సంక్రాంతికి టిడ్కో ఇళ్లు
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:04 AM
టిడ్‌కో ఇళ్ల్ల లబ్ధిదారులకు ఈ సంక్రాంతి కాంతులు నింపనున్నది. ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. ఈ సంక్రాంతికి లబ్ధిదారులకు ఇళ్లు అంది స్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది.
ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర
తాడేపల్లిగూడెంలో అందజేసేందుకు ప్రణాళిక
1,120 కుటుంబాలకు పండగ
టిడ్‌కో ఇళ్ల్ల లబ్ధిదారులకు ఈ సంక్రాంతి కాంతులు నింపనున్నది. ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. ఈ సంక్రాంతికి లబ్ధిదారులకు ఇళ్లు అంది స్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. సంక్రాంతి పండుగ సొంత ఇంటిలో చేసుకునే విధంగా అనుకున్న సమయంలో ఇళ్లు అందించేందుకు సిద్ధం చేస్తున్నారు.
తాడేపల్లిగూడెం రూరల్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి):జిల్లాలో తాడేపల్లి గూడెంలో ఉన్న టిడ్‌కో ఇళ్లను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు.ఒకేసారి 1,120 మందికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పనులన్నీ పూర్తిచేసి అందించాలని సంకల్పించారు. దీనికోసం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రత్యేక శ్రద్ధ తీసు కున్నారు. దీంతో ఈ సంక్రాంతికి ప్లాట్స్ అందుకునేందుకు ఇళ్ల లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
పగడ్బందీగా పనులు..
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు సొంత ఇళ్లు అందించేందుకు గూడెంలో నిర్మాణాలు చేపట్టి దాదాపు పూర్తిచేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధిదారులకు అందించ కుండా వదిలేసింది. ఎనిమిదేళ్ల పాటు పట్టించుకోకపోవడంతో అవి బూత్ బంగ్లాలుగా, చిట్టడవిలా తయారైంది. ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయడమే కాకుండా పైపులైన్‌లు, రన్నింగ్ వాటర్, ఫ్లాట్స్‌పై లీకేజీలు, ఇంటిలోపల వాటర్ లైన్, డోర్స్ వంటి అన్ని పనులు పూర్తి చేస్తున్నారు. దీని కోసం ఎల్‌అండ్‌టీ సంస్థ సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు.
తాడేపల్లిగూడెంలోనే..
ఈ సంక్రాంతికి టిడ్‌కో లబ్దిదారులకు ఫ్లాట్స్ అందించే కార్యక్రమం జిల్లాలో తాడేపల్లిగూడెంలోనే చేపడుతున్నారు. మిగిలినవి తరువాత సిద్ధం చేసేవిధంగా ప్లాన్ చేశారు. 300 స్కేర్ యార్డ్‌ల అపార్ట్ మెంట్‌లు 20, 365 స్కేర్ యార్డుల ఫ్లాట్స్ ఉన్న అపార్ట్ మెంట్‌లు 1, 440 స్కేర్ యార్డులు ఉన్న ఫ్లాట్స్ గల అపార్ట్ మెంట్‌లు 14 మొత్తం 35 అపార్ట్‌మెంట్‌లు సిద్ధం చేస్తున్నారు. ఒక్కొ అపార్ట్‌మెంట్‌కు 32 ప్లాట్స్ చొప్పున 1120 కుటుంబాలకు నూతన గృహయోగం కలగనుంది.