బొమ్మ పడట్లేదు !
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:28 AM
ఒకప్పుడు సినిమా విడుదల అవుతుందంటే పల్లె, పట్నం తేడా లేదు.. ఓ పండుగ వాతావరణం ఉండేది. టికెట్టు దొరికితే చాలు ఆ లెక్కే వేరుగా ఉండేది.. సినిమా విడుదలకు ముందురోజు అర్ధరాత్రి నుంచే అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరేవారు.. ఏడాదికాలం ఒకే సినిమాను నడిపిన థియేటర్లూ ఉండేవి.
ప్రశ్నార్థకంగా సినీ థియేటర్ల మనుగడ
మసకబారుతున్న వెండితెర వెలుగులు
ఆదరణలేక మూసివేత.. ఫంక్షన్‌హాళ్లుగా మార్పు
ద్వారకాతిరుమల : ఒకప్పుడు సినిమా విడుదల అవుతుందంటే పల్లె, పట్నం తేడా లేదు.. ఓ పండుగ వాతావరణం ఉండేది. టికెట్టు దొరికితే చాలు ఆ లెక్కే వేరుగా ఉండేది.. సినిమా విడుదలకు ముందురోజు అర్ధరాత్రి నుంచే అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరేవారు.. ఏడాదికాలం ఒకే సినిమాను నడిపిన థియేటర్లూ ఉండేవి. ప్రస్తుతం రోజులు మారాయి. వినోదరంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఓటీటీల రాకతో థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పల్లెల్లో సైతం ఎన్నోఏళ్లు కళకళ లాడిన సినిమాహాళ్లు ప్రస్తుతం తమ ప్రాభవాన్ని కోల్పోయాయి.. పలుచోట్ల మూతపడి వ్యాపార కేంద్రాలుగాను, ఫంక్షన్ హాళ్లుగా మారాయి. దీనిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
చిత్రపరిశ్రమ మనుగడకు సినిమా థియేటర్ల ప్రాధాన్యం అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు సదరు పరిశ్రమ మనుగడకు రకరకాల ఆదాయమార్గాలు అందుబాటులోకి రావడంతో థియేటర్ వ్యవస్థ క్రమంగా కుప్పకూలిపోతోంది. మూడు గంటలపాటు అన్ని బాధలను మరిపింప చేసే శక్తి సినిమాకు ఉంది. మనపై ఎంతో ప్రభావాన్ని చూపే సినిమాను అందించే థియేటర్‌తో ప్రేక్షకులకు ఎంతో ఎమోషనల్ బాండ్ ఉంది. ఇటీవల సినీ అభిమానులు థియేటర్లకు మధ్య దూరం పెరుగుతోంది. వీటికి ప్రధానంగా సరైన సినిమాలు తీయకపోవడం,
టికెట్ ధరల పెంపు, ముఖ్యంగా ఓటీటీ, పైరసీల పెరుగుదల, అభిరుచి మారడం వంటి కారణాలతో ప్రేక్షకులు సినిమా హాళ్లకు వచ్చేందుకు విముఖత చూపుతున్నారు. ఈమేరకు కొన్నిచోట్లఽ థియేటర్లు సందడి లేకుండా మూగబోతుంటే మరికొన్ని చోట్ల అవి మూతబడుతున్నాయి. ఈక్రమంలో పల్లెల్లో సైతం ఎన్నాళ్లుగానో ప్రేక్షకులను అలరించిన సినిమాహాళ్లు ప్రస్తుతం మూతపడి ఇతర ఆదాయవనరుగా మారాయి. దీనిలో భాగంగా ద్వారకాతిరుమల మండలంలోని తిమ్మాపురం, జి.కొత్తపల్లి గ్రామాల్లోని సినిమా
థియేటర్లు ఒకటి వ్యాపార కేంద్రంగాను మరొకటి ఫంక్షన్ హాల్‌గా మారింది. ద్వారకాతిరుమలలో ఉన్న సినిమాహాల్ పూర్తిగా మాయమైంది. అది ఎక్కడ ఉండేదో ఇప్పుడు వారికి అసలు తెలియదు.
30 శాతం థియేటర్ల మూత..
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో 139వరకు థియేటర్లు ఉండగా పలు కారణాలతో 43 థియేటర్లు మూతపడ్డాయి. 96 థియేటర్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఒక్క ఏలూరులోనే గతంలో ఉండే కల్పన థియేటర్, కేసరి, వెంకట్రామ, రమామహల్, పాండురంగ. వేదరాజ్ వంటి థియేటర్లు కనుమరుగయ్యాయి. వాటి స్థానాల్లో వ్యాపారకేంద్రాలు, అపార్ట్‌మెంట్లుగా వెలిశాయి.
ఒకప్పటి సినీ థియేటర్ల కబుర్లు..
ఆనాటి కాలంలో టికెట్ల ధర నేల రూ.0.25 పైసలు, బెంచి రూ.0.40 పైసలు, కుర్చీ రూ.0.75పైసలు. థియేటర్ల ప్రత్యేకత ఏమిటంటే టికెట్లు ఇస్తూనే ఉండేవారట.. నేల ఫుల్‌గా నిండి ఒకరి భుజాలమీద ఇంకొకరు కూర్చున్నప్పటికీ టికెట్లు ఇస్తూనే ఉండేవారు. బెంచి క్లాస్‌లో అదనంగా బెంచీలు, బాల్కనీలో ఇనుప కుర్చీలు వేసేవారు.. నేలకి ఏ సౌకర్యం లేదు.. ఒకరిమీద ఇంకొకరు.. ఎవరు ఎలా కూర్చున్నా ఎవరికి పట్టదు.. ఆడవాళ్ల నేల క్లాసులో జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకోవడమే.. ఈ ఉత్పాతంలో బొమ్మపడేది... ఊపిరాడని ఈ స్థితిలో కూడా బీడీలు, సిగరెట్లు గుప్పుగుప్పు మని రగిలిపోయేవి. కథ మంచి రసపట్టులో ఉండగా నిమ్మసోడా.. అని ఒకడు వేయించిన శనక్కాయలూ అంటూ మరొకడు.. నేల క్లాసులో కూర్చున్న వారి కాళ్లు తొక్కుకుంటూ అమ్మకాలు సాగించేవారు.
ఇక బెంబి క్లాస్‌లో వేలాది నల్లులు ఎప్పుడో థియేటర్ కట్టినప్పుడు అవి ఎక్కడి నుంచో వలస వచ్చిఉంటాయ్.. ప్రేక్షకులు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ వారు వచ్చిన వెంటనే కుటుంబసమేతంగా దాడి చేస్తుండేవి.
ఇక కుర్చీలు బాల్కనీలో ఉంటాయి. చినిగిపోయి దూది, కొబ్బరి పీచు బయటికి వచ్చి మనల్ని వెక్కిరిస్తుంటాయి... ఇక్కడ పెద్దగా నల్లులుండవు కానీ మేకులు దిగిపోతుంటాయి.. ఇక అన్ని క్లాసులలోనూ ఉన్న ఫాన్లు.. వాటి కింద సీటు సంపాదించడం కష్టం... సంపాదించినా అవి సవ్యంగా తిరగే ఫ్యాన్లు అయి ఉండడం కష్టమే... అక్కడితో మనకష్టాలు ఆగవు. కరెంటు వాళ్ల దయ లేకుంటే పవర్‌కట్. ప్రేక్షకులు ఇక పిచ్చెక్కినట్లు అరవడం... ఈలలు వేసి గోల చేస్తారు.. ఇప్పుడు అనేక సౌకర్యాల మధ్య సినిమా చూస్తున్నా అప్పటి ఆ ఉత్సాహం ఉల్లాసం... ఇక రాదనే చెప్పాలి.
రాయితీలు ఇవ్వకుంటే మనుగడ కష్టమే..
గతంలో ప్రేక్షకులకు ఒక్క సినిమానే ఎంటర్‌టైన్ మెంట్ ఇచ్చేది. టీవీలు రావడం... ఆ తరువాత పైరసీలు, ఓటీటీల ప్రభంజనంతో థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకమైంది. దాదాపు 52 ఏళ్ల క్రితమే ఉషాపిక్చర్స్ బ్యానర్‌తో జిల్లాలో మొదటగా కార్యాలయాన్ని ప్రారంభించా. ఇప్పటివరకు 2,249 సినిమాలు విడుదల చేశాం. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్టులో నా పేరు ఎక్కింది... ఈ పరిశ్రమ మనుగడకు ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం.. ఇతర పరిశ్ర మలకు ఇచ్చే అన్ని రాయితీలను వర్తింపచేయాలి. కరెంటు రాయితీలు, సబ్సిడీపై రుణాలను థియేటర్ల యజమానులకు ఇవ్వాలి... పది శాతం దిగువకు జీఎస్టీ, పైరసీలను అరికట్టడంతో పాటు వందరోజుల తర్వాతే సినిమాలను ఓటీటీలలో విడుదల చేయాలి. ప్రభుత్వం ప్రోత్సహించ కుంటే రానున్న రోజుల్లో థియేటర్లన్నీ మూతపడే అవకాశం ఉంది.
– డాక్టర్ వడ్లపట్ల వెంకట బాలకృష్ణారావు, ఉషా పిక్చర్స్ అధినేత, ఏలూరు.