ట్రాఫిక్ కష్టాలు
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:24 AM
తాడేపల్లిగూడెం పట్టణంలో కొన్నిచోట్ల ట్రాఫిక్ మళ్లింపు చర్యలపై ప్రజలు, వ్యాపారులు మండి పడుతున్నారు.
తాడేపల్లిగూడెంలో ట్రాఫిక్ మళ్లింపు
వాహనదారుల పాట్లు
తాడేపల్లిగూడెం, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెం పట్టణంలో కొన్నిచోట్ల ట్రాఫిక్ మళ్లింపు చర్యలపై ప్రజలు, వ్యాపారులు మండి పడుతున్నారు. పట్టణంలోని నారాయణ షాపింగ్‌మాల్ సెంటర్ ఇప్పుడు రద్దీగా మారింది. భారీ వస్త్ర దుకాణాలతో నిత్యం రద్దీ నెలకొనడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. గణేశ్ నగర్ రోడ్డులో వ్యాపార దుకాణాలు, థియేటర్లు, కళాశాలతో ట్రాఫిక్ సమస్య జఠిలమైంది. వాహనచోదకులు అడ్డదిడ్డంగా రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనితో పోలీస్‌లు నారాయణ షాపింగ్ మాల్ వద్ద వన్‌వే చేశారు. గణేశ్ నగర్, వస్త్ర దుకాణాలకు వెళ్లే వారు ఆర్టీసీ అవుట్ గేట్ వద్ద టర్న్ తీసుకుని రావాల్సి వస్తుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు నుంచి వచ్చేవారు పోస్టాఫీస్, జీవిత బీమా కార్యాలయాలకు, కొత్త బ్రిడ్జిపై నుంచి ఏలూరు వైపు వెళ్లేవారికి మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. షాపింగ్ మాల్ చౌరస్తా రద్దీ కారణంగా ప్రమాదాలు, వివాదాలు నిత్యకృత్యం కావడం, వాహనదారులు అడ్డదిడ్డంగా వెళ్లడంతో ట్రాఫిక్ మళ్లించినట్లు పోలీస్‌లు చెబుతున్నారు.
నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీస్‌లు ఉండాలని స్థానికులు, వ్యాపారులు కోరుతున్నారు. పట్టణానికి వచ్చేవారు ట్రాఫిక్ నిబంధనలతో షాపింగ్ చేయకుండా వెనుదిరుగుతున్నారని వ్యాపారులు వాపోతున్నారు. నారాయణ షాపింగ్ మాల్ సెంటర్‌లో పోలీస్‌లు ట్రాఫిక్‌ను క్రమబద్ధీక రించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.