Share News

ఉంగుటూరు విద్యార్థికి మంత్రి పదవి !

ABN , Publish Date - Nov 26 , 2025 | 12:19 AM

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పూర్తిగా విద్యార్థులతో రాష్ట్ర విద్యాశాఖ అమరావతి శాసనసభ మీటింగ్‌ హాలులో బుధవారం స్టూడెంట్‌ మాక్‌ అసెంబ్లీ నిర్వహిస్తున్నారు.

ఉంగుటూరు విద్యార్థికి మంత్రి పదవి !

నేడు విద్యార్థులతో అమరావతిలో మాక్‌ అసెంబ్లీ

జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా ఏడుగురు విద్యార్థులు

స్టూడెంట్‌ అసెంబ్లీ సమావేశాలకు అధికారులకు ఆహ్వానం

ఏలూరు అర్బన్‌, నవంబరు 25(ఆంధ్రజ్యోతి):రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పూర్తిగా విద్యార్థులతో రాష్ట్ర విద్యాశాఖ అమరావతి శాసనసభ మీటింగ్‌ హాలులో బుధవారం స్టూడెంట్‌ మాక్‌ అసెంబ్లీ నిర్వహిస్తున్నారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడుగురు బాల ఎమ్మెల్యేల నుంచి ఒకరిని మంత్రిగా ఎంపిక చేశారు. ఉంగుటూరు మండలం పెదనిండ్రకొలను జడ్పీ హైస్కూలు 9వ తరగతి విద్యార్థి జీజీఎన్‌ఎస్‌.ప్రసాద్‌ మాక్‌ అసెంబ్లీలో మంత్రి గా వ్యవహరిస్తారు. మాక్‌ అసెంబ్లీకి జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ముగ్గురు చొప్పున విద్యార్థులు మొత్తం 21మందిని తొలుత ఎంపిక చేశారు. ఆయా సామాజికవర్గాల వారీగా సమతూకం పాటిస్తూ నియోజకవ ర్గానికి ఒకరు చొప్పున బాల ఎమ్మెల్యే పదవులకు గుర్తించారు. జిల్లా నుంచి మొత్తం ఏడుగురు విద్యార్థులను మాక్‌ అసెంబ్లీకి ఎంపికచేశారు.

బాల ఎమ్మెల్యేలు వీరే..

దెందులూరు నియోజకవర్గం నుంచి దెందులూరు జడ్పీ హైస్కూలు 8వ తరగతి విద్యార్థి సలాది మణికంఠ, ఏలూరు నుంచి సుబ్బమ్మదేవి మునిసిపల్‌ హైస్కూలు 10వ తరగతి విద్యార్థిని గంధం లిఖిత, పోలవరం నియోజకవర్గం నుంచి అప్పలరాజుగూడెం ఏపీ రెసిడెన్షియల్‌ స్కూలు 9వ తరగతి విద్యార్థి కె.నిఖిల్‌సాయి, చింతలపూడి నియోజకవర్గం నుంచి రంగాపురం జడ్పీ హైస్కూలు 10వ తరగతి విద్యార్థిని కె.వంశిక, నూజివీడు నియోజకవర్గం నుంచి గోపవరం జడ్పీ హైస్కూలు 10వ తరగతి విద్యార్థి బి.గోపి నాగచైతన్య, కైకలూరు నియోజకవర్గం నుంచి లింగాల జడ్పీ హైస్కూలు 9వ తరగతి విద్యార్థి బి.ఆస్మితసాయి ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తారు.

13 మందికి సత్కారం

తొలుత ఎంపికైన జాబితాలో మిగిలిన 14 మంది నుంచి దెందులూరు నియోజవర్గానికి చెందిన ఒక విద్యార్థిని అసెంబ్లీ మార్షల్‌గా వ్యవహరించేందుకు ఎంపిక చేశారు. మిగిలిన 13 మంది విద్యార్థులను బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో కలెక్టర్‌ వెట్రిసెల్వి సన్మానిస్తారు. వారికి రాష్ట్ర విద్యాశాఖ పంపిన పతకం, సర్టిఫికెట్లను బహుకరిస్తారు. సంబంధిత విద్యార్థులందరూ కలెక్టరేట్‌లో నిర్వహించే కార్యక్రమానికి బాలురు తెల్లచొక్కా, ఫ్యాంటు, బాలికలు చీరలు ధరించి రావాలని సమగ్రశిక్ష జిల్లా అధికా రులు సూచించారు. అమరావతిలో జరిగే మాక్‌ అసెంబ్లీ కార్యక్రమాన్ని ప్రత్య క్షంగా వీక్షించేందుకు రావాల్సిందిగా జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, కలెక్టర్లకు సమగ్రశిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి ఆహ్వానం పంపారు. మరోవైపు భారత రాజ్యాంగ ప్రవేశికను అన్ని పాఠశాలల్లో పేరెంట్స్‌, టీచర్స్‌ సమక్షంలో బుధవారం ఉదయం 11 గంటలకు చదవాలని అధికారులు కోరారు.

Updated Date - Nov 26 , 2025 | 12:19 AM