Share News

మోసం గురూ..!

ABN , Publish Date - Jun 24 , 2025 | 01:04 AM

భీమవరానికి చెందిన ఓ రైతుకు పదెకరాల ధాన్యం సొమ్ము అకౌంట్‌లో పడింది. తర్వాత రోజు బ్యాంకునుంచి మాట్లాడుతున్నామంటూ ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది.

 మోసం గురూ..!

మెసేజ్‌లు, ఫోన్‌ల ద్వారా ఎర

ఉద్యోగాలు, లాటరీల పేరిట మోసాలు

ఆదమరిస్తే ఇకంతే సంగతులు

ఏడాది కాలంలో 36 కేసులు..

పోలీసు స్టేషన్‌ మెట్లు ఎక్కని వారెందరో..

భీమవరానికి చెందిన ఓ రైతుకు పదెకరాల ధాన్యం సొమ్ము అకౌంట్‌లో పడింది. తర్వాత రోజు బ్యాంకునుంచి మాట్లాడుతున్నామంటూ ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. బ్యాంక్‌ ఖాతా నెంబర్‌, తర్వాత ఫోన్‌కు వచ్చే నాలుగు అంకెలు చెప్పమనగానే ఆ రైతు చెప్పేశాడు. అంతే సెకన్ల వ్యవధిలో ఖాతాలోవున్న రూ.4 లక్షలను దుండగులు లాగేశారు.

తాడేపల్లిగూడెంకు చెందిన ఒక వ్యక్తికి మొబైల్‌ఫోన్‌ లో ఒక లింక్‌ వచ్చింది. లక్ష విలువైన లాప్‌టాప్‌ను రూ.5 వేలకే అందజేస్తామని దానిలోని సారాంశం. ఆశపడిన ఆ వ్యక్తి వారు అడిగిన వివరాలన్నీ ఆన్‌లైన్‌లోనే పొందుపరిచాడు. అంతే అతని అకౌంట్‌లోని లక్ష రూపాయలను అవతలి వ్యక్తులు మాయం చేశారు. నెత్తీనోరూ కొట్టుకోవడం ఇతని వంతైంది.

నరసాపురానికి చెందిన ఒక మహిళ విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంది. ఆన్‌లైన్‌ ద్వారా విషయం పసిగట్టిన సైబర్‌ నేరగాళ్లు.. ఆమెకు ఫోన్‌ చేసి లండన్‌లో ఉద్యోగం, మంచి జీతం అంటూ ఎర వేశారు. వారంలో వీసా, విమానం టిక్కెట్‌ పంపిస్తామని, నమ్మించి రూ.2 లక్షలు లాగేశారు. లండన్‌లో ఉద్యోగం వచ్చిందని అందరినీ సర్‌ఫ్రైజ్‌ చేద్దామనుకుని ఆమె చేతులు కాల్చుకుంది.

(భీమవరం క్రైం–ఆంధ్రజ్యోతి):

ప్రజల్లోని ఆత్యాశ, తెలియనితనాన్ని ఆసరాగా తీసుకుని సైబర్‌ నేరగాళ్ల చెలరేగిపోతున్నారు. అమాయకులను దోచుకుంటున్నారు. రకరకాల మాయమాటలు చెప్పి వారి ద్వారా.. వారి బ్యాంకు ఖాతాల్లోని సొమ్ములను కాజేస్తున్నా రు. ఇలాంటి మోసాలు ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. పోలీసు స్టేషన్లలో కొందరు ఫిర్యాదు చేస్తుంటే.. ఎక్కువమంది బయటకు చెబితే తమ పరువే పోతుందని గుట్టుగా ఉంటున్నారు. జరుగుతున్న మోసాలను పత్రికలు, టీవీల ద్వారా నిత్యం చూస్తున్నా, పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. చాలా మందిలో మార్పు రావడం లేదు. ఫలితంగా సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడు తున్నారు. సోషల్‌ మీడియాలో మనం పెడుతున్న పోస్టుల ఆధారంగా వారు మన మానసిక పరిస్థితిని అంచనా వేస్తున్నారు. మన బ్యాంకు ఖాతాల్లోని నగదును పసిగట్టి నమ్మించి మోసం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఫోన్‌ చేస్తున్నామంటూ అమాయకులకు, మహిళలకు ఫోన్లు చేసి వారి ద్వారా ఓటీపీని రాబట్టుకుంటున్నారు. అనంతరం టెక్నాలజీని వినియోగించి ఖాతాలోని సొమ్మును దోచుకుంటున్నారు. మీ ఖాతా సమయం పూర్తయ్యిందని, ఓటీపీ చెబితే కేవైసీ చేసి బతికిస్తామంటూ కాజేస్తున్నారు.

సైబర్‌ నేరాలు అంటే ఏమిటి

సైబర్‌ నేరాల్లో ఎక్కువ బ్యాంకు ఖాతాకు సంబంధించినవే ఉన్నాయి. భీమవరంలో ఇటీవల ఓ రైతు ఖాతా నుంచి పెద్ద మొత్తంలో లాగేశారు. మొబైల్‌ ఫోన్లకు రకరకాల లింక్‌లను ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి వాటికి పంపించి.. అవతలి వారు వాటిని క్లిక్‌ చేయగానే మన ఖాతాలోని నగదు అవతలి వారి ఖాతాకు మళ్లిపోతోంది. విదేశాల్లో ఉద్యోగాలు ఉన్నాయని, అవతలి వారు తెలియని నెంబర్ల నుంచి ఫోన్‌ చేస్తున్నారు. అది నమ్మిన కొందరు వారికి వివరాలు చెప్పడంతోపాటు వారు అడిగినట్లు కొంత నగదు పంపిస్తున్నారు. తర్వాత నుంచి ఆ నెంబర్‌ పని చేయకపోవడంతో మోసపోయామని వారికి అర్థవుతోంది. ఇలాంటి నేరాలు ఏడాదిలో జిల్లాలో 35 వరకు నమోదయ్యాయి. ఇక నమోదు కాని కేసులెన్నో..

సైబర్‌ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. తెలియని నెంబర్ల ఉండి ఫోన్‌ కాల్‌ వస్తే లిఫ్ట్‌ చేయకూడదు. తెలియక లిఫ్ట్‌ చేసినా వారికి ఎటువంటి వివరాలను తెలియపరచరాదు. మొబైల్‌ ఫోన్లకు వచ్చే ఎటువంటి తెలియని లింక్‌లను ఓపెన్‌ చేయకూడదు. ముఖ్యంగా కొందరు ఫోన్లను పిల్లలకు ఇస్తూ ఉంటారు. వారు తెలియక లింక్‌లను క్లిక్‌ చేయడంతో ఖాతాలో ఉన్న నగదు అంతా మాయమవుతుంది. పిల్లలు ఆన్‌లైన్‌లో గేముల కోసం తెలియని నెంబర్లకు డబ్బు పంపుతూ ఉంటారు. అవి నకిలీ అకౌంట్లని తెలియక మోసపోతూ ఉంటారు. ముందుగా మన అకౌంట్‌కు కొంత మొత్తం పంపిస్తారు. అనంతరం ఫోన్‌ చేసి పొరపాటున మీ అకౌంట్‌కు డబ్బులు వచ్చాయని, ఆ డబ్బులను తిరిగి అదే నంబర్‌కు జమచేయాలని కోరతారు. అలా ఫోన్‌ వస్తే వెంటనే వారికి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి తమ సొమ్మును తీసుకోమని చెప్పాలని తెలిపారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా ఫోన్‌ చేసినా, బ్యాంకు నుంచి ఫోన్‌ చేస్తున్నామని చెప్పినా అసలు నమ్మరాదు. బ్యాంకు వారు ఎవరూ కస్టమర్లకు ఫోన్‌ చేసి ఎటువంటి వివరాలను అడగరనేది జగమెరిగిన సత్యం.

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

ఇటవల సైబర్‌ మోసగాళ్లు బాగా పెరిగారు. వారు చేసే మోసాలకు చాలా మంది అమాయకులు కూరుకుపోతున్నారు. వారి మాయమాటల వల్ల అన్ని వివరాలు వారికి తెలియజేయడంతో వారి పని సులువుగా మారిపోతుంది. అపరిచితులు, అగంతకులు కొత్త నంబర్ల నుంచి ఫోన్‌ చేస్తే స్పందించకూడదు. బ్యాంకు ఖాతా వివరాలు అసలు చెప్పకూడదు. ఫోన్లకు వచ్చే లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్‌ చేయకూడదు. నేరాలు ఎక్కువగా జరగడం వల్ల వారు ఎవరనేది కనిపెట్టడం కష్టతరంగా మారుతుంది. ఇతర రాష్ట్రాల వ్యక్తులే ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారు. వారిపై ప్రత్యేక నిఘా పెట్టాం. అపరిచితులు ఫోన్‌ చేస్తే వెంటనే దగ్గరలో ఉన్న పోలీసులకు లేదా సైబర్‌ క్రైం టోల్‌ఫ్రీ నెంబర్‌ 1930 కు తెలియజేయండి.

– ఆర్‌జి.జయసూర్య, భీమవరం డీఎస్పీ

Updated Date - Jun 24 , 2025 | 01:04 AM