టిడ్కో ఇళ్లకు కదలిక
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:12 AM
పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. టిడ్కో ఇళ్ల నిర్మాణాలను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించింది. కాంట్రాక్టర్లకు బిల్లుల విషయంలో భరోసా ఇవ్వడంతో భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాల్లోని ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. టిడ్కో ఇళ్ల నిర్మాణాలను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించింది. కాంట్రాక్టర్లకు బిల్లుల విషయంలో భరోసా ఇవ్వడంతో భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాల్లోని ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
మార్చి నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం
రూ.168.14 కోట్లు అవసరమని తేల్చిన అధికారులు
పాత బిల్లులపై సర్కార్ సానుకూలం.. పనులు మొదలు పెట్టిన కాంట్రాక్టర్లు
భీమవరం టౌన్, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాల్లో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్ల నిర్మాణం మార్చి నాటికి పూర్తి కావాలంటే రూ.168.14 కోట్లు అవసరం. ఇందులో ఇళ్ల నిర్మాణాలకు రూ.114.17 కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.49.46 కోట్లు, ఎస్‌టీపీల నిర్మాణానికి రూ.4.51 కోట్లు కావాలి. నిధులకు కొరత లేదని, కాంట్రాక్టర్లు పనులు చేస్తే బిల్లులు తయారుచేసి ప్రభుత్వానికి పంపిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ హామీ తో మూడుచోట్ల పనులు జరుగుతున్నాయి.
రూ.100 కోట్ల మాటేమిటి ?
గతంలో టిడ్కో ఇళ్లల్లో నాన్ టెండర్ పనులు చేయించారు. మూడుచోట్ల సుమారు రూ.90 నుంచి 100 కోట్ల వరకు గత ప్రభుత్వం చెల్లించాలి. నిధులు విడుదల చేయకపోవడంతో అప్పట్లో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం నాన్ టెండర్ల బిల్లుల చెల్లింపునకు సూత్రప్రాయంగా అంగీకరించడంతో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు.
భీమవరానికి రూ.55.34 కోట్లు
భీమవరంలో 8,352 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మూడేళ్ల క్రితం 1984 ఇళ్లు లబ్ధిదారులకు అందించారు. ఇప్పటికే 1248 ఇళ్లు పూర్తయి ఉన్నాయని, చిన్న చిన్న పనులు చేస్తే వినియోగంలోకి తీసుకురావచ్చు. ఇందులో 5,120 ఇళ్లకు పనులు చేపట్టారు. ఇందుకు రూ.55.34 కోట్లు అవసరం.
పాలకొల్లుకు 3,552 ఇళ్లు
పాలకొల్లులో 6,144 ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. ఇందులో 2,592 ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించారు. ఇంకా 3,552 నిర్మాణ పనులు చేపట్టారు. ఇందుకోసం రూ.35.09 కోట్లు అవసరం.
గూడేనికి రూ.23.71 కోట్లు..
తాడేపల్లిగూడెంలో 5,376 ఇళ్లకు 3,232 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించారు. ఇంకా 2,144 ఇళ్లు నిర్మించాల్సి వుండగా 960 ఇళ్లకు పనులు జరుగుతున్నాయి. ఇందుకు రూ.23.71 కోట్లు అవసరం.
మౌలిక సదుపాయాల కల్పనకు..
మూడు ప్రాంతాల్లోని టిడ్కో ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పనకు రూ.49.46 కోట్లు అవసరం. ప్రస్తుతం మూడు ప్రాంతాల్లోను కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు. రోడ్డు, డ్రెయినేజీ సౌకర్యం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రభుత్వం నిర్ధేశించిన సమయానికి పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. మూడుచోట్ల ఎస్‌టీపీల నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావడానికి రూ.4.51 కోట్లు అవసరం. వీటి నిర్మాణం పూర్తయితేనే టిడ్కో ఇళ్లల్లోని లబ్ధిదారులకు ఊరట కలుగుతుంది. ఇళ్లల్లోని మురుగు అంతా ఎస్‌టీపీల్లోకి వెళ్లే విధంగా డిజైన్ రూపొందించారు. అందుకే వీటి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.
ఫ్లాట్ లేదు.. డబ్బులు ఇవ్వలే..
తాడేపల్లిగూడెం రూరల్, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెంకు చెందిన కోట సరోజిని 2017లో టీడీపీ హయాంలో టిడ్ కో ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. డబుల్ బెడ్ రూం ఇంటికి లబ్ధిదారు వాటాగా లక్ష రూపాయలు డిపాజిట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఫ్లాట్స్ కేటాయింపు ఆలస్యం కావడంతో ఆమె వయసు 60 ఏళ్లు దాటింది. ఇక ఫ్లాట్ రాదని అధికారులు చెప్పారు. అయితే తాను కట్టిన సొమ్ములు తమకు తిరిగి ఇవ్వాలని 2021లో మున్సిపల్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నా ఆ సొమ్ము నేటికి రాలేదు. ఫ్లాట్ ఇవ్వలేదు. ఈ పరిస్థితి ఒక్క సరోజినికే కాదు. తాడేపల్లిగూడెంలో 70 మంది, భీమవరంలో 300 మంది లబ్ధిదారులదీ ఇదే పరిస్థితి. పాలకొల్లులోను ఈ విధంగా టిడ్ కో బాధితులు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంటి కోసం తమ వాటాగా అప్పులు చేసి ప్రభుత్వానికి డబ్బులు చెల్లించారు. ఇలా కట్టి దశాబ్దం గడిచింది. అప్పటి నుంచి చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే ఉన్నారు. ఒక పక్క వయస్సు ఎక్కువైందని, మరోపక్క బ్యాంకు రుణాలు అందడం లేదనే కారణంగా ఫ్లాట్స్ ఇవ్వలేమని అధికారులు తేల్చి చెబుతుండటంతో ఏం చేయాలో పాలుపోక లబ్ధిదారులు ఆందోళనలు చేస్తున్నారు.