బాబుపైనే ఆశలన్నీ !
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:56 AM
గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్ర బాబు నాయుడు నూజివీడు నియోజకవర్గంలో రెండు సార్లు పర్యటించారు.

నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు రాక
వడ్లమానులో కులవృత్తిదారులతో ముఖాముఖి
ఆగిరిపల్లి హైస్కూల్‌లో పీ–4 బహిరంగ సభ
ముందుకు కదలని చింతలపూడి ఎత్తిపోతలు
రైతులకు అందని మామిడి పరిశోధన ఫలాలు
అభివృద్ధికి నోచుకోని నూజివీడు పట్టణం
నూజివీడు– విజయవాడ రోడ్డులో కష్టాలు
జిల్లా మార్పు కోసం నూజివీడు నియోజకవర్గ వాసుల విజ్ఞప్తి
ఏలూరు/నూజివీడు/ టౌన్/ ఆగిరిపల్లి, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి) : గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్ర బాబు నాయుడు నూజివీడు నియోజకవర్గంలో రెండు సార్లు పర్యటించారు. చింతలపూడి ఎత్తిపోతల పఽథకం పూర్తి, మామిడి పరిశోధన కేంద్రం సలహాలతో రైతుల వెతలు తీర్చుతామని హామీలిచ్చారు. అయితే అవి కార్య రూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నూజివీడు నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించనున్న నేపథ్యంలో హామీలపై వరాల జల్లు కురిపిస్తారన్న ఆకాంక్షను నియోజకవర్గ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
చింతలపూడిపై రైతుల ఆశలు
ఉమ్మడి కృష్ణాజిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధి లోని దాదాపు ఆరు నియోజకవర్గాల్లో ఎన్‌ఎస్‌పి ఆయకట్టు స్థిరీకరణ చేస్తూ ఐదు లక్షల ఎకరాల మెట్ట భూములకు గోదావరి జలాలను అందించే లక్ష్యంతో చేపట్టిన చింతల పూడి ఎత్తిపోతల పథకం గత ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్య ధోర ణితో సందిగ్ధంలో పడింది. ఈ పథకం ద్వారా దాదాపు వందల గ్రామాలకు తాగునీటి సమస్య తీరడంతో పాటు సాగునీరు అందుతుంది. గత ఎన్నికల్లో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రఽథమ ప్రాధాన్యతగా తీసుకొని పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర గృహ నిర్మాణ పౌరసంబంధాల శాఖామంత్రి కొలుసు పార్ధసారథి హామీ ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో రూ.4,900 కోట్లతో పనులు చేపట్టగా ఫేజ్–1 2008లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. ఫేజ్–2కు 2017లో చంద్రబాబు విస్సన్నపేట వద్ద మొద్దులపర్వలో శంకుస్థాపన చేశారు. ఈ పథకానికి పర్యావరణ అనుమతులు లేవని 2018లో ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే వట్టి వసంతకుమార్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ నిర్వహించిన ట్రిబ్యునల్ 2022లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.73 కోట్లు జరిమానా విధించింది. దీనిపై గత ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. మూడు నెలల్లో జరిమానా చెల్లించడం లేదా పర్యావరణ అనుమతులు తీసుకోవాలని గత వైసీపీ ప్రభు త్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోక పోవడంతో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాకా కూడా ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. ఇప్పటివరకు వివిధ కోర్టులలో ఈ పథకంపై ఇరవై కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల బడ్జెట్‌లో చింతలపూడి పథకానికి రూ.40 కోట్లే చూపారు. ఈ పథకం వల్ల ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలోని 2లక్షల 25వేల ఎకరాల భూమి సస్యశ్యామలం అవుతుంది. ప్రధానంగా ఆరు నియోజకవర్గాలైన నందిగామ, తిరువూరు, నూజివీడు, మైలవరం, గన్నవరం, దెందులూరు పార్టు సాగునీరు, తాగునీరు అవసరాలు తీరతాయి. ప్రతీ ఏటా సాగునీటి కష్టాలతో రైతులు అగచాట్లు పడుతున్నారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ సహకారంతో చింతలపూడి ఎత్తిపోతలను గాడిలోని పెట్టి మెట్ట ప్రాంత భూములను సస్యశ్యామలం చేసేందుకు సీఎం చంద్రబాబు చర్యలు చేపడతారనే ఆశాభావాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.
మామిడి పరిశోధన ఫలాలు ఎన్నడో..
మామిడి రైతులకు గిట్టుబాటు ధరల్లేక, వివిధ తెగుళ్లతో దిగుబడులు తగ్గి పెట్టుబడులు కూడా రావడం లేదు. నారా లోకేశ్ యువగళంలో నూజివీడు మామిడి రైతులతో సమావేశంపై పంజాబ్ తరహాలో మ్యాంగో బోర్డు ఏర్పాటుకు పరిశీలన చేస్తానని హామీ ఇచ్చారు. మామిడి పరిశోధనా కేంద్రం ఫలాలు రైతులకు పూర్తిగా చేరడం లేదు. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నూజివీడు చుట్టు పక్కల ప్రజలకు చెప్పుకోదగ్గ పరిశ్రమల్లేవు. మామిడి ఆధారిత ఉత్పత్తి పరిశ్రమలకు నడుం బిగిస్తే స్థానికంగానే ఉపాధి మార్గాలు లభ్యమవుతాయి. నూజివీడు రసాలంటే రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ స్థాయిలో పేరుంది. దీనికో బ్రాండ్ ఉత్పత్తుల కింద మామిడి ఆధారిత పరిశ్రమలకు మీరే శ్రీకారం చుట్టాలి.
నూజివీడు అభివృద్ధి అంతంతే..
రాష్ట్రంలోనే పురాతన పురపాలక సంఘాల్లో నూజివీడుకు పేరుంది.1983 నుంచి పంచాయతీ నుంచి మున్సిపాల్టీకి అటు తర్వాత గ్రేడ్–1 పురపాలక సంఘంగా గ్రేడ్ పెరిగినా అభివృద్ధిలో ఇంకా వెనుకంజలోనే ఉంది. ఇక్కడ పారిశుధ్యం, డ్రెయినేజీ, సరైన రోడ్లు, పార్కులు లేక లక్ష మంది ప్రజలు సతమతం అవుతున్నారు. పంచాయతీలో ఉన్నట్లే పారిశుధ్య సిబ్బంది టౌన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
టిడ్కో ఇళ్ల గతి మారేనా..
నూజివీడులో 2,640 టిడ్కో ఇళ్లను 90 శాతం గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశారు. మిగిలిన 10 శాతం పూర్తి చేసి పేదలకు ఇవ్వకుండా వాటిని వైసీపీ పాలకులు పాడుపెట్టారు. డ్రెయిన్లు ఏర్పాట్లు, ఇళ్లలో టైల్స్, టాయిలెట్లు ఏర్పాటు చేస్తే పేదలకు అందుబాటులోకి వస్తాయి.
నాలుగు లైన్ల రోడ్డు.. ఇండోర్ స్టేడియం
నూజివీడు– విజయవాడ డబుల్ లైన్ మార్గంలో అష్ట కష్టాలు పడుతూ ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. పెరిగిన జనాభా, ఇతర అవసరాలు, రవాణా కోసం దీనిని నాలుగు లైన్ల రహదారిగా పునర్ నిర్మించాలి. ఆగిరిపల్లి మీదుగా గన్నవరం ఎయిర్ పోర్టు రహదారి ఫోర్ లైన్ చేయాల్సి ఉంది. తాత్కాలికంగా పనులు చేస్తున్నారు. పదేళ్ల క్రితం ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు నిధులతో టౌన్‌లో చేపట్టిన ఇండోర్ స్టేడియం పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. రూ.కోటి వ్యయం చేస్తే బాస్కెట్‌బాల్ క్రీడకు అనువుగా స్టేడియం రూపుదిద్దుకుంటుంది. దీనిని పూర్తి చేస్తే బాధ్యత నేనే తీసుకుంటానని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.
ఎన్టీఆర్ జిల్లాలో కలపండి..
అధికారంలోకి రాగానే నూజివీడు నియోజకవర్గాన్ని ప్రజల కోరిక మేరకు ఏలూరు జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతానని ఎన్నికలకు ముందు చంద్రబాబు నూజివీడు బహిరంగ సభలలో హామీ ఇచ్చారు. ప్రస్తుతం గ్రామీణ సమస్యల పరిష్కారంలో ఇటు ఏలూరు, అటు కృష్ణా జిల్లా పరిషత్‌లను సమన్వయం చేసుకోవాల్సి రావడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని నియోజకవర్గ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
డ్రోన్ కెమెరాలతో పటిష్ఠ భద్రత : ఎస్పీ
సీఎం పర్యటనలో భద్రతాపరంగా ఎలాంటి తప్పిదాలు జరగకుండా డ్రోన్ కెమెరాల ద్వారా పటిష్ఠ చర్యలు తీసుకో వాలని జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ పోలీస్ సిబ్బందికి సూచించారు. సీఎం చంద్రబాబు శుక్రవారం ఆగిరిపల్లిలో పర్యటించనున్న నేపథ్యంలో గురువారం ఆయన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్, జనసమ్మేళన నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాల న్నారు. సీఎం పర్యటనకు ముగ్గురు అదనపు ఎస్పీలు, 13 మంది డీఎస్పీలు, 33 మంది సీఐలు, 72 మంది ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, 117 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 375 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 60 మంది మహిళా పోలీసులు, 208 మంది హోంగార్డులు, 897 మంది రోప్ పార్టీ, నాలుగు క్విక్ రియాక్షన్ టీమ్‌లను వినియోగిస్తున్నట్టు తెలిపారు.
సీఎం టూర్ షెడ్యూల్
ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10 గంటలకు బయల్దేరి ఆగిరిపల్లి మండలం వడ్లమాను వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు 10.10 గంటలకు చేరుకుంటారు. అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు సీఎంకు స్వాగతం పలకనున్నారు.
10.20 గంటలకు రోడ్డుమార్గాన బయల్దేరి వడ్లమాను శివారులో బీసీ వర్గాలతో 11:20 గంటల వరకు నిర్వహించే ముఖాముఖిలో పాల్గొంటారు.
అక్కడ నుంచి ఆగిరిపల్లి హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన ప్రజావేదికకు 11.30 గంటలకు చేరుకుంటారు. పీ–4 బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు వడ్డమాను రోడ్డులో కార్యకర్తలతో సమావేశమవుతారు.
అనంతరం 2.35 గంటలకు వడ్లమాను హెలిప్యాడ్‌కు చేరుకుని కడప బయల్దేరి వెళ్లతారు.