Share News

నేడే నీట్‌–యూజీ

ABN , Publish Date - May 04 , 2025 | 12:03 AM

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం నీట్‌ యుజీ – 2025 పరీక్ష జరగనుంది. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

నేడే నీట్‌–యూజీ
ఏలూరులో పరీక్ష కేంద్రం వద్ద మాట్లాడుతున్న ఏలూరు జిల్లా ఎస్పీ కిశోర్‌

ఏలూరు జిల్లాలో ఐదు, తాడేపల్లిగూడెంలో నాలుగు పరీక్ష కేంద్రాలు

మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు

పటిష్ట బందోబస్తు.. ఏర్పాట్లు పూర్తి

ఏలూరు క్రైం/భీమవరం రూరల్‌/భీమవరంక్రైం/ తాడేపల్లిగూడెం రూరల్‌/దెందులూరు, మే 3 (ఆంధ్ర జ్యోతి) : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం నీట్‌ యుజీ – 2025 పరీక్ష జరగనుంది. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. ఏలూరు జిల్లా పోలీస్‌ శాఖ పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టిందని ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ స్పష్టం చేశారు. నగరంలో ఐదు పరీక్ష కేంద్రాల్లో పరీక్షను నిర్వహిం చనున్నారు. ఏలూరు ఆర్డీవో అచ్యుత్‌ అంబరీష్‌, జిల్లా అదనపు ఎస్పీ ఎన్‌.సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌, ఏలూరు తహసీల్దార్‌ ఎన్‌. శేషగిరి రావుతో కలిసి ఎస్పీ పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. దెందులూరు మండలం గోపన్నపాలెంలో ఉన్న కేంద్రీయ విద్యాలయలో 240 మంది, ఏలూరు కోటదిబ్బ వద్ద వున్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో 240 మంది, ఏలూరు కోటదిబ్బ కస్తూరిభా మునిసి పల్‌ కార్పొరేషన్‌ బాలికల ఉన్నత పాఠశాలలో 360 మంది, ఏలూరు రామచంద్ర రావుపేటలోని శ్రీమతి ఈదర సుబ్బమ్మదేవి మునిసిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్లో 240 మంది, దెందులూరు మండలం గోపన్నపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 140 మంది అభ్యర్థులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఏలూరు వన్‌టౌన్‌ సీఐ జి సత్యనారాయణ, ఏలూరు టూటౌన్‌ సీఐ అశోక్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు పరీక్షాకేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లిగూడెంలోని నిట్‌ కళాశాలలో రెండు పరీక్షా కేంద్రాలు, శశి ఇంజనీరింగ్‌ కళాశాలలో రెండు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. నిట్‌లో మొదటి పరీక్ష కేంద్రంలో 480 మంది, మరో కేంద్రంలో 600 మంది, శశి ఇంజనీరింగ్‌ కళాశాలలో మొదటి కేంద్రంలో 480 మంది, మరో కేంద్రంలో 300 మంది పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా నోడల్‌ అధికారి జయరాం తెలిపారు. తాడేపల్లిగూడెంలోని నిట్‌, శశి ఇంజనీరింగ్‌ కళాశాలను జిల్లా అడిషనల్‌ ఎస్పీ భీమారావు, డీఎస్పీ విశ్వనాథ్‌ పరిశీలించారు. అక్కడ ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. తాడేపల్లిగూడెం పట్టణ సీఐ ఎ.సుబ్రహ్మణ్యం, తహసీల్దార్‌ ఎం.సునీల్‌కుమార్‌, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2025 | 12:03 AM