Share News

ఇదొక్కటే అడ్డంకి

ABN , Publish Date - May 16 , 2025 | 12:39 AM

ప్రధానమంత్రి ఆవాస యోజనలో కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసిన ఏపీ టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందజే యడానికి దాదాపు సిద్ధంగానే ఉన్నాయి. కాని, సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లు అందుబాటులోకి రాకపోవడంతో వీటిని లబ్ధిదారులకు అందజేయలేక అధికారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

ఇదొక్కటే అడ్డంకి
భీమవరంలో ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌

గృహ ప్రవేశాలకు అడుగుదూరంలో..

టిడ్కో ఇళ్లు సిద్ధమైనా.. వసతులే శూన్యం

నిలిచిన ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ పనులు

బిల్లుల మంజూరులో జాప్యం..

చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు

భీమవరం, తాడేపల్లిగూడెంలోనే ఇబ్బంది

పాలకొల్లులో జూన్‌లో కేటాయింపు

బిల్లుల కోసం అధికారుల కసరత్తు

(భీమవరం–ఆంధ్రజ్యోతి):

ప్రధానమంత్రి ఆవాస యోజనలో కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసిన ఏపీ టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందజే యడానికి దాదాపు సిద్ధంగానే ఉన్నాయి. కాని, సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లు అందుబాటులోకి రాకపోవడంతో వీటిని లబ్ధిదారులకు అందజేయలేక అధికారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. భీమవరం, తాడేపల్లిగూడెం, పాల కొల్లులో చేపట్టిన తొలి విడత టిడ్కో ఇళ్లు చాలా వరకు అందుబాటులోకి వచ్చాయి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణాలపై దృష్టి పెట్టింది. పాలకొల్లులో వచ్చే నెలలోనే వెయ్యి ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వాలని సంకల్పించారు. అక్కడ సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లో సిద్ధంగా ఉంది. దీంతో కొత్తగా తయారైన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించనున్నారు. అదే భీమవరం, తాడేపల్లిగూడెంలో ఇళ్లు సిద్ధంగా ఉన్నా సరే ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లు నిలిచిపోయాయి. రెండుచోట్ల రూ.22 కోట్లతో ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ల నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వంలోనే చర్యలు తీసుకున్నారు. ఏజెన్సీలను ఖరారు చేశారు. పనులు ప్రారంభం కాలేదన్న ఉద్దేశంతో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. కొత్తగా మళ్లీ ఏజెన్సీకి అప్పగించింది. పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేదు. దీంతో మధ్యలోనే పనులు నిలిపివేశారు. అదే ఇప్పుడు టిడ్కో ఇళ్లకు ప్రధాన సమస్యగా మారింది. సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ లేకపోవడంతో గతంలో ఇళ్లు పొందిన లబ్ధిదారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి బ్లాక్‌ వద్ద తాత్కాలికంగా సీవేజ్‌ ప్లాంట్‌లను ఏర్పాటుచేశారు. అవి త్వరితగతిన భర్తీ అయిపోతు న్నాయి. కొన్నిసార్లు పని చేయడం లేదు. ఇప్పటికే టిడ్కో ఇళ్లలో నివాసం ఉన్న వారంతా మరుగుదొడ్లు సక్రమంగా పనిచేయక ఇబ్బందులు పడే పరిస్థితులు ఉత్పన్న మవుతున్నాయి. మున్సిపాలిటీకి ఫిర్యాదు చేస్తే మరమ్మ తులు చేపడుతున్నారు. ఎస్‌టీపీలు అందుబాటులోకి వస్తేనే శాశ్వతంగా సమస్య పరిష్కారం అవుతుంది.

ఇప్పటికి ఇచ్చిన ఇళ్లు

జిల్లాలో తొలి విడతగా భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లులో టిడ్కో ఇళ్లు కేటాయించారు. భీమవరంలో 8,352, పాలకొల్లులో 6,784, తాడేపల్లిగూడెంలో 5,376 ఇళ్లకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. ఇప్పటి వరకు భీమవరంలో 1,948 ఇళ్లు మాత్రమే అప్పగించారు. తాడేపల్లిగూడెంలో 3,232, పాలకొల్లులో 2,592 ఇళ్లు అందజేశారు. ఎన్నికల ముందు హడావుడిగా వైసీపీ ప్రభుత్వం ఇంకొందరికి పట్టాలు ఇచ్చింది. ఇళ్లు పూర్తి కాకుండానే పట్టాలు ఇచ్చిన ఘనతను మూటగట్టు కుంది. వాటిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తిచే సింది. పాలకొల్లులో వెయ్యి ఇళ్లు ఇవ్వడానికి చర్యలు తీసుకున్నారు. జూన్‌లోనే వాటిని లబ్ధిదారులకు అంద జేస్తారు. కానీ భీమవరం, తాడేపల్లిగూడెంలో మరో 2,500 ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్‌టీపీ పూర్తి కాకపోవడంతో అప్పగించలేకపోతున్నారు. వీటిపై ప్రభుత్వం దృష్టి పెట్టారు.

బిల్లులు ఎప్పుడిస్తారో..

తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా బిల్లులు మంజూరు చేస్తూ వస్తున్నారు. గత బకాయిలను విడుదల చేస్తున్నారు. ఇప్పుడు సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ల వంతు వచ్చింది. లబ్ధిదారుల పేరుతో రుణాలు మంజూరుచేసిన నిధులను గత ప్రభుత్వం వినియోగించుకుంది. ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లకు బిల్లులు ఇవ్వలేదు. మున్సిపాలిటీ నుంచి మంచినీటి సౌకర్యాన్ని కల్పించలేదు. కేవలం ఇంటి రంగులను మార్చడానికి మాత్రమే గత వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. తక్షణం బిల్లులు మంజూరు చేస్తేనే పనులు చేపడతామంటూ కాంట్రాక్టర్లు చెప్పుకొస్తున్నారు. అప్పటి వరకు పనులు చేపట్టే అవకాశం లేదు. అధికారులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

Updated Date - May 16 , 2025 | 12:39 AM