలో దొంగతనాల సంఖ్య భారీగానే జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో నేరాలను అరికట్టాలంటే పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కొన్ని పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరత వేధించడం వల్ల దొంగతనాలు అరికట్టేందుకు వీలు పడడం లేదని కొందరు పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా దీనిపై పోలీసులు, ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి బోగీలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవడం మంచి పరిణామం. ఈవిధానం వల్ల దొంగతనాలు అరికట్టేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది.
బీట్లు పెంచాం.. చర్యలు తీసుకుంటున్నాం
దొంగతనాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. బీట్లు పెంచి రాత్రిపూట ప్రత్యేకంగా ప్లాట్ ఫారాలపై అనుమానితులను ఉంచకుండా చూస్తున్నాం. పాత నేరస్తులను ఎప్పటికప్పుడు బైండోవర్ చేసి వారిపై ప్రత్యేక నిఘా పెంచాం. రైలు వేగంగా వెళ్తున్నప్పుడు సిగ్నల్ ట్యాంపరింగ్ చేయడం, తర్వాత దొంగతనాలు చేయడం కొందరు దొంగలు చేస్తున్నారు. దానిపై నిఘా పెంచాం. బోగీల వద్ద రైలు వేగం తగ్గుతున్నప్పుడు కొందరు దొంగతనాలకు ప్రయత్నిస్తున్నారు. వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నాం.
– సుబ్రహ్మణ్యం, రైల్వే జీఆర్‌పీ ఎస్‌ఐ