వరుసగా ఢీకొన్న మూడు బస్సులు
ABN , Publish Date - May 22 , 2025 | 12:20 AM
జాతీయ రహదారిపై భీమడోలు కనకదుర్గమ్మ ఆలయ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి మూడు ట్రావెల్స్ బస్సులు వరుసగా ఒక దానినొకటి వేగంగా ఢీకొన్నాయి.
భీమడోలు వద్ద ప్రమాదంలో 8 మందికి గాయాలు
భీమడోలు, మే 21 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై భీమడోలు కనకదుర్గమ్మ ఆలయ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి మూడు ట్రావెల్స్ బస్సులు వరుసగా ఒక దానినొకటి వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌లో చిరుద్యోగాలు చేసుకుంటున్న 8 మంది గాయపడ్డారు. జాతీయ రహదారిపై బస్టాండ్ సమీపంలో ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. వ్యాన్‌లో డ్రైవర్ భార్య ఇరుక్కుపోవడంతో బయటకు తీసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ను మళ్లించేందుకు కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో డివైడర్ వద్ద ట్రాఫిక్ కోన్ ఉంచారు. అర్ధరాత్రి సమయంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి హైదరాబాద్ వెళుతున్న మూడు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ట్రాఫిక్ కోన్‌లు ఉంచిన చోట ఒకదానిని ఒకటి వెనక నుంచి వేగంగా ఢీకొన్నాయి. మూడు బస్సుల్లో సుమారు 120 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఎనిమిది మందికి స్వల్పగాయాలయ్యాయి. వారంతా హైదరాబాద్‌లో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటారని పోలీసులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రామారావు (ద్రాక్షారామం), కొటింగ నాగరాజు (రావులపాలెం), కొటింగ మీరమ్మ (రావులపాలెం), పెద పట్నం బాపన్న (మామిడి కుదురు), విత్తనాల నాగరాజు (అమలా పురం), పేసినకుర్తి కంటిబాబు (హైదరాబాద్), విత్తనాల దీపక్‌కుమార్ (హైదరా బాద్) గాయపడ్డారు. వారిని బస్సు నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు భీమడోలు పోలీసులు తెలిపారు.
ఒకే చోట.. ఐదు నెలల్లో ఐదుగురి మృతి
జాతీయ రహదారిపై భీమడోలు వద్ద డివైడర్ ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇక్కడ ఐదు నెలల్లో జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. 31 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసు నివేదికలు చెబుతున్నాయి. ఏలూరు–కొవ్వూరు జాతీయ రహదారి, ఏలూరు–తాడేపల్లి గూడెం జాతీయ రహదారిపై డివైడర్ల సమీపంలో ప్రమాదాలు నిత్య కృత్యం అయ్యాయి. ప్రమాదాల నివారణకు అధికారులు, పోలీసులు నామమాత్రపు చర్యలతో చేతులు దులిపేసుకుంటున్నారు. భీమడోలు కనకదుర్గమ్మ ఆలయ సమీపంలో డివైడర్, అయ్యప్పస్వామి ఆలయం, కురెళ్లగూడెం, పూళ్ల, కోడూరు పాడు, పి.కన్నాపురం రైల్వే గేటు, కొండ్రెడ్డినగర్, పోలసానపల్లి బ్రిడ్జి ప్రాంతాల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.