Share News

నేడు పల్స్‌ పోలియో

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:48 AM

ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కల మందును ఆదివారం జిల్లావ్యాప్తంగా వేయడానికి వైద్యఆరోగ్యశాఖ ఏర్పాట్లను పూర్తిచేసింది.

నేడు పల్స్‌ పోలియో

ఏలూరు అర్బన్‌, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కల మందును ఆదివారం జిల్లావ్యాప్తంగా వేయడానికి వైద్యఆరోగ్యశాఖ ఏర్పాట్లను పూర్తిచేసింది. తొలి రోజునే రెండు లక్షలమంది పిల్లలకు వ్యాక్సిన్‌ వేయడానికి జిల్లాలో ఏర్పాటు చేసిన 1709 బూత్‌లకు మొత్తం 2,44,040 డోసుల చుక్కల మందును పంపించింది. హైరిస్క్‌ ఏరియాలుగా గుర్తించిన 350 ప్రాంతాల్లోని చేపల చెర్వులు, సంచారజాతులు నివాసం ఉండే ప్రాంతాలు, మురికివాడలను గుర్తించి, వీటిలో నూరుశాతం వ్యాక్సినేషన్‌ అందేలా ప్రత్యేక బృందాలను నియ మించింది. వ్యాక్సిన్‌ పంపిణీ నిమిత్తం ప్రతీ బూత్‌కు ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీ, ఎంపీహెచ్‌ఏ, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్త, నర్సింగ్‌ విద్యార్థినుల తో కూడిన బృందం ఉంటుంది. ఓవైపు ఆది వారం అన్ని ప్రాంతాల్లో పోలియో చుక్కల మందు పంపిణీ చేస్తూనే, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల లో ప్రయాణికుల పిల్లలకు వ్యాక్సిన్‌ అందేలా 46 ట్రాన్సిట్‌ టీమ్‌లను ఏర్పాటు చేసినట్టు డీఎం హెచ్‌వో డాక్టర్‌ పీజే అమృతం తెలిపారు. మరో వైపు జిల్లాలోని 145 పట్టణ ప్రాంతాలు, 335 ఏజెన్సీ మూరుమూల గ్రామాలు, 448 గ్రామీణ ప్రాంతాల్లో చుక్కలమందు పంపిణీ చేస్తారు. వ్యాక్సినేషన్‌ను పరిశీలించేందుకు గుంటూరు జిల్లా నల్లపాడు ఆర్టీసీ రీజినల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మాలినిని ప్రభుత్వం నియమిం చింది. కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆదివారం ఉదయం ఏలూరు ఎన్‌ఆర్‌ పేటలోని ఆంజనేయ స్వామి గుడివద్ద ఏర్పాటు చేసిన పోలియో వ్యాక్సినేషన్‌ బూత్‌లో చిన్నారులకు చుక్కల మందు వేస్తారు. కాగా పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలంటూ శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ అధికారులు, సిబ్బంది డీఎంహెచ్‌వో నేతృత్వంలో స్థానిక పాండురంగా పురం ప్రాంతంలో ర్యాలీ, పాతబస్టాండ్‌లో మాన వహారం ప్రదర్శన జరిపారు. ఆదివారం చుక్కల మందు వేయించుకోని పిల్లలను గుర్తించి, ఇంటి వద్దే వారికి వ్యాక్సిన్‌ వేసేందుకు సోమ, మంగళ వారాల్లో ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించనున్నారు.

Updated Date - Dec 21 , 2025 | 12:48 AM