పట్టణాల్లో చెత్తకు చెక్
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:44 AM
పట్టణాల్లో సేకరించిన చెత్త డంపింగ్ చేయడం అధికారులకు నిత్యం అగ్ని పరీక్ష. కంపోస్ట్ యార్డులు లేకపోవడం, గుట్టలుగా చెత్త పేరుకుపోవడంతో స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.
జిల్లాకు రూ. 37 కోట్లు మంజూరు
కంపోస్ట్ యార్డులు నిర్మాణం
తడి చెత్తతో వర్మి కంపోస్ట్
పొడి చెత్త రీసైక్లింగ్
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
పట్టణాల్లో సేకరించిన చెత్త డంపింగ్ చేయడం అధికారులకు నిత్యం అగ్ని పరీక్ష. కంపోస్ట్ యార్డులు లేకపోవడం, గుట్టలుగా చెత్త పేరుకుపోవడంతో స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. వర్మీ కంపోస్ట్ తయారీ, రీసైక్లింగ్‌తో ఈ సమస్యకు ప్రభు త్వం చెక్ పెట్టనుంది. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి తడి చెత్తతో వర్మి కంపోస్ట్‌ను తయారు చేయనున్నారు. పొడి చెత్తను రీసైక్లింగ్, శక్తి ఉత్పాద కతకు తరలించనున్నారు. ప్రతి పట్టణంలో యార్డులఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయడంతో ప్రభుత్వం నిధులు కేటాయించింది. టెండర్లు పిలిచి ఏజన్సీలు ఖరారైతే యార్డుకు అవసరమైన భూమిని అప్పగిం చాల్సి ఉంటుంది. జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం పురపాలక సంఘాలతోపాటు, ఆకివీడు నగర పంచాయతీలో వర్మి కంపోస్ట్, రీసైక్లింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. జిల్లాకు ప్రభుత్వం రూ. 37 కోట్లు నిధులు మంజూరు చేయడంతో పబ్లిక్ హెల్త్ విభాగం టెండర్లు పిలిచింది. కంపోస్ట్ యార్డులకు అవసరమైన భూమిని సిద్ధం చేసేలా మునిసిపాలిటీలు కసరత్తు చేస్తున్నాయి. జిల్లాలో తణుకు పట్టణంలో మాత్రమే అవసరమైన భూమి ఉంది. పాలకొల్లులో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. నరసాపురం పట్టణానికి సమీప గ్రామంలో ఇళ్లకోసం సేకరించిన 4.50 ఎకరాల భూమిలో యార్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడ పట్టాలు పొందిన లబ్ధిదారులకు మరో ప్రాంతంలో స్థలాలు ఇవ్వనున్నారు. ఆకివీడులో 2 ఎకరాల భూమి అవసరం కానుంది. భీమవరం, తాడేపల్లిగూడెం పురపాలక సంఘాల్లో 6 ఎకరాలు సమీకరించేందుకు సన్నద్ధమవుతున్నారు. కంపోస్ట్ యార్డులు ఏర్పాటైతే చెత్త సమస్య పరిష్కారం కానుంది.
సుదీర్ఘ సమస్య తీరనుందా..
భీమవరంలో ఏళ్ల తరబడి కంపోస్ట్ యార్డు సమస్య వెంటాడుతోంది. యనమదుర్రు డ్రెయిన్ గట్టుపై చెత్త డంప్‌చేసి తగుల బెడుతున్నారు. కంపోస్ట్ యార్డు కోసం స్థలం సేకరించినా సమీప రైతులు కోర్టును ఆశ్రయించడంతో అది మరుగనపడింది. తాడేపల్లిగూడెంలో కుంచనపల్లి వద్ద నీటి పారుదల చెరువులో చెత్త వేస్తున్నారు. స్థానిక సివిల్ కోర్టు దీనిని తప్పు పట్టి చెత్త వేయకుండా తరలించాలంటూ ఆదేశించింది. మునిసిపాలిటీకి వేరే గత్యంతరం లేకపోవడంతో అక్కడే చెత్త వేస్తున్నారు. నరసాపురంలో ఇటీవల చెత్త సమస్యపై స్థానికులు పెద్ద యుద్ధం చేయడంతో చెత్తను గుంటూరు తరలించాల్సి వస్తోంది. పాలకొల్లులో మునిసిపల్ రిజర్వ్‌డ్ స్థలాల్లోనే చెత్త గట్టలుగా వేస్తున్నారు. తణుకులో 6 ఎకరాల స్థలంలో చెత్త వేసి ఎరువును తయారు చేస్తున్నారు. జిల్లాలో తణకులో మినహా మిగిలిన చోట్ల చెత్త పెద్ద సమస్యగా మారింది. ప్రతిరోజు టన్నుల కొద్దీ చెత్తను ఎక్కడ వేయాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కంపోస్ట్ యార్డులు ఏర్పాటుతో తడి చెత్తతో వర్మి కంపోస్ట్ తయారుచేసి పొడి చెత్తను ఇతర ప్రాంతాలకు తరలిస్తారు.
మునిఇపాలిటీల వారీగా చెత్త టన్నుల్లో.. నిధులు రూ.కోట్లల్లో..
భీమవరం 72 10
తాడేపల్లిగూడెం 80 10
తణుకు 50 5
పాలకొల్లు 42 5
నరసాపురం 32 4
ఆకివీడు 18 3
నరసాపురం నుంచి గుంటూరుకు చెత్త తరలింపు
నరసాపురం, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): చెత్త వేసేందుకు నరసాపురంలో ఖాళీ స్థలాలు లేవు. పేరుకుపోతున్న చెత్తను ఏం చేయాలో తెలియక అఽధికారులు నానా అవస్థలు పడ్డారు. చివరికి గుంటూరులో జిందాల్ పవర్ ప్లాంట్‌కు తరలి స్తున్నారు. రోజుకు లక్షల రూపాయల ఖర్చవుతోం ది. ఇప్పటివరకు 50లారీల చెత్త తరలించారు. ఒక్కొక్క లారీకి లోడ్‌ను బట్టి రూ.20వేల నుంచి రూ 25వేల వరకు వెచ్చిస్తున్నారు.
31 వార్డులు కలిగిన పురపాలకం సంఘంలో రోజుకు 30 టన్నుల చెత్త వస్తుంది. గోదావరి ఒడ్డున చెత్త వేయడం గ్రీన్‌ట్రిబ్యునల్ అభ్యంతరం తెలిపింది. పురపాలక సంఘానికి సంబంధించి స్థలాల్లో చెత్త తరలింపు ప్రయత్నాలను స్థానికులు అడ్డగించారు. మండలంలోని మండవారి గరువులో ఖాళీ స్థలంలో వేసేందుకు ప్రయత్నించినా తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దీనితో పట్టణంలో పది రోజుల పాటు చెత్తను తొలగించలేదు. మరికొద్ది రోజులు ఇలాగే సాగితే అంటు రోగాలు ప్రబలుతాయని ఆందోళన వ్యక్తం కావడంతో చేసేది లేక గుంటూరు తరలించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి రోజు వస్తున్న చెత్తను సేకరించి ఒక స్థలంలో డంప్ చేసి అక్కడి నుంచి లారీలో గుంటూరుకు తరలిస్తున్నారు. ఒక్కొక్క టిప్పర్‌లో 6 నుంచి 9 టన్నులను లోడ్ చేసి పంపుతున్నారు. ఇలా చెత్తను ఎంతకాలం గుంటూరుకు తరలిస్తారనేది చర్చనీయాంశమైంది.