పక్కా ఇళ్లు.. పత్తా లేవు!
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:43 AM
ఒకటి, రెండు రోజులు కాదు.. ఎనిమిదేళ్ల నుంచి సొంతింటి కల సాకారమవుతుందని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.

టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అడుగడుగునా ఆటంకాలే
ఎనిమిదేళ్లుగా కొలిక్కిరాని నిర్మాణం
ముందస్తు చెల్లింపులు ఏమయ్యాయి
వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం
కూటమి సర్కార్‌పై ఆశలు
లబ్ధిదారుల జాబితాపై అనుమానాలు
నిర్మాణం పూర్తికాకున్నా బ్యాంకర్ల నుంచి సంక్షిప్త సందేశాలు
లబ్ధిదారుల్లో ఆగ్రహావేశాలు
టిడ్కో నో రియాక్షన్
ఒకటి, రెండు రోజులు కాదు.. ఎనిమిదేళ్ల నుంచి సొంతింటి కల సాకారమవుతుందని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. టిడ్కో గృహ సముదాయంలో ఫ్లాట్ కోసం కేటగిరీల వారీగా ముందస్తు సొమ్ము రూ.50 వేల నుంచి రూ. లక్ష చెల్లించారు. ఏళ్లు గడిచినా నిర్మాణాలు పూర్తి కాలేదు. ఇళ్ల నిర్మాణంలో కొన్ని తొలి దశకు చేరుకోగా, మరికొన్ని నిలిచిపోయాయి. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం నిర్మాణాలను ఒక కొలిక్కి తీసుకువస్తే.. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. లబ్ధిదారుల పేరిట రుణాలు ప్రభుత్వం తీసుకుంది. ఇళ్లు లేవు కానీ అప్పు కట్టాలని బ్యాంకర్ల నుంచి సంక్షిప్త సందేశాలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వంపై ఆసలు పెట్టుకున్న లబ్ధిదారులు టిడ్కో ఇళ్లు ఎప్పటికి పూర్తి చేస్తారు.. ఎప్పుడు ఇస్తారు.. అని ఎదురుచూస్తున్నారు. ఏళ్ల క్రితం కట్టిన సొమ్ము ఏమైందని, తర్వాత ప్రభుత్వం తీసుకున్న రుణ భారం ఎలా మోయాలని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
పట్టణ ప్రాంతాల్లో సాధారణ, మధ్యతరగతి కుటుంబాలు అద్దె ఇళ్లలో గడుపుతున్నాయి. వారికి సొంతిల్లు సమకూర్చేందుకు 2014–19 మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం టిడ్కో గృహ సముదాయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పట్టణ ప్రాంతాలన్నింటిలో మూడు కేటగిరీల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారు.
ఎ కేటగిరిలో 300 చదరపు అడుగుల ప్లాటుకు రూ.500, 400 చదరపు అడుగుల ప్లాటుకు రూ.50 వేలు, సీ కేటగిరిలో 430 చదరపు అడుగుల ప్లాటుకు రూ.లక్ష చొప్పున ముందస్తు సొమ్మును డీడీల రూపంలో వసూలు చేశారు. ఈ సొమ్మునంతా అప్పట్లో టిడ్కో ఖాతాలో ఐసీఐసీఐ బ్యాంకులో జమ చేశారు.
ఏలూరు నగరంలోనే దాదాపు 6,480 టిడ్కో గృహాలు ప్రతిపాదించగా వీటిలో 2,208 ఫ్లాట్లు మాత్రమే పూర్తి చేయగలిగారు. వీటి నిమిత్తం ఎనిమిదేళ్ల క్రితమే రూ.19 కోట్లు లబ్ధిదారులు ముందస్తుగా చెల్లించారు.
నూజివీడులో తొలుత 4 వేలకుపైగా టిడ్కో ఇళ్లు ప్రతిపాదించగా చివరికి 3,090 ఇళ్ల నిర్మాణం ఖరారు చేశారు. 2,790 ఫ్లాట్‌ల నిర్మాణం ఒక దశకు వచ్చింది. దాదాపు 3వేల మంది లబ్ధిదారులు రూ.16 కోట్లు చెల్లించారు.
జంగారెడ్డిగూడెంలో 864 టిడ్కో గృహాలకు 804 వివిధ దశల్లో ఉన్నాయి. దాదాపు రూ.6 కోట్లకుపైబడే చెల్లించారు.
టిడ్కో ఇళ్లలో గృహ ప్రవేశం ఎప్పుడు అనేదానిపై ఇంత వరకు స్పష్టత లేదు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసు కుని ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రయత్నిం చింది. లబ్దిదారులకు బ్యాంకు రుణాలు ఇచ్చేలా జాగ్రత్తపడింది. తర్వాత వైసీపీ అధికారంలోకి రావడం, కరోనా విస్తరించడంతో టిడ్కో ఇళ్ల నిర్మాణం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
జగన్ జమానాలో నిర్లక్ష్యం
పేద, మధ్యతరగతి వర్గాల సొంత ఇంటి కలను జగన్ ప్రభుత్వ ఐదేళ్లలో నాశనం చేసింది. పూర్తి కావచ్చిన నిర్మాణ పనులు పట్టించుకో లేదు. తర్వాత దెబ్బతింటున్న గోడలు, బాత్ రూమ్‌లు, పైపులైన్‌ల సంగతి గాలికొదిలేశారు. లబ్ధిదారులంతా వేలకు వేలు ముందస్తు చెల్లిం పులు చేశామని, కనీసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూపొందించిన లబ్ధిదారుల జాబితా లో తాము ఉన్నదీ లేనిదీ స్పష్టం చేయాలంటూ మునిసిపల్ కార్యాలయాల చుట్టూ తిరిగారు. అక్కడా సరైన సమాధానం లభించలేదు. టిడ్కో ఇళ్లను పర్యవేక్షిస్తున్న అధికారులు సైతం ప్రజలకు వివరణ ఇవ్వలేకపోయారు. ఏలూరు నగరం, మిగతా పట్టణాల్లో రూ.50 వేల నుంచి రూ. లక్ష చెల్లించిన లబ్ధిదారులంతా అప్పట్లో తమకు ఇచ్చిన అర్హత పత్రాలు భద్రంగా ఉంచుకున్నారు. 2022–23లో జగనన్న కాలనీల పేరిట అప్పటి జగన్ ప్రభుత్వం హడావుడి చేసింది. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులను అప్పట్లో వలంటీర్లు స్థానిక వైసీపీ నాయకత్వాల ఆదేశాల మేరకు ఏమార్చారు. టిడ్కో ఇళ్లు ఎప్పుడు వస్తాయో తెలియదు, వాటిపై ఆశ వదులుకోండి, జగనన్న కాలనీల్లో ఇల్లు కోసం సంతకాలు చేయండంటూ వాడవాడలా తిరిగారు. కొందరే మో ఇప్పుడు ఇంటి స్థలం కూడా తీసుకోకపోతే టిడ్కో ఇళ్ల సంగతి దేవుడెరుగు ఇది కూడా పోతుందని వలంటీర్లు చెప్పినట్టే చేశారు. ఇప్పుడు టిడ్కో లబ్దిదారులుగా చెప్పబడుతున్న వారిలో అనేక మందికి జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు, ఇళ్లు కూడా వచ్చాయి. కేవలం అప్పట్లో వలంటీర్ల హడావుడితో లబ్ధిదారులు భయపడి భంగపడ్డారు. ఇప్పటికీ టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో మార్పులు జరిగాయా అనేది సమా ధానం లేని ప్రశ్నగా మిగిలింది. లబ్దిదారులు చెల్లించిన ముందస్తు సొమ్ము సంగతి ఏమిటనేది అంతు బట్టడం లేదు. దీనికితోడు అధికార పార్టీ నేతలెవరూ వివరాలు వెల్లడించలేదు. విపక్షాలు మాత్రం పేదల పక్షాన నిలిచామంటూ హడా వుడి చేస్తారు. అధికార పార్టీలు టిడ్కో ఇళ్లను పూర్తి చేసి పేదలకు స్వాధీనం చేసే విషయంలో మీనమేషాలు లెక్కిస్తూనే వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మొదటి ఆరు నెల ల్లోనే టిడ్కో ఇళ్లలో గృహ ప్రవేశాలకు రంగం సిద్ధమైందంటూ ప్రచారం సాగినా ఇప్పుడు ఆ ఊసు ఎక్కడా వినిపించడంలేదు. వేల మంది లబ్ధిదారులు తమ పరిస్థితి ఏమిటో తేల్చాల్సిం దేనని గట్టిగా పట్టుబడుతున్నారు.
ఇళ్లు ఇవ్వలేదు.. అప్పు కట్టమంటున్నారు..!
టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల పక్షాన బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. లబ్ధిదారుకు రూ.3.5 లక్షల నుంచి రూ.6 లక్షల రుణం మంజూరు, నెలవారీ కిస్తీ చెల్లించేలా బ్యాంకర్లు ప్రణాళిక రూపొందించారు. దీనితో లబ్ధిదారుల సెల్ ఫోన్‌కు బ్యాంకుల నుంచి సంక్షిప్త సందేశాలు వస్తున్నాయి. మీ ఇంటి నిర్మాణ ఖాతాలో ఇంత చెల్లించాలి అనేదే సారాంశం. ఇంటి నిర్మాణమే పూర్తికాలేదు, బ్యాంకర్ల నుంచి ఇలాంటి సందే శాలు ఏమిటనేదే లబ్ధిదారుల ఆగ్రహం. బ్యాంకర్ల నుంచి కూడా పొంతనలేని సమాధా నాలు వస్తున్నాయని లబ్ధిదారుల ఆవేదన. పట్టణ ప్రాంతాల్లో వెలుగు గ్రూపుల్లో సభ్యులు గా ఉన్న వారికే అత్యధికంగా టిడ్కో ఇళ్లు కేటాయించారు. ఇప్పుడు ఆ వెలుగు గ్రూపులు కూడా ఎక్కడికక్కడ లబ్దిదారుల ఖాతాలను పునఃసమీక్షిస్తున్నాయి. అప్పట్లో మీరు కట్టింది ఎంత, ఇప్పటి వరకు ఈఎంఐ రూపంలో చెల్లించాల్సింది ఎంత అని ఆరా తీస్తున్నారు. నిర్మాణంలో బాధ్యత తీసుకోకుండా కేవలం ఇలాంటి పేను పెత్తనం చేయడం ఏమిటని లబ్ధిదారులు మండిపడుతున్నారు. వాస్తవానికి టిడ్కో అధికారులు ఇప్పటిదాకా లబ్ధిదారులకు స్పష్టమైన వివరణ ఇవ్వలేకపో యారు. నిర్మాణం విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, బ్యాంకుల్లో తీసుకున్న రుణాల చెల్లింపు పైన టిడ్కో ఇప్పటికే సైలెంట్. దీనిపైనే కూటమి ప్రభుత్వం సమీక్షించాల్సిన అవసరం కనిపిస్తోంది.