Share News

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

ABN , Publish Date - May 20 , 2025 | 12:49 AM

పెంటపాడు మండలాల్లో సోమవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా గణపవరం మండలంలో కాల్వలో పడి గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు.

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
ప్రమాద స్థలంలో సన్నిబాబు మృతదేహం

ఆచంట, పెంటపాడు మండలాల్లో సోమవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా గణపవరం మండలంలో కాల్వలో పడి గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. రెండు ప్రమాదాల్లో యువకులు ఇటీవల ఇంటర్‌ ఉత్తీర్ణులు కావడం యాధృచ్చికం. కోడేరు వద్ద జరిగిన ప్రమాదంలో యువకుడు చదువుకుంటూనే ఫొటో స్టూడియోలో పని చేస్తున్నారు. పెంటపాడు వద్ద మృతి చెందిన యువకుడు కంప్యూటర్‌ క్లాసులకు వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాడు.

ఆచంట, మే 19(ఆంధ్రజ్యోతి): మండలంలో కోడేరు వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పాలకొల్లుకు చెందిన గెడ్డం సన్నిబాబు (18) తన స్నేహితులతో కలిసి సోమవారం పెనుమంచిలి గ్రామంలో ఒక వివాహ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడి నుంచి కోడేరులో స్నేహితుడి ఇంటికి వెళ్లారు. కోడేరు నుంచి తిరిగి తన అమ్మమ్మ ఊరు పెనుగొండ మండలం దేవ శివారు తాళ్లపాలెం మోటారుసైకిల్‌ పై వెళుతున్నాడు. ఆచంట వైపు నుంచి కోడేరు వైపు వెళుతున్న భార్యతో కలసి వెళతున్న యన్నాబత్తుల సత్యనారాయణ మోటార్‌సైకిల్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో సన్నిబాబు అక్కడిక్కడే మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా గన్నవరం మండలం లంకల గన్నవరం శివారు నడిగడికి చెందిన యన్నా బత్తుల సత్యనారాయణ, అతడి భార్యకు తీవ్ర గాయాలు కావడంతో పాలకొల్లు ఆసుపత్రికి 108లో తరలించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ వెంకటరమణ సంఘటనను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవలే ఇంటర్‌ పాసయ్యాడు..

పెనుగొండ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న సన్నిబాబు ఇటీవల వచ్చిన ఫలితాల్లో ఉత్తీర్ణుడయ్యాడు. చదువుకుంటూనే ఏడాది నుంచి పాలకొల్లులోని ఒక ఫొటో స్టూడియోలో ఎడిటింగ్‌ పని చేస్తున్నాడు. పాలకొల్లు నుంచి ప్రతీ రోజూ తన అమ్మమ్మ ఊరు తాళ్లపాలెం వెళుతుంటాడు. సన్నిబాబుకు ఒక చెల్లెలు ఉంది. తల్లి దుబాయ్‌లో ఉంటుంది. తండ్రి పాలకొల్లులో కూలీ పనులు చేసుకుంటూ ఉంటాడు.

కంప్యూటర్‌ క్లాస్‌కు వెళుతూ..

పెంటపాడు, మే 19(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో కంప్యూటర్‌ క్లాస్‌కు వెళుతున్న యువకుడు మృతి చెందాడు. మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన యర్రంశెట్టి వీర వెంకట సత్యనారాయణ అలియాస్‌ సతీష్‌(17) ఇంటర్‌ పూర్తి చేసుకుని తాడేపల్లిగూడెంలో కంప్యూటర్‌ క్లాస్‌కు వెళుతున్నాడు. సోమవారం కూడా యధావిదిగా క్లాస్‌కు వెళ్లి తిరిగి తన ఇంటికి మోటార్‌ సైకిల్‌పై వెళుతుండగా పెంటపాడు కాలేజ్‌ సెంటర్‌ సమీపంలో వైజాగ్‌ నుంచి భీమవరం వెళుతున్న కంటైనర్‌ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ స్వామి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు.

గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం

గణపవరం, మే19 (ఆంధ్రజ్యోతి): గణపవరం పిప్పర నుంచి భీమవరం వెళ్లే ప్రధాన రహదారిలోని కనకదుర్గమ్మ గుడి ఎదురుగా పంటకాల్వలో 60 ఏళ్ల గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం ఉంది. సోమవారం వీఆర్వో ఇచ్చిన సమాచారం మేరకు గణపవరం ఎస్సై ఆకుల మణికుమార్‌ వెలికితీసి కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు తెలియజేయాలని ఎస్సై కోరారు. మృతదేహంపై ఎటువంటి గాయాలుకానీ, ఏమిలేవని ఆయన తెలిపారు.

Updated Date - May 20 , 2025 | 12:49 AM