Share News

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు అనారోగ్యం

ABN , Publish Date - May 23 , 2025 | 12:35 AM

ప్రభుత్వా సుపత్రుల్లో ప్రసవించిన తల్లిని బిడ్డతో సహా ఇంటి వద్ద సురక్షితంగా చేర్చే తల్లి, బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహన డ్రైవర్లకు మూడు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడు తున్నారు.

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు అనారోగ్యం

జీతాలు లేక డ్రైవర్ల ఇబ్బందులు

నిర్వహణ కరువైన వాహనాలు

భీమవరం టౌన్‌, మే 22(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవించిన తల్లిని బిడ్డతో సహా ఇంటి వద్ద సురక్షితంగా చేర్చే తల్లి, బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహన డ్రైవర్లకు మూడు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడు తున్నారు. ఏడేళ్లుగా వీరు నెలకు రూ.18,500 జీతంతో నెట్టుకొస్తున్నారు. ఎప్పటికైనా జీతాలు పెరగకపోతాయా అని ఆశతో కొనసాగుతున్నా.. ఎటువంటి ప్రయోజనం కనిపించటం లేదు. దీంతో డ్రైవర్లు ఆందోళనబాట పట్టారు. జిల్లాలో తల్లి, బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు 14 ఉన్నప్పటికి తొమ్మిది మాత్రమే సేవలందిస్తున్నాయి. అవి కూడా ఏడాదిగా నిర్వహణ సరిలేదు. ఇంజన్‌ ఆయిల్‌ మార్చక, టైర్లు పూర్తిగా పోయి, సీట్లు చిరిగిపోయి అధ్వానంగా ఉన్నాయి. తణుకులో ఆరు, భీమవరం ఒకటి, తాడేపల్లిగూడెం రెండు, పాలకొల్లు ఒకటి, నరసాపురం రెండు, ఆచంట ఒకటి, పెనుగొండలో ఒక వాహనం ఉన్నాయి. ప్రస్తుతం తణుకులో మూడు వాహనాలకు డ్రైవర్లు లేక మూలకు చేరాయి. ఆచంటలోను ఇదే పరిస్థితి. ప్రస్తుతం తొమ్మిది మంది డ్రైవర్లే విధి నిర్వహణలో ఉన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవించిన తల్లులను బిడ్డలతో సహా వారిని ఇంటి వద్ద దించేందుకు 2016లో వీటిని ఏర్పాటు చేసింది. 2019 ప్రభుత్వం మారిన తర్వాత వీటి నిర్వహణ పట్టించుకోకపోవడంతో పరిస్థితి ఇలా తయారైంది. ప్రభుత్వం స్పందించి చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న తమ సమస్యలను పరిష్కరించాలని తల్లి, బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్ల యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఎం.నాగార్జున కోరుతున్నారు.

Updated Date - May 23 , 2025 | 12:35 AM