ఏడాది గడువు
ABN , Publish Date - Aug 12 , 2025 | 11:49 PM
గత ప్రభుత్వ హయాంలో బిల్లులు మంజూరు చేయక పోవడంతో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ టిడ్కో ఇళ్లపై దృష్టి పెట్టారు.
ఈలోగా నిర్మాణం పూర్తి చేయాలని ఎల్‌అండ్‌టీకి ప్రభుత్వం ఆదేశం
బిల్లులు చెల్లిస్తామంటూ భరోసా..
రంగంలోకి దిగిన ఏజన్సీ
లబ్ధిదారులు రుణాలు చెల్లించడం లేదని బ్యాంకర్ల ఆందోళన
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
గత ప్రభుత్వ హయాంలో బిల్లులు మంజూరు చేయక పోవడంతో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ టిడ్కో ఇళ్లపై దృష్టి పెట్టారు. ఏడాదిలోగా పూర్తి చేసి ఇవ్వాలని ఎల్‌అండ్‌టీ సంస్థకు ప్రభుత్వం దిశా నిర్దేశం చేసింది. బిల్లుల మంజూరుపై భరోసా ఇచ్చింది. దీంతో పనులు పూర్తి చేయడానికి ఎల్‌అండ్‌టీ సంస్థ సిద్ధమైంది. భీమవ రం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాల్లో 11 వేల ఇళ్లను టిడ్కో మున్సిపాలిటీలకు అప్పగించింది. ఇంకా 8,600 ఇళ్లు పూర్తిచేయాలి. మౌలిక వసతులు కల్పించాలి. వీటి పను లు పూర్తి చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రికవరీపైనే మల్లగుల్లాలు
టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. జిల్లాలో 365, 430 చదరపు అడుగుల ఇళ్లకు బ్యాంకులు రుణాలు కల్పించాయి. ఒక్కో ఇంటిపై రూ.3.15 లక్షల రుణం ఇచ్చారు. వాయిదాల రూపంలో లబ్ధిదారులు తిరిగి బ్యాంకులకు చెల్లించాలి. జిల్లావ్యాప్తంగా 11,360 మంది లబ్ధిదారులకు రుణాలు అందించారు. జిల్లాలో రూ.335.80 కోట్లు మంజూరుచేశారు. రుణాలు ఇచ్చి రెండేళ్లు పూర్తి కావస్తోంది. బ్యాంకులు ఇచ్చిన గడువు ముగియడంతో వాయిదాలు చెల్లించాలని లబ్ధిదారులకు నోటీసులు ఇస్తు న్నారు. 20 శాతం మంది లబ్ధిదారులు మాత్రమే సక్రమం గా వాయిదాలు చెల్లిస్తున్నారు. 80 శాతం మంది చెల్లించ డం లేదు. ఇళ్లు కేటాయించకుండా వాయిదాలు ఎలా కడ తామంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి వారు దాదాపు ఆరు వేల మంది వరకు ఉంటారు. ఇళ్లు అప్పగించడంలో గత ప్రభుత్వం విఫలమైంది. నిర్మాణాలను గాలికి వది లేసింది. రుణాలపై వడ్డీలు చెల్లిస్తూ వస్తోంది. ఇళ్లు తీసు కున్న వారు వాటిలోకి వెళ్లడం లేదు. మౌలిక వసతులు లేవంటూ వెనుకంజ వేస్తున్నారు. వారు రుణాలు చెల్లించ డం లేదు. ఇలా జిల్లాలో రూ.260 కోట్లు పెండింగ్‌లో ఉన్న ట్టు బ్యాంకులు గుర్తించాయి. వాటి రికవరీకి మల్లగుల్లాలు పడుతున్నాయి. మున్సిపాలిటీ సిబ్బందిని నియమించినా ఫలితం లేకపోతోంది. ఇళ్ల నిర్మాణంతోపాటు, ఎస్‌టీపీ, డ్రైనే జీ వ్యవస్థ నిర్మాణం చేపట్టిన ప్పుడే లబ్ధిదారులకు న్యాయం చేసినట్టు అవుతుంది. రికవరీల కోసం చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వంపై వడ్డీ భారం తగ్గుతుంది.