రేపు శ్రీవారి గిరి ప్రదక్షిణ
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:18 AM
శ్రీవారి గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధమైంది. ఏర్పాట్లు యుద్ధ్దప్రాతిపదికన చేయడంతో పనులు దాదాపు పూర్తయ్యాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినం ముందురోజున గిరిప్రదక్షిణ చేయడం ఇక్కడ సంప్రదాయబద్దమైంది.
30న క్షేత్రంలో ఉత్తర ద్వారదర్శనం.. స్థానికులు గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి
ద్వారకాతిరుమల, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): శ్రీవారి గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధమైంది. ఏర్పాట్లు యుద్ధ్దప్రాతిపదికన చేయడంతో పనులు దాదాపు పూర్తయ్యాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినం ముందురోజున గిరిప్రదక్షిణ చేయడం ఇక్కడ సంప్రదాయబద్దమైంది. ఈక్రమంలో ఇప్పటికే ఆ మార్గాన్ని సిబ్బంది శుభ్రం చేశారు. ముళ్లపొదలు వంటివి తొలగించి బుల్‌డోజర్లతో దారిని బాగుచేశారు. స్థానిక శ్రీవారి పాదుకామండపం వద్ద నుంచి సోమవారం మధ్యాహ్నం 2–30 గంటలకు ఈయాత్ర ఎంతో అట్టహాసంగా ప్రారంభమవుతుంది. సుమారు ఆరు కిలోమీటర్ల మేర గజ, అశ్వ, భజన మండళ్లు, కోలాటాలు, గోవింద దీక్షాధారుల స్వామి నామస్మరణలతో ఈ యాత్ర ను వైభవోపేతంగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈక్రమంలో గిరిప్రదక్షిణ మార్గం ప్రారంభానికి రెండు గంటల ముందు ఎండుగడ్డిని ఒకపొరగా పరిచి నీటితో తడుపనున్నట్లు అధికారులు తెలిపారు. పాదయాత్రగా వెళ్లే భక్తులకు మార్గమధ్యలో నాలుగు చోట్ల మంచినీరు, ప్రసాదం, ఇతర స్నాక్స్ వంటివి ఇచ్చేలా చర్యలు చేపట్టారు. ఆరు కిలోమీటర్లలో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆలయంలో ఈనెల 30న జరిగే ముక్కోటి పర్వదిన వేడుకలకు సిద్ధమౌతోంది. ముఖ్యంగా ఆరోజు శ్రీవారిని ఉత్తరద్వారం గుండా వీక్షించే క్రమంలో ఇప్పటికే ఉత్తరద్వారాలను సిద్ధం చేశారు. ఆలయగోపురాలు విద్యుత్ దీపతోరణాలు, రంగులతో ముస్తాబు చేస్తున్నారు. ఆరోజు శ్రీవారు వెండిగరుడ, శేషవాహనాలపై కొలువై భక్తులకు దర్శనమీయనున్నారు. ఈక్రమంలో వాహనాలను సిబ్బంది ముస్తాబుచేస్తున్నారు. అలాగే శ్రీనివాసుని దీక్షను చేపట్టి ముక్కోటినాడు దీక్షను విరమించి ఇరుముడులు సమర్పించే భక్తులకు ప్రత్యేక క్యూలైను, అలాగే వారు ఇరుముడులు ఇతర ద్రవ్యాలు సమర్పించేందుకు గాను యజ్ఞకుండాన్ని నిర్మించి అలంకరించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న మండపాలకు సిబ్బంది రంగులు వేస్తున్నారు. అలాగే విద్యుత్ తోరణాలతో అలంకరిస్తున్నారు.
విస్తృత ఏర్పాట్లు చేశాం
ఆరోజు ఉదయం 4–30 గంటల నుంచి ప్రొటోకాల్, సర్వదర్శనం, రూ.100, 200, 500 టికెట్లు ఏర్పాటు చేస్తున్నామని ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి తెలిపారు. రూ.500లకు స్లాట్స్ సిస్టమ్ ఏర్పాటు చేశామన్నారు. గోవిందస్వాములకు, స్థానికులకు ఒక ప్రత్యేక లైన్ ఏర్పాటు చేస్తాం. ఈ ఏడాది రూ.500 దర్శనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నవారికి గంటలోపు దర్శనం అవుతుందన్నారు. చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్స్, అలాగే పెద్దసంఖ్యలో రానున్న భక్తులకు సౌకర్యం కల్పించడంలో భాగంగా రోజూ కంటే కాస్త ముందు నుంచి అన్నప్రసాదానికి అనుమతి ఉంటుందన్నారు. మధ్యాహ్నం స్వామివారికి నివేదన సమయంలో దర్శనానికి క్యూలైన్లలో వేచిఉన్న భక్తులకు అవసరం మేరకు అన్నీ ఏర్పాట్లు చేస్తామన్నారు.